‘గ్యాంగ్’ సంగమేశ్వరం!
ABN , Publish Date - Apr 14 , 2025 | 12:51 AM
రైల్వే స్టేషన వద్ద పాగా వేస్తారు. రైలు దిగి స్టేషన నుంచి బయటకు వచ్చిన వారిని నిశితంగా గమనిస్తారు. ఉపాధి కోసం వచ్చిన వారితో మాట కలుపుతారు. ఊరు వాడ తెలుసుకుంటారు. ఆ తర్వాత వారి వ్యసనాలను కనిపెట్టి ఓ చోట పనిచేస్తే ఊహించని డబ్బు వస్తుందని ఆశ చూపుతారు. వారు సరే అనగానే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరానికి పంపుతారు. ఆ తర్వాత అక్కడ వారి నిర్బంధించి వెట్టి చాకిరి చేయించుకుంటారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న కార్మికులను ట్రాప్ చేసే ముఠా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ కూలీలను టార్గెట్ చేస్తున్నారు. ఇలా సంగమేశ్వరం వెళ్లి చిత్రహింసలు ఎదుర్కొన్న ఓ యువకుడు తప్పించుకుని రావడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.

విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు
రైల్వే స్టేషన వద్ద నిఘా.. వలస కూలీల ట్రాప్
ఆర్టీసీ బస్సుల్లో సంగమేశ్వరం తరలింపు
గుర్తింపు కార్డులు, ఫోన్లు లాక్కుని వెట్టి చాకిరి
తప్పించుకుని వచ్చిన విజయవాడ యువకుడు
రైల్వే స్టేషన వద్ద పాగా వేస్తారు. రైలు దిగి స్టేషన నుంచి బయటకు వచ్చిన వారిని నిశితంగా గమనిస్తారు. ఉపాధి కోసం వచ్చిన వారితో మాట కలుపుతారు. ఊరు వాడ తెలుసుకుంటారు. ఆ తర్వాత వారి వ్యసనాలను కనిపెట్టి ఓ చోట పనిచేస్తే ఊహించని డబ్బు వస్తుందని ఆశ చూపుతారు. వారు సరే అనగానే కర్నూలు జిల్లాలోని సంగమేశ్వరానికి పంపుతారు. ఆ తర్వాత అక్కడ వారి నిర్బంధించి వెట్టి చాకిరి చేయించుకుంటారు. ఉపాధి కోసం ఎదురు చూస్తున్న కార్మికులను ట్రాప్ చేసే ముఠా బాగోతం తాజాగా వెలుగులోకి వచ్చింది. రైల్వేస్టేషన పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ కూలీలను టార్గెట్ చేస్తున్నారు. ఇలా సంగమేశ్వరం వెళ్లి చిత్రహింసలు ఎదుర్కొన్న ఓ యువకుడు తప్పించుకుని రావడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
విజయవాడ రాజీవ్ నగర్‌కు చెందిన కూతాడి పవన కుమార్‌పై నున్న పోలీస్ స్టేషన్లో సస్పెక్ట్ షీటు ఉంది. అతడు ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. గతేడాది నవంబరులో తనతోపాటు ఆటోడ్రైవర్‌గా పనిచేసే రాము అనే యువకుడు అద్దెకు ఆటో ఇప్పిస్తానని తీసుకెళ్లాడు. రైల్వే స్టేషన వద్దకు తీసుకువెళ్లి అక్కడ వదిలేశాడు. తర్వాత కాసేపటికి సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్‌లో సస్పెక్ట్‌షీట్ ఉన్న ఓ వ్యక్తి అతని వద్దకు వెళ్లాడు. కాసేపు మాట్లాడి మందు తాగించాడు. తానే ఉపాధి చూపిస్తానని పవన కుమార్‌ను నమ్మించాడు. కొద్దిసేపటికి విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వారితో కల్పించుకుని మాట్లాడాడు. వాళ్లందరిని ఉపాధి చూపిస్తానని అక్కడే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన వ్యక్తి వద్దకు తీసుకెళ్లాడు. అతడు వారిని పండిట్ నెహ్రూ బస్‌స్టేషన్‌కు తీసుకువెళ్లి కర్నూలు బస్సు ఎక్కించాడు. అక్కడ బస్సు దిగిన తర్వాత ఒక వ్యక్తి ఆటోలో సంగమేశ్వరం తీసుకెళ్లాడు. అక్కడ నది ఒడ్డున ఏర్పాటు చేసిన షెడ్లలో వారిని ఉంచారు. అక్కడ నదిలో ఏర్పాటు చేసిన వలలను లాగే పనులకు వారిని ఉపయోగించారు. బయటకు వెళ్లిన పవన్‌కుమార్ తిరిగి రాకపోవడంతో అతడి కుటుంబ సభ్యులు నున్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదైంది.
