Germany Investments: రాష్ట్రంలో పెట్టుబడులకు జర్మనీ సిద్ధం!
ABN , Publish Date - Oct 19 , 2025 | 03:10 AM
జర్మనీకి చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు...
మంత్రి కొండపల్లి.. అక్కడి పారిశ్రామికవేత్తలతో సమావేశాలు
అమరావతి, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): జర్మనీకి చెందిన పారిశ్రామికవేత్తలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చెప్పారు. ఐదు రోజులుగా జర్మనీ, స్విట్జర్లాండ్‌లలో పర్యటిస్తున్న ఆయన శనివారం జ్యూరిచ్, ఫ్రాంక్‌ఫర్డ్, బెర్లిన్‌లలో ఉన్నతస్థాయి సమావేశాల్లో పాల్గొన్నారు. ఫ్రాంక్‌ఫర్డ్ వాణిజ్య పరిశ్రమల చాంబర్ డైరెక్టర్, సీనియర్ ప్రతినిధులతో చర్చించారు. జర్మన్-ఏపీ పారిశ్రామికవేత్తల మధ్య వ్యాపార సహకారం, ఉమ్మడి వ్యాపారాలను సులభతరం చేయడానికి విజయవాడలో జర్మనీకి చెందిన చాంబర్ ఆఫ్ కామర్స్ ఏపీ చాప్టర్‌ను స్థాపించాలని కోరినట్లు మంత్రి తెలిపారు. ఐక్యరాజ్యసమితి పారిశ్రామికాభివృద్ధి సంస్థ(యునిడో) ప్రతినిధులతోను, ఫ్రాంక్‌ఫర్డ్‌లోని యాక్సెంచర్ ఇండో-జర్మన్ పారిశ్రామికవేత్తలతోనూ మంత్రి శ్రీనివాస్ చర్చలు జరిపారు. నవంబరు 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరిగే సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొనాలని వారిని ఆహ్వానించారు.