Simhachalam tragedy: గత ఐదేళ్లలో ఎన్నో ప్రమాదాలు.. అవన్నీ వైసీపీ ప్రభుత్వ హత్యలేనా
ABN , Publish Date - May 03 , 2025 | 05:13 AM
సింహాచలం ఘటనపై వైసీపీ చేస్తున్న విమర్శలను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. గతంలో వైసీపీ పాలనలో జరిగిన అనేక ప్రాణ నష్ట ఘటనలపైనా ప్రశ్నించారు.
‘అన్నమయ్య’లో కోటి పరిహారం ఇచ్చారా?
జగన్‌లా పగటి కలలు కనే నేతను చూడలేదు
గంటా శ్రీనివాసరావు ఆగ్రహం
విశాఖపట్నం, మే 2 (ఆంధ్రజ్యోతి): సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు మరణిస్తే అది ప్రభుత్వం చేసిన హత్య అంటూ వైసీపీ అధినేత జగన్, ఆ పార్టీ నాయకులు ఆరోపించడాన్ని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తప్పుబట్టారు. గత ఐదేళ్లలో వైసీపీ పరిపాలనలో జరిగిన ప్రమాదాలన్నీ ఆ ప్రభుత్వం చేసిన హత్యలేనా అంటూ ప్రశ్నించారు. ‘‘నాడు రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది, దేవీపట్నం బోటు ప్రమాదంలో 12 మంది, అన్నమయ్య ఆనకట్ట గేట్లు కూలిపోయి 39 మంది, విశాఖ ఎల్‌జీ పాలిమర్స్ నుంచి గ్యాస్ లీకై 17 మంది చనిపోయారు. అప్పుడు మేం ప్రతిపక్షంలో ఉన్నా జగన్‌లా బాధ్యతారాహిత్యంగా విమర్శలు చేయలేదు.’’ అని గంటా తెలిపారు. సింహాచలం ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటిస్తే, తాము ఇలాంటి సందర్భాల్లో రూ.కోటి చొప్పున ఇచ్చామని, ఇప్పుడూ అలా ఇవ్వాలని జగన్ అంటున్నారన్నారు.
ఒకవేళ ప్రభుత్వం ఇవ్వకపోతే తాను అధికారంలోకి వచ్చాక మిగిలిన రూ.75 లక్షలు ఇస్తానని కూడా జగన్ చెబుతున్నారని, ఇలాంటి పగటి కలలు కనే నాయకులను ఎక్కడా చూడలేమని గంటా వ్యాఖ్యానించారు. ఎల్‌జీ పాలిమర్స్‌లో మాత్రమే కోటి రూపాయల చొప్పున పరిహారం ఇప్పించారని, అవి కూడా యాజమాన్యం డబ్బులని గుర్తు చేశారు. అన్నమయ్య ఆనకట్ట ప్రమాద బాధితులకు రూ.10 లక్షలే ఇచ్చారన్నారు. సింహాచలంలో ‘ప్రసాద్’ పథకం పనులు 2022 డిసెంబరులో మంజూరైతే 24 నెలల్లో పూర్తి చేయాల్సి ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం కనీసం ఐదు శాతం కూడా పనులు చేయలేదని, కూటమి ప్రభుత్వం వచ్చాకే ఆ పనులను వేగవంతం చేశామన్నారు.
ఇవి కూడా చదవండి..