కుటుంబాన్ని బలిగొన్న గ్యాస్
ABN , Publish Date - Oct 12 , 2025 | 12:05 AM
ఆ దంపతులది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. సొంతిల్లు కూడా లేదు.
లీకేజీ ఘటనలో ముగ్గురి మృతి
వీరిలో ఓ గర్భిణి కూడా..
కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ మృత్యుఒడిలోకి..
ఎస్.బోయినపల్లిలో విషాదం
ఆ దంపతులది రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబం. సొంతిల్లు కూడా లేదు. సొంతూరిలోనే వారపాకలో అద్దెకు ఉంటూ వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఆ కుటుంబాన్ని విధి కూడా చిన్నచూపు చూసింది. గ్యాస్ రూపంలో మృత్యువు ఆ కుటుంబాన్ని కబళించింది. గ్యాస్ లీకేజీ కావడంతో గాయపడ్డ కుటుంబ సభ్యుల్లో.. దంపతులతో పాటు మూడేళ్ల కుమారుడు చికిత్స పొందుతూ మృతి చెందారు. పెద్ద కుమారుడు కూడా చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. తమలాంటి దుర్భర జీవితం తమ పిల్లలకు రాకూడదని ఆ తల్లిదండ్రులు పెద్ద కుమారుడిని చదివించుకుంటున్నారు. చిన్న కుమారుడిని కూడా బాగా చదివించాలని కలలు కన్నారు. ప్రస్తుతం మహిళ గర్భిణి కూడా. అయితే శిశువు బయటకు రాకముందే అమ్మ గర్భంలోనే కన్నుమూసింది. కలలో కూడా ఊహించని ఈ ఘటన ఆ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది.
వెల్దుర్తి, అక్టోబరు 11(ఆంధ్రజ్యోతి): గ్యాస్ లీకేజీ ఘటనలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. ఈ విషాద ఘటన మండలంలోని ఎస్.బోయినపల్లిలో జరిగింది. గ్రామానికి చెందిన నాగరాజు (40), సువర్ణ (32) దంపతులు వ్యవసాయ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. వీరికి అనిల్, చరణ్(3) ఇద్దరు కుమారులు ఉన్నారు. ఈనెల 5న అర్ధరాత్రి అద్దెకు ఉంటున్న వారపాకలో నిద్రిస్తున్న సమయంలో గ్యాస్ లీకు కావడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురూ తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని మెరుగైన వైద్యం కోసం కర్నూలు సర్వజన వైద్యశాలకు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం నాగరాజు మృతిచెందగా, శనివారం తెల్లవారుజామున చరణ్, సాయంత్రం సువర్ణ మృతి చెందారు. నాగరాజు, చరణ్ అంత్యక్రియలు శనివారం ఎస్.బోయినపల్లిలో నిర్వహించారు. గర్భిణి సువర్ణ అంతిమ సంస్కారాలు ఆదివారం నిర్వహించనున్నారు. అనిల్ పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్ద కుమారుడు అనిలో గ్రామంలోని ఎంపీపీ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతున్నాడు.