Organic Coffee: ఐరోపాకు అరకు కాఫీ
ABN , Publish Date - Sep 03 , 2025 | 05:07 AM
అరకు ఆర్గానిక్ కాఫీని ఐరోపా దేశాలకు ఎగుమతి చేయనున్నామని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి తెలిపారు. ఆమె ఆంధ్రజ్యోతితో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు.
ప్రతి జిల్లాలో జీసీసీ ప్రత్యేక స్టాల్
12 ఎకరాల్లో, 10 కోట్లతో కాఫీ క్యూరింగ్ సెంటర్
‘ఆంధ్రజ్యోతి’తో వీసీఎండీ కల్పనాకుమారి
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)
అరకు ఆర్గానిక్ కాఫీని ఐరోపా దేశాలకు ఎగుమతి చేయనున్నామని గిరిజన సహకార సంస్థ (జీసీసీ) వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కల్పనాకుమారి తెలిపారు. ఆమె ‘ఆంధ్రజ్యోతి’తో ప్రత్యేకంగా మాట్లాడుతూ పలు వివరాలు వెల్లడించారు. ‘ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా ఆగస్టు 9, అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం రోజున పాడేరులో జీసీసీ కొత్త లోగో ఆవిష్కరింపజేశాం. ఆధునికీకరించిన వెబ్‌సైట్ అందుబాటులోకి తెచ్చాం. ఐరోపా దేశాలకు ఇప్పటివరకు థర్డ్ పార్టీల ద్వారా ఆర్గానిక్ కాఫీ పంపిస్తున్నాం. ఇకపై నేరుగా జీసీసీయే అందిస్తుంది. దానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటివరకూ గిరిజనుల నుంచి కాఫీ గింజలు సేకరించిన తరువాత అటవీ శాఖ వద్ద క్యూరింగ్, మరో దగ్గర రోస్టింగ్, ఇంకొకరి వద్ద ప్యాకింగ్ చేయిస్తున్నాం. ఇకపై కాఫీ పండ్ల సేకరణ నుంచి ప్యాకింగ్ వరకు అన్నీ జీసీసీయే చేస్తుంది. దీనికోసం అనకాపల్లి జిల్లా మాకవరపాలెం మండలంలో 12 ఎకరాల భూమిలో రూ.10 కోట్లతో కాఫీ క్యూరింగ్ సెంటర్ పెడుతున్నాం. ఇక్కడ జీసీసీ అవసరాలకే కాకుండా ఇతరులకు కూడా క్యూరింగ్, రోస్టింగ్ వంటి పనులు చేస్తాం’ అని కల్పన తెలిపారు.
ఆర్గానిక్ కాఫీకి కిలోకి రూ.100 అదనం
‘గిరిజనుల నుంచి సేకరించిన చెర్రీ కాఫీకి కిలోకు రూ.230 ఇస్తున్నాము. ఆర్గానిక్ సర్టిఫికేషన్ చేయించిన తరువాత వారికి కిలోకు అదనంగా మరో రూ.100 ఇస్తున్నాం. ఆరు క్లస్టర్లలో మూడు వేల ఎకరాల్లో ఆర్గానిక్ కాఫీ పండిస్తున్నారు. మరో మూడు వేల ఎకరాలకు విస్తరిస్తున్నాం. జీసీసీకి చెందిన పాత లోగోలో చిన్న చిన్న తప్పులున్నాయి. వాటిని సవరించి రాజధాని అమరావతి స్థూపం అందులో ప్రతిబింబించేలా కొత్తది రూపొందించాం. వెబ్‌సైట్ మార్కెటింగ్‌కు సంబంధించినది కాబట్టి దానిని కూడా ఆధునికీకరించాం’ అని వివరించారు.
ట్రైఫెడ్‌తో ఎంఓయూ
‘కేంద్ర గిరిజన సంస్థ ట్రైఫెడ్‌తో ఒప్పందం చేసుకొని దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న వారి షాపుల్లో కూడా జీసీసీ ఉత్పత్తులు విక్రయానికి పెడుతున్నాం. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో జీసీసీ ఉత్పత్తుల విక్రయ కేంద్రాలు పెట్టబోతున్నాం. విజయనగరం వంటి జిల్లాలో ఇప్పటికే ఉన్నప్పటికీ వాటికి తగిన గుర్తింపు లేదు. జీసీసీకి చెందిన అన్ని ఉత్పత్తుల ప్యాకింగ్ మార్చేశాం. ఏజెన్సీలో గిరిజనులకు నిత్యవసర సరకులను డీఆర్ డిపోల ద్వారా సరఫరా చేస్తున్నారు. వీటిని ఇకపై చౌక ధరల దుకాణాలు (ఫెయిర్ ప్రైస్ షాపు-ఎఫ్‌పీ)గా మార్చి, ప్రభుత్వం సరఫరా చేసే వస్తువులతో పాటు జీసీసీ ఉత్పత్తులు కూడా విక్రయిస్తాం. మొత్తం 900 డీఆర్ డిపోలు ఎఫ్‌పీ షాపులుగా మారనున్నాయి. గిరిజనుల నుంచి అంతకు ముందు రూ.6 కోట్ల విలువైన అటవీ ఉత్పత్తులు సేకరించాం. గతేడాది రూ.12 కోట్లు చేశాం. ఈసారి రూ.24 కోట్ల విలువైన ఉత్పత్తులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’ అని కల్పన తెలిపారు.