Share News

గన్నవరం సర్పంచ్‌పై వేటు

ABN , Publish Date - Nov 04 , 2025 | 12:33 AM

గన్నవరం గ్రామపంచాయతీ సర్పంచ్‌ నిడమర్తి సౌజన్యపై వేటు పడింది. గ్రామ పంచాయితీలో జరిగిన నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం సర్పంచ్‌ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ కలెక్టర్‌ బాలాజీ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు.

గన్నవరం సర్పంచ్‌పై వేటు

పదవి నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు జారీ

రూ.1.32 కోట్ల నిధుల దుర్వినియోగమే కారణం

ఉపసర్పంచ్‌కు తాత్కాలికంగా సర్పంచ్‌ అధికారాలు

(ఆంధ్రజ్యోతి, విజయవాడ/గన్నవరం) :

గన్నవరం గ్రామపంచాయతీ సర్పంచ్‌ నిడమర్తి సౌజన్యపై వేటు పడింది. గ్రామ పంచాయితీలో జరిగిన నిధుల దుర్వినియోగం వ్యవహారంలో జిల్లా పంచాయతీ అధికారి ఇచ్చిన నివేదిక ప్రకారం సర్పంచ్‌ పదవి నుంచి ఆమెను తొలగిస్తూ కలెక్టర్‌ బాలాజీ సోమవారం ఉత్తర్వులు ఇచ్చారు. సర్పంచ్‌ అధికారాలను తాత్కాలికంగా ఉపసర్పంచ్‌కు బదిలీ చేశారు. గన్నవరం పంచాయతీలో రూ.1.32 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగిందని జిల్లా అధికార యంత్రాంగం నిర్ధారించింది. గ్రామ కార్యదర్శితో కలిసి నిధులను దుర్వినియోగం చేసినట్టుగా విచారణలో తేలింది. పంచాయితీ రాజ్‌ చట్టాన్ని అనుసరించి సర్పంచ్‌, కార్యదర్శి ఇద్దరికి 1:1 నిష్పత్తి ప్రకారం ఇద్దరూ రూ.66,05,425 చెల్లించాలని, లేని పక్షంలో సర్పంచ్‌ పదవి నుంచి తొలగించాల్సి ఉంటుందని గతంలో నోటీసు ఇచ్చారు. ఈ డబ్బులు చెల్లించడానికి ఆరు నెలల సమయం ఇచ్చారు. ఈ ఆరు నెలల కాలంలో సర్పంచ్‌ చెక్కు డ్రాయింగ్‌ అధికారాలను కూడా నిలిపివేశారు. గ్రామ పంచాయతీ సాధారణ నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు, 15వ ఆర్థిక సంఘం నిధులను డ్రా చేసే అధికారాన్ని గుడివాడ డీఎల్‌పీవోకు అప్పగించడం జరిగింది. దీనిపై సర్పంచ్‌ నిడమర్తి సౌజన్య కలెక్టర్‌కు అప్పీలు చేసుకున్నారు. జూలై 19, 2024న నిడమర్తి సౌజన్య కలెక్టర్‌ ఎదుట వ్యక్తిగతంగా హాజరై లిఖిత పూర్వకంగా వివరణ ఇచ్చారు. సర్పంచ్‌ చేసిన అప్పీలుపై కలెక్టర్‌ రికార్డులను పరిశీలించి సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా గుడివాడ డీఎల్‌పీవోను ఆదేశించారు. గుడివాడ డీఎల్‌పీవో విచారణ జరిపి సమగ్ర నివేదికను కలెక్టర్‌కు అందజేశారు. దీంతో సర్పంచ్‌ చెక్‌ డ్రాయింగ్‌ పవర్‌ను నిషేధిస్తూ, డబ్బులు చెల్లించడానికి మరో మూడు నెలలు సమయం ఇచ్చారు. అయితే ఇచ్చిన గడువులోగా డబ్బులు సర్పంచ్‌ చెల్లించలేదు. దీంతో ఆమెను పదవి నుంచి తొలగించడానికి నోటీసు ఇచ్చారు. ఈ క్రమంలో మళ్లీ సర్పంచ్‌ నిధుల వినియోగానికి సంబంధించి ఓచర్లు ఉన్నాయని, చేసిన ఖర్చుకు పంచాయతీ ఆమోదం ఉందని, చెక్కు డ్రాయింగ్‌ అధికారాలను తిరిగి పునరుద్ధరించాల్సిందిగా కలెక్టర్‌ను అభ్యర్థించారు. సర్పంచ్‌ అందజేసిన వివరాలు సమగ్రంగా లేకపోవడంతో నిధులు దుర్వినియోగానికి పాల్పడినట్టు నిర్ధారించి ఆమె పదవి నుంచి తొలగిస్తూ కలెక్టర్‌ ఉత్తర్వులు ఇచ్చారు.

Updated Date - Nov 04 , 2025 | 12:33 AM