Srikakulam: తల్లిదండ్రులను మత్తులో ఉంచి..బాలికపై ఏడాదిగా అత్యాచారం
ABN , Publish Date - Oct 24 , 2025 | 05:30 AM
తండ్రి అనారోగ్యాన్ని, తల్లి బలహీనతను ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి వారి 14 ఏళ్ల కుమార్తెపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు.
శ్రీకాకుళం జిల్లాలో వెలుగుచూసిన దాష్టీకం
ఆటోడ్రైవర్‌తో పాటు, బాధితురాలి తల్లిపైనా పోక్సో కేసు
రణస్థలం, అక్టోబరు 23 (ఆంధ్రజ్యోతి): తండ్రి అనారోగ్యాన్ని, తల్లి బలహీనతను ఆసరాగా చేసుకున్న ఓ వ్యక్తి వారి 14 ఏళ్ల కుమార్తెపై ఏడాదిగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలో వెలుగుచూసిన ఈ దాష్టీకానికి సంబంధించి పోలీసుల కథనం మేరకు.. మండలంలో ఓ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతూ.. స్థానిక పరిశ్రమలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఆయన నిద్రపోవాలంటే అందుకు సంబంధించిన మాత్ర వేసుకోవాల్సిందే. ఆయన కుమార్తె పక్క గ్రామంలోని ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. ఇతర విద్యార్థులతో కలిసి ఆటోలో పాఠశాలకు వెళ్లి వస్తోంది. ఈ క్రమంలో ఆటోడ్రైవర్ పిన్నింటి రామారావు కన్ను ఆ బాలికపై పడింది. తండ్రి అనారోగ్య ఇబ్బందిని గ్రహించి, ఆపై బాలిక తల్లికి మద్యం అలవాటు చేశాడు. తల్లిండ్రులిద్దరూ మత్తులో ఉన్న సమయంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. గత ఏడాదిగా ఈ దుశ్చర్య కొనసాగిస్తున్నాడు. ఓ రోజు అనుమానం వచ్చి తండ్రి మాత్ర వేసుకోలేదు. కుమార్తెపై ఆటోడ్రైవర్ లైంగిక దాడి చేసేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నాడు. దీంతో బాలిక ఏడాదిగా జరుగుతున్న అఘాయిత్యాన్ని తండ్రికి చెప్పగా, జేఆర్‌పురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మద్యానికి బానిసగా మారిన బాలిక తల్లి కూడా ఈ విషయంలో ఆటోడ్రైవర్‌ను ప్రోత్సహించినట్టు పోలీసులు గుర్తించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు బాలిక తల్లిపై, ఆటోడ్రైవర్‌పై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్‌ఐ ఎస్.చిరంజీవి తెలిపారు.