Share News

General Secretary G. Sai Prasad: ఆన్‌లైన్‌లోనే రెవెన్యూ ఫిర్యాదులు

ABN , Publish Date - Dec 19 , 2025 | 05:51 AM

రెవెన్యూ శాఖలో ప్రజా విన్నపాలను ఇకపై ఈ-ఆఫీస్‌లోనే ప్రాసెస్‌ చెయ్యాలని జిల్లా కలెక్టర్లకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయుప్రసాద్‌ సూచించారు.

General Secretary G. Sai Prasad: ఆన్‌లైన్‌లోనే రెవెన్యూ ఫిర్యాదులు

  • ఇకనుంచి పేపర్‌ ఫైలు ఉండటానికి వీల్లేదు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రెవెన్యూ శాఖలో ప్రజా విన్నపాలను ఇకపై ఈ-ఆఫీస్‌లోనే ప్రాసెస్‌ చెయ్యాలని జిల్లా కలెక్టర్లకు ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయుప్రసాద్‌ సూచించారు. పేపర్‌ ఫైల్‌పై ప్రాసెస్‌ చేయడానికి వీల్లేదన్నారు. పేపర్‌ పోయిందనో, ఫైలు కనిపించడం లేదనో చెప్పే అవకాశం ఉందని, ఈ-ఫైల్‌ మాత్రమే పెట్టాలని స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్ల సమావేశంలో రెండో రోజు గురువారం సాయంత్రం ఆయన ప్రజంటేషన్‌ ఇచ్చారు. పిటిషన్ల తిరస్కారం, అందులో అధికారుల వైఫల్యం, ఇంకా అనేక దీర్ఘకాలిక జాడ్యాలను ఆయన ప్రస్తావించారు. రెవెన్యూలో 5.5 లక్షల విన్నపాల్లో 85 శాతం పరిష్కరిస్తే సంతృప్త స్థాయి 56 శాతమే ఉందని తెలిపారు. మన్యం జిల్లా కలెక్టర్‌ అమలు చేస్తున్న రెవెన్యూ క్లినిక్‌ మంచి ఫలితాలిస్తోందని, ఇందులో 94 కేసులు పరిష్కరిస్తే 100 శాతం సంతృప్తస్థాయి వచ్చిందని పేర్కొన్నారు. ఏలూరు, బాపట్లలో కలెక్టర్లు కూడా మంచి విధానాలు పాటించారని చెప్పారు. రెవెన్యూ దరఖాస్తుల పరిష్కారం ఆశించిన స్థాయిలో లేదని, లోపం ఎక్కడుందో గుర్తించాలని ఆయన కలెక్టర్లను కోరారు. మొత్తం ప్రజెంటేషన్‌ను ఆసక్తిగా విన్న సీఎం చంద్రబాబు.. ‘గుడ్‌ మెసేజ్‌, గుడ్‌ కమిట్‌మెంట్‌’ అని ప్రశంసించారు. ఇదే నిబద్ధతను ప్రజా సమస్యల పరిష్కారంలో చివరి వరకూ కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా పిటిషన్ల పరిష్కారంలో ఎదురవుతున్న సమస్యలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను సాయిప్రసాద్‌ వివరించారు.

  • ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను నిర్దేశిత గడువు ముగిసే సమయానికి తిరస్కరిస్తున్నారు. బాధితులు వెళ్తే మరోసారి దరఖాస్తు చేసుకోమని చెబుతున్నారు. తిరస్కరణలో రాష్ట్ర సగటు 23 శాతం. విజయవాడ, విశాఖ, నెల్లూరులో తిరస్కరణ 33 శాతం ఉంది. వీటిని ఎందుకు తిరస్కరిస్తున్నారో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి కూర్చుంటేనే కలెక్టర్లకు తెలుస్తాయి.


  • మ్యుటేషన్‌, భూమి స్వభావం మార్చాలన్న దరఖాస్తులు లక్షల్లో వస్తున్నాయి. జేసీలు సమయం కేటాయించలేకపోవడంతో పెండింగ్‌ల సంఖ్య పెరిగిపోతోంది. అందుకే జేసీల అధికారాల్లో కొన్నింటిని ఆర్‌డీవో, తహశీల్దార్‌కు బదలాయించాలని భావిస్తున్నాం.

  • 22(ఏ) నుంచి భూమిని తొలగించడం ఓ పెద్ద సమస్య. కలెక్టర్లు పౌరుల నుంచి మితిమీరిన అధారాలు అడుగుతున్నారు. 1920 నాటి డాక్యుమెంట్‌ పట్టుకురావాలని, వారి తాతలు ఎప్పుడు పుట్టారో ఆధారం తీసుకురావాలని తిప్పుతున్నారు. ఏ కేసులో ఎలాంటి ఆధారం అడగాలో త్వరలో నిర్ణయిస్తాం.

  • రీసర్వే, ఇతర అంశాల్లో రైతు పేరిట ఆన్‌లైన్‌లో నోటీసు జనరేట్‌ అవుతుంది. కానీ దాన్ని సంబంఽధిత వ్యక్తికి ఇవ్వడం లేదు. ఎవరో వచ్చి దరఖాస్తు పెడితే ప్రాసెస్‌ చేస్తున్నారు. అన్నీ అయ్యాక అసలు హక్కుదారు లబోదిబోమంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.

  • భూ సమస్యల పరిష్కారం కోసం ప్రజలు గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేస్తే దానిపై వీఆర్‌వో, సర్వేయర్‌ సంతకాలు అడుగుతున్నారు. ఇది అవసరమే లేదు. అయునా ఈ పేరుతో వారిని తిప్పించుకుంటున్నారు. ఫలితంగా సమస్యల పరిష్కారం ఆలస్యమవుతోంది. ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేసిన 58 శాతం కేసుల్లో ఇదే జరుగుతోంది.

  • వీఆర్‌వో, సర్వేయర్ల సంతకం, ఇన్షియల్‌ అవసరం లేకుండా ప్రజలు నేరుగా గ్రామ సచివాలయాల్లో పిటిషన్‌ ఇవ్వాలి. వాటిని కచ్చితంగా తీసుకోవాలి.

Updated Date - Dec 19 , 2025 | 05:54 AM