Tirumala Brahmotsavam: నేడే గరుడ వాహన సేవ
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:11 AM
తిరుమల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం గల గరుడ వాహన సేవ ఆదివారం జరుగనుంది. ఈసారి గరుడసేవను తిలకించేందుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు తిరుమలకు...
4 లక్షల మంది భక్తులు పాల్గొంటారని అంచనా
ఒక రోజు ముందే కిటకిటలాడుతున్న తిరుమల కొండ
శనివారమే నిండిపోయిన మాడ వీధుల్లోని గ్యాలరీలు
నిరంతరాయంగా అన్నప్రసాదాలు అందిస్తున్న టీటీడీ
భారీ భద్రతా ఏర్పాట్లు.. 4 వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షణ
తిరుమల, సెప్టెంబరు 27(ఆంధ్రజ్యోతి): తిరుమల బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రాధాన్యం గల గరుడ వాహన సేవ ఆదివారం జరుగనుంది. ఈసారి గరుడసేవను తిలకించేందుకు మూడు నుంచి నాలుగు లక్షల మంది భక్తులు తిరుమలకు చేరుకోవచ్చని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు తగ్గట్టే శనివారం ఉదయం నుంచే తిరుమలలో రద్దీ పెరిగింది. పవిత్ర పెరటాశి మాసం రెండవ శనివారం గరుడ సేవకు ముందు రోజు రావడంతో తమిళనాడు నుంచి భక్తులు వెల్లువలా వస్తున్నారు. జాతీయ రహదారిపైన వందల కిలోమీటర్ల నుంచి నడిచి వస్తున్న భక్తులు కనిపిస్తున్నారు. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలు కిటకిటలాడుతున్నాయి. వీరంతా మాడ వీధుల్లోని గ్యాలరీల్లోకి చేరారు. శనివారం కల్పవృక్ష వాహన సేవ సమయంలోనే గ్యాలరీలు నిండిపోయాయి. రాత్రి సర్వభూపాల వాహన సేవలోనూ భక్తులు అఽధికంగా కనిపించారు. వీరంతా ఆదివారం రాత్రి గరుడ వాహన సేవ పూర్తయ్యే వరకు గ్యాలరీల్లోనే కూర్చుంటారని అధికారులు భావిస్తున్నారు. వీరికి టీటీడీ నిరంతరాయంగా అన్నప్రసాదాలు, తాగునీరు అందిస్తోంది. గరుడ వాహన సేవ రోజు దాదాపు 5,600 మంది పోలీసు, విజిలెన్స్ సిబ్బందితో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. 4 వేల సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. గతేడాది కార్నర్ పాయింట్లలో ఏర్పాటు చేసిన క్యూలైన్ల వద్ద భక్తుల మధ్య తోపులాటలు చోటుచేసుకున్న క్రమంలో ఈసారి క్యూలైన్లు పొడిగించడంతో పాటు అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు వంటి సౌకర్యాలు కల్పించారు. మాడవీధుల ద్వారా 1.90 లక్షల మందికి, మాడవీధుల్లోని నాలుగు కార్నర్ పాయింట్ల ద్వారా 35 వేల మందికి గరుడ వాహన దర్శనం చేయించేలా టీటీడీ ఏర్పాటు చేసింది. గ్యాలరీల్లోకి, క్యూలైన్లలోకి రాలేని భక్తుల కోసం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 36 హెచ్‌డీ స్ర్కీన్లను కూడా ఏర్పాటు చేశారు.
కల్పవృక్ష, సర్వభూపాల వాహనాలపై శ్రీవారి విహారం
తిరుమల, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో నాలుగోరోజు శనివారం ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి సర్వభూపాల వాహనాలపై మలయప్పస్వామి భక్తులను కటాక్షించారు. వాంఛిత ఫలాలన్నింటినీ ప్రసాదించే కల్పవృక్ష వాహనంలో దేవేరులతో కలిసి శ్రీవారు రాజమన్నార్ అలంకారంలో ఉదయం మాడవీధుల్లో విహరించారు. మధ్యాహ్నం ఆలయంలోని రంగనాయక మండపంలో ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం కన్నుల పండువగా జరిగింది. 25 వేల తామరపూలు, 5వేల రోజాపూలు, పలు రకాల పండ్లతో మండపాన్ని అలంకరించారు. స్నపనం తర్వాత ఉత్సవ మూర్తులకు కశ్మీరు నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన మూడు కిలోల కుంకుమపువ్వుతో మాలలు అల్లి అలంకరించారు. వాటితోనే కిరీటాలు పెట్టారు. అలాగే శ్రీవిల్లిపుత్తూరు ఆలయం నుంచి వచ్చిన గోదాదేవి మాలలు, చెన్నైకి చెందిన హిందూ ధర్మార్ధసమితి తరపున నూతన గొడుగుల సమర్పణ కార్యక్రమం వేడుకగా జరిగింది. రాత్రికి శ్రీవారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి భక్తులను అనుగ్రహించారు.