Tirumala: తిరువీధుల మెరసీ దేవదేవుడు
ABN , Publish Date - Sep 29 , 2025 | 03:14 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడవాహనసేవ ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వజ్రవైఢూర్యాభరణాల అలంకరణతో మలయప్ప తన ఇష్టవాహనమైన...
తిరుమలలో కన్నుల పండువగా గరుడోత్సవం
పరవశించిన భక్తకోటి
తిరుమల, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో అత్యంత ప్రధానమైన గరుడవాహనసేవ ఆదివారం రాత్రి అంగరంగ వైభవంగా జరిగింది. వజ్రవైఢూర్యాభరణాల అలంకరణతో మలయప్ప తన ఇష్టవాహనమైన గరుడుడిని ఆధిరోహించి భక్తకోటికి దర్శనమిచ్చారు. తొలినాలుగురోజులూ పలుచగా కనిపించిన మాడవీధులు ఆదివారం కిక్కిరిసిపోయాయి. ఉదయం జరిగిన మోహినీ అవతారసేవ సమయంలోనే మాడవీధులు నిండిపోయాయి. 11 గంటల తర్వాత గేట్లను మూసివేశారు. మఽధ్యా హ్నం 3 గంటల వరకు గ్యాలరీల్లో అక్కడక్కడ ఉన్న ఖాళీలను నింపుతూ వచ్చారు. రాత్రి జరిగే గరుడసేవ ను వీక్షించడానికి సాయంత్రం 4 గంటలకే గ్యాలరీల్లోకి దాదాపు 2 లక్షల మంది చేరిపోయారు. సాయంత్రం 5 గంటల తర్వాత నాలుగు మాడవీధుల్లోని కార్నర్ పాయింట్ల నుంచి భక్తులను అనుమతించారు. ఇలా మొత్తం మీదుగా గ్యాలరీల నుంచి దాదాపు 2లక్షల మంది, అదనపు క్యూలైన్లు, ఆలయం ముందు రీఫిల్లింగ్ ద్వారా 30 వేల నుంచి 35 వేల మంది స్వామిని దర్శించుకున్నారు. సప్తగిరి వద్ద, నందకం వద్ద భక్తుల మధ్య స్వల్ప తోపులాటలు చోటుచేసుకున్నాయి.
అలిపిరిలోనే కార్లు ఆపివేత
గరుడోత్సవం సందర్భంగా తిరుమలలో ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలన్నీ ఉదయం 11 గంటలకే నిండిపోయాయి. దాదాపు 5 వేలకుపైగా కార్లు, ట్యాక్సీ లు తిరుమలకు చేరుకున్నాయి. దీంతో అలిపిరి చెక్‌పాయిట్ వద్ద 12 గంటల నుంచే ప్రైవేట్ వాహనాలను అనుమతించకుండా తిరుపతిలోని పార్కింగ్ ప్రదేశాలకు మళ్లించారు. ఈ వాహనాల్లోని భక్తులను ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు తరలించారు. ఆర్టీసీ బస్సులు, పాసులున్న టీటీడీ అధికారుల వాహనాలు మాత్రమే కొండెక్కాయి.
3 కిలోమీటర్ల క్యూ
మూలవిరాట్టు దర్శనానికి కూడా భక్తులు భారీగా క్యూకట్టారు. పెరటాశి మాసం రెండో శనివారం రద్దీ జత కావడంతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరి షెడ్లు సర్వదర్శన భక్తులతో నిండిపోయాయు. అక్కడ నుంచి కృష్ణతేజ, శిలాతోరణం, బాటగంగమ్మ, అక్టోపస్ భవనం సర్కిల్ వరకు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూలైన్‌లో భక్తులు బారులు తీరారు. వీరికి దాదాపు 36 గంటల తర్వాత దర్శనం లభిస్తుందని టీటీడీ ప్రకటన చేసింది.
ఉదయం మోహినీ అవతారంలో విహారం
ఆదివారం ఉదయం మోహినీరూపుడై శ్రీకృష్ణస్వామి సరసన మలయప్ప తిరువీధుల్లో విహరించాడు. బంగారు చిలుకను చేతపట్టుకుని, శ్రీవిల్లిపుత్తూరు మాలలను ధరించి, శ్వేతవస్త్రధారణతో దంతపల్లకిలో వినూత్నభంగిమలో ఆశీనుడై స్వామి దర్శనమిచ్చాడు. రోజూలా వాహనమండపంలో కాక, ఆలయంలోనే అలంకరణ పూర్తి చేసుకుని నేరుగా మాడవీధుల్లోకి ప్రవేశించి గ్యాలరీల్లోని భక్తులకు దర్శనమిచ్చారు.
మలయప్పకు మూలవర్ల ఆభరణాలు
గరుడుడిపై విహరించే శ్రీవారికి ఆలయంలో మూలవిరాట్టుకు అలంకరించే వజ్రాలతో పొదిగిన శంఖు, చక్రాలు, కౌస్తుభం, స్వర్ణ లక్ష్మీహారం, మకరకంటి, పచ్చ, సహస్రనామాలహారాన్ని అలంకరించారు. అంతకుముందు ప్రభుత్వం సమర్పించిన నూతన పట్టువస్త్రాలు, సారెను అర్చకస్వాములు వాహనమండపానికి ఊరేగింపుగా తీసుకువచ్చారు. సాయంత్రం 6.30 గంటలకు వాహనసేవను ప్రారంభించాల్సి ఉండగా, రద్దీ అధికమైన క్రమంలో 23 నిమిషాల ముందే వాహనసేవను మొదలుపెట్టారు. సరిగ్గా సాయంత్రం 6.07 గంటలకు వాహనమండపం తెరతీయగానే ఒక్కసారిగా భక్తులు చేసిన గోవిందనామస్మరణల మాడవీధులు మారుమోగాయి. కాగా, 7.20 గంటల సమయంలో వర్షం కురవడంతో కొద్ది సమయం ఘటాటోపం నీడలో వాహనాన్ని ముందుకు తీసుకెళ్లారు.