Bar Association: 2 వరకు బెజవాడ బార్‌లో గాంధీ జయంతి ఉత్సవ్
ABN , Publish Date - Sep 28 , 2025 | 04:26 AM
అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్‌లో శనివారం నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు గాంధీ జయంతి ఉత్సవ్ పేరుతో మెగా కార్యక్రమాన్ని చేపట్టారు.
విజయవాడ లీగల్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్‌లో శనివారం నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు గాంధీ జయంతి ఉత్సవ్ పేరుతో మెగా కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా బెజవాడ బార్ ప్రాంగణంలో శనివారం సబర్మతి ఆశ్రమ నమూనా ఏర్పాటు చేసి గాంధీ చిత్రపటాలను ప్రదర్శించారు. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రవినాథ్ తిలహరి, జస్టిస్ నైనాల జయసూర్య, కృష్ణాజిల్లా జడ్జి గుట్టల గోపి, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎ.సత్యానందంతో పాటు 31 మంది న్యాయమూర్తులు పాల్గొని సబర్మతి ఆశ్రమాన్ని, ఫొటో గ్యాలరీని జ్యోతి వెలిగించి ప్రారంభించారు. అనంతరం మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఫొటో గ్యాలరీ ఎగ్జిబిషన్ తిలకించారు. ఈ కార్యక్రమానికి బెజవాడ బార్ అధ్యక్షుడు ఏకే బాషా అధ్యక్షత వహించి న్యాయమూర్తులకు గాంధీ జీవిత చరిత్ర పుస్తకాలను బహుకరించారు. కృష్ణాజిల్లా జడ్జి గోపి మాట్లాడుతూ గాంధీ జయంతి ఉత్సవాలు వారం రోజుల పాటు చేయడం ఎంతో ఆనందించదగ్గ విషయమని, ఈ ఉత్సవాలతో పాటు గాంధీ ఆశయాలను కూడా మనం తప్పక పాటించాలని తెలిపారు. జస్టిస్ నైనాల జయసూర్య మాట్లాడుతూ బెజవాడ బార్ ఆవరణలో సబర్మతి ఆశ్రమం ఏర్పాటు చేసి గాంధీజీ రోజులను గుర్తుచేయడం కొత్తగా అనిపించిందన్నారు. జస్టిస్ రవినాథ్ తిలహరి మాట్లాడుతూ గాంధీజీని గుర్తుచేసుకుంటూ ఈ విధమైన కార్యక్రమాలు చేయడం ఆయనకు ఎంతో గౌరవాన్ని ఇచ్చినట్టవుతుందన్నారు. ఆయన జీవిత చరిత్రను మనమందరం మననం చేసుకుంటూ ఆయన బాటలో నడవడానికి తప్పక ప్రయత్నించాలని, ప్రతి ఒక్కరూ ఆయన జీవిత చరిత్రని తెలుసుకోవాలని కోరారు.