కర్ణాటక సరిహద్దుకు పారిపోయి..
సంగమేశ్వరంలో వలలు లాగే పనుల కోసం తీసుకువెళ్లి చిత్రహింసలు పెట్టడంతో విజయవాడకు చెందిన పవన కుమార్ తప్పించుకుని కర్ణాటక సరిహద్దులకు పారిపోయాడు. అక్కడి నుంచి హోస్పేట్‌కు చేరుకుని కొద్దిరోజుల క్రితం విజయవాడలో ఉన్న తన సోదరులకు ఫోన చేశాడు. తినడానికి తిండి లేదని, చేతుల్లో డబ్బులు లేవని కన్నీరు పెట్టుకున్నాడు. తనతోపాటు మరో నలుగురు తప్పించుకుని ఇలా వచ్చేశామని వివరించాడు. వారిని ఒక షాపు వద్దకు పంపి, దాని యజమానికి గూగుల్‌పే ద్వారా భోజనాల కోసం కొంత డబ్బులు పంపారు. పవన్‌కుమార్‌తోపాటు తప్పించుకుని వచ్చిన మిగిలిన నలుగురు ఆ డబ్బులతో మద్యం తాగి నిద్రపోయారు. దీనితో చేసేది లేక పవన్‌కుమార్ సమీపాన ఉన్న పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. అతడితో మాట్లాడిన తర్వాత కుటుంబ సభ్యులు నున్న పోలీసులకు విషయం చెప్పారు. పోలీసులు హోస్పేట్ పోలీసులతో మాట్లాడారు. పవన్‌కుమార్ కుటుంబ సభ్యులు వస్తున్నారని పోలీస్ స్టేషన్లో ఉంచాలని తెలిపారు. తర్వాత పవన కుమార్ కుటుంబ సభ్యులు వెళ్లి అతడిని విజయవాడకు తీసుకువచ్చారు. సంగమేశ్వరంలో జరిగిన చిత్రహింసల గురించి అతడు నున్న పోలీసులకు వివరించాడు. ఉత్తర మండలం ఏసీపీ స్రవంతిరాయ్ అతడిని విచారించారు. పవన కుమార్‌కు ట్రాప్ జరిగిందంతా రైల్వేస్టేషన వద్ద కాబట్టి సత్యనారాయణపురం పోలీస్‌స్టేషనలో ఫిర్యాదు చేయాలని అతడిని అక్కడికి పంపారు.
అర్ధరాత్రి పని.. ఒక పూటే భోజనం
విజయవాడ రైల్వేస్టేషనకు ఉపాధి పనుల నిమిత్తం వచ్చిన వారిని ట్రాప్ చేయడానికి ఒక గ్యాంగ్ ప్రత్యేకంగా పనిచేస్తున్నట్టు పవన కుమార్ వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. సంగమేశ్వరంలో చేపల వేటకు నదిలో వేసిన వలలను బయటకు లాగడానికి అర్ధరాత్రి నుంచి మరుసటి రోజు రాత్రి వరకు పనిచేస్తున్నట్టు పవన కుమార్ పోలీసులకు వివరించాడు. సంగమేశ్వరం చేరుకోగానే వారి నుంచి ఆధార్ కార్డు, ఫోన్లు, డబ్బులు లాగేసుకుంటారు. ఆ తర్వాత అక్కడే నిర్మించిన షెడ్‌ల్లో వసతి ఇస్తారు. రోజుకు ఒకసారి మాత్రమే భోజనం పెడతారు. రాత్రిపూట టాయిలెట్‌కు వెళ్లనివ్వరు. ప్రతి షెడ్డు వద్ద పని చేయించుకునే యజమానుల కుటుంబ సభ్యులు కర్రలతో కాపలా కాస్తారు. ఎవరైనా పారిపోవడానికి ప్రయత్నిస్తే కర్రలతో చితకబాదుతారని పవన కుమార్ పోలీసులకు వివరించాడు. కార్మికులను ట్రాప్ చేసిన వారికి ఒక్కో వ్యక్తిపై రూ.5వేల కమీషన్ ఇస్తున్నట్టు పవన్‌కుమార్ తెలిపాడు.