Share News

ఉచిత ప్రయాణానికి సిద్ధం..!

ABN , Publish Date - Jul 30 , 2025 | 11:29 PM

రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కానుంది.

   ఉచిత ప్రయాణానికి సిద్ధం..!

- సర్వీసులు, సిబ్బందిపై కసరత్తు

- బస్సులను సిద్ధం చేసే పనిలో అధికారులు

- 40 శాతం మహిళా ప్రయాణికులుగా గుర్తింపు

- ప్రస్తుతం ఆర్టీసీకి రోజుకు రూ.65లక్షలు ఆదాయం

- ప్రధాన రోడ్ల సర్వీసులపై ఆరా

నంద్యాల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు కానుంది. సూపర్‌-6 హామీల్లో ప్రధానమైన ఉచిత బస్సు ప్రయాణంపై ఏడాదిగా మహిళలు ఎదురుచూస్తున్నారు. దీంతో ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచి ఈ పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇదే విషయంపై ఇటీవల శ్రీశైలం, నందికొట్కూరు పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడు స్పష్టం చేశారు. దీంతో జిల్లా ఆర్టీసీ అధికారులు సైతం ఆ దిశగా చర్యలు చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల్లో సిబ్బంది కసరత్తు మొదలు పెట్టారు. ఉచిత ప్రయాణంతో రద్దీ పెరిగే అవకాశం ఉంది. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సుమారు 1.20 లక్షల మంది ప్రయాణికులు బస్సుల్లో ప్రయాణిస్తుండగా.. ఇందులో 40 శాతం మంది మహిళా ప్రయాణికులు ఉన్నారు. ఈ లెక్కన ఆర్టీసీకి రోజుకు రూ.65లక్షలు ఆదాయం సమకూరేది. ఆయితే మహిళలకు ఉచిత ప్రయాణంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా నష్టం చేకూరనుంది. ఆ నష్టాన్ని ఓ వైపు భర్తీ చేస్తూనే ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం అవకాశం కల్పించనుంది.

ఫ జిల్లాలో రోజువారి ప్రయాణికులు ఇలా

----------------------------------------------------------------------

డిపోలు బస్సులు ప్రయాణికులు (రోజు)

---------------------------------------------------------------------

నంద్యాల 110 24,000

ఆత్మకూరు 72 22,000

ఆళ్లగడ్డ 74 20,000

బనగానపల్లె 65 18,000

డోన 52 14,600

కోవెలకుంట్ల 52 19,000

నందికొట్కూరు 69 19,000

------------------------------------------------------------------------

(బాక్స్‌లో వేసుకో)

ఫ జిల్లాలో బస్సుల సంఖ్య : 494

ఫ జిల్లాలోని డిపోలు : 07

ఫ ప్రతి రోజు ప్రయాణం : 1.65 లక్షల కిలోమీటర్లు

ఫ ప్రయాణికులు : 1.20 లక్షలు

ఫ ఇందులో మహిళలు : 40 వేల మంది

ఫ ప్రతి రోజు ఆదాయం : రూ.65 లక్షలు

ఫ ఇటీవల కొత్తగా వచ్చిన బస్సులు : 20

ఫ అవసరమయ్యే డ్రైవర్లు, కండెక్టర్లు : 10+10

--------------------------------------------------------

ఫ డిపోల వారీగా

ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత ప్రయాణం నేపథ్యంలో జిల్లా ఆర్టీసీ అధికారులు ఎక్కడిక్కడ ఆయా పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో ఎక్కడిక్కడ బస్సులు.. సర్వీసులు.. సిబ్బంది అడ్జెస్ట్‌మెంట్‌ తదితర అంశాలపై క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. మరీ ప్రధానంగా ఆయా డిపోల వారిగా ప్రయాణికులకు డిపోలో అందించే మౌళిక సదుపాయాలపై కూడా ఆరా తీసి తగిన విధంగా ఏర్పాటు చేస్తున్నారని తెలిసింది. అదేవిధంగా ఆయా బస్సుల్లోను ప్రయాణికుల కు ఇబ్బంది లేకుండా ఆయా బస్సులకు చిన్నపాటి మరమ్మత్తులు చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 320 గ్రామాలకు బస్సులు సర్వీసులు ఉండగా.. ఉచిత ప్రయాణంతో జిల్లాలో మేజర్‌ పంచాయతీలు.. ప్రధాన రోడ్లపై సర్వీసుల్లో మరింత పెంచే విధంగా యోచిస్తున్నారు. ఆ దిశగా తగిన నివేదికను ఇదివరకే ఉన్న తాధికారులకు నివేదించారని తెలిసింది. ఏది ఏమైనా ఉచిత ప్రయాణం నేపథ్యంలోనైనా ఆయా డిపోల్లో ప్రయాణికులు మౌలిక సదుపాయాలు ఆశించిన స్థాయిలో కల్పిస్తారా...? లేదా.. అనే సందేహాలు లేకపోలేదు.

ఎక్కడి నుంచి ఎక్కడికైనా..

రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేలా ప్రభుత్వం కసరత్తు పూర్తి చేసింది. నిజానికి మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని తొలుత జిల్లాలకే పరిమితం చేయాలని భావించిన ప్రభుత్వం.. తర్వాత మనసు మార్చుకుంది. జిల్లాలకు పరిమితం చేస్తే పెద్ద ప్రయోజనం ఉండదనే ఉద్ధేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు పథకం అమలు చేయాలని నిర్ణయించింది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఇప్పటికే రవాణా శాఖ మంత్రి మండ్లిపల్లి రాంప్రసాద్‌ రెడ్డి, ఏపీఎస్‌ ఆర్టీసీ చైర్మన కొనకళ్ల నారాయణ, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు ప్రకటనలు కూడా చేశారు. అయితే అధికారికంగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావాల్సి ఉంది. అదేవిధంగా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించనున్నారు.

ఫ మహిళలకు అండగా ప్రభుత్వం

- సుభద్ర, రాయమల్పూరం

బస్సుల్లో మహిళలకు కూటమి ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పిస్తే పేద మధ్య తరగతి మహిళలకు ఎంతో మంచిది. పేద మహిళలకు అండగా కూటమి ప్రభుత్వం ఉన్నట్లే. చదువుకునే అమ్మాయిలకు కూడా ఎంతో ఉపయోగకరం. ఉచిత ప్రయాణంతో చాలా మంది పేద ప్రయాణికులకు ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంది.

ఫ ఉచిత ప్రయాణానికి సిద్ధం

- రజియా సుల్తానా, ఆర్టీసీ ఆర్‌ఎం, నంద్యాల

ఉన్నతాధికారుల అదేశాలు ప్రకారం జిల్లాలో మహిళలకు ఉచిత ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లను సిద్ధం చేస్తున్నాం. డిపోలకు సంబంధించిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేశారు. ఈ వారంలో స్పష్టమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడం పేద, మద్య తరగతి వర్గాలకు చెందిన మహిళలకు ఎంతో ఉపయోగకరం. ప్రభుత్వం నుంచి అనుమతి ఏ రోజు వచ్చినా తక్షణమే ఉచిత ప్రయాణం అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నాం.

Updated Date - Jul 30 , 2025 | 11:29 PM