Google AI Hub: ఏపీకి మేలి మలుపు
ABN , Publish Date - Oct 18 , 2025 | 03:53 AM
ప్రతి కథకూ ఒక ‘టర్నింగ్ పాయింట్’ ఉంటుంది! అక్కడే కథ మలుపు తిరుగుతుంది. నవ్యాంధ్ర ప్రస్థానం కూడా ఒక మేలిమలుపు తిరిగింది! వెంటవెంటనే జరిగిన రెండు పరిణామాలతో రాష్ట్ర భవిష్యత్తుపై...
‘గూగుల్’తో ఒప్పందంతో మారిన దృశ్యం
‘మళ్లీ జగన్ వస్తే’ అన్న ఆందోళనలు పటాపంచలు
పారిశ్రామికవేత్తలు, ప్రజల్లో సందేహాలకు చెక్
ప్రపంచవ్యాప్తంగా మార్మోగిన ఆంధ్రప్రదేశ్ పేరు
విశాఖలో సానుకూలతలపై విస్తృతంగా చర్చ
జాతీయ, అంతర్జాతీయ మీడియాలో కవరేజ్
పరిచయం అక్కర్లేని రాష్ట్రంగా మారిన ‘ఏపీ’
‘ఎకో సిస్టమ్’ ఏర్పడేందుకు ఇదో వేదిక
గూగుల్‌తో అనేక అనుబంధ సంస్థల రాక
ఇదంతా జీర్ణించుకోలేని వైసీపీ మేధావులు
విషం చిమ్మడమే అజెండాగా కుయుక్తులు
హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్‌ను రప్పించింది చంద్రబాబు నాయుడు. ఇప్పుడు విశాఖకు గూగుల్ వస్తున్నది కూడా చంద్రబాబు హయాంలోనే. ఇది యాదృచ్ఛికం కాదు. ఆయన అనుసరించే పాలసీ వల్లే ఇది సాధ్యమవుతోంది.
- ఫస్ట్‌పోస్ట్ విశ్లేషణ
హైదరాబాద్‌కు మైక్రోసాఫ్ట్ రాకతో ‘ఎకో సిస్టమ్’ డెవలప్ అయ్యింది. భాగ్యనగరం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. అనేక బహుళజాతి కంపెనీలు అక్కడికి తరలివచ్చాయి. ఇప్పుడు... దేశంలోనే రెండో అతిపెద్ద ఐటీ ఎక్స్‌పోర్ట్స్ కేంద్రం హైదరాబాద్! 1500లకు పైగా ఐటీ కంపెనీలు ఉన్నాయి. 9 లక్షలకుపైగా ఐటీ ఉద్యోగులకు హైదరాబాద్ కేంద్రం. ఇలాంటి ఎకో సిస్టమ్ నవ్యాంధ్రలోనూ రావాలంటే ఒక పెద్ద అడుగు పడాలి! అదే... విశాఖలో గూగుల్ ఏఐ హబ్!
(అమరావతి - ఆంధ్రజ్యోతి)
ప్రతి కథకూ ఒక ‘టర్నింగ్ పాయింట్’ ఉంటుంది! అక్కడే కథ మలుపు తిరుగుతుంది. నవ్యాంధ్ర ప్రస్థానం కూడా ఒక మేలిమలుపు తిరిగింది! వెంటవెంటనే జరిగిన రెండు పరిణామాలతో రాష్ట్ర భవిష్యత్తుపై పారిశ్రామికవేత్తల్లో ఉన్న సందేహాలు పటాపంచలయ్యాయి. ఒకటి... విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటుపై గూగుల్‌తో కుదిరిన ఒప్పందం! రెండు... కర్నూలు సభలో గురువారం ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన/శ్రీకారం చుట్టుకున్న ప్రాజెక్టులు, రాష్ట్రానికి స్పష్టమైన భరోసా ఇచ్చిన ఆయన ప్రసంగం! ఐదేళ్ల జగన్ పాలన పారిశ్రామికవేత్తలను, పెట్టుబడిదారులను భయపెట్టేలా సాగింది. జగన్ హయాం ముగిసి... కూటమి ప్రభుత్వం వచ్చినా ఆ భయాందోళనలు వెంటాడుతూనే ఉన్నాయి.
‘మళ్లీ జగన్ వస్తే’... అనే సందేహం రాష్ట్ర భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చే పరిస్థితి వచ్చింది. దీనిని చక్కదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా కృషి చేస్తున్నారు. పారిశ్రామికవేత్తల్లో నెలకొన్న ఆందోళనలు, సందేహాలను తొలగించే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఇప్పుడు... గూగుల్ రాక, కర్నూలు పర్యటనలో ప్రధాని ఇచ్చిన భరోసాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలు ఫలించినట్లయింది.
ప్రపంచానికి తెలిసిన ఏపీ...
పదకొండేళ్ల కిందట రాజధాని లేకుండా ఏర్పడిన రాష్ట్రం నవ్యాంధ్ర! ‘ఏపీ’ అంటే అదెక్కడ అని ప్రశ్నించే పరిస్థితి! దీనిని మార్చేందుకు తొలి ఐదేళ్లు చంద్రబాబు చేసిన కృషి... ఆ తర్వాత వచ్చిన జగన్ కారణంగా బూడిదలో పోసిన పన్నీరైంది. ఇప్పుడు... ‘గూగుల్ ఐఏ హబ్’ కారణంగా ‘ఆంధ్రప్రదేశ్’ పేరు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మార్మోగుతోంది. దేశంలోని అన్ని ప్రముఖ చానళ్లు దీనిని ప్రముఖంగా ప్రసారం చేశాయి. ఐటీ, ఆర్థిక నిపుణులతో చర్చలు నిర్వహించాయి. రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, విశాఖపట్నానికి ఉన్న సానుకూలతలపై విస్తృతస్థాయిలో చర్చ జరుగుతోంది. అమరావతి సైతం పెట్టుబడులను ఆకర్షించడంలో దూసుకుపోతుందని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ‘చాలామంది విస్మరిస్తున్న పేరు... అమరావతి. ఈ నగరం ఐటీ, విద్యా రంగంలో వందలకోట్ల పెట్టుబడులను ఆకర్షిస్తోంది’ అని ఒక ఆర్థికవేత్త పేర్కొన్నారు. వాల్‌స్ట్రీట్ జర్నల్ లాంటి పత్రికలూ గూగుల్‌తో ఒప్పందంపై కథనాలు ప్రచురించాయి. ఇప్పుడు... ‘ఆంధ్రప్రదేశ్’ పేరు ప్రపంచానికి పరిచయమైంది. దీనంతటికీ కారణం... గూగుల్‌తో ఒప్పందమే!
విధ్వంసం నుంచి వికాసం దిశగా..
జగన్ ఐదేళ్ల విధ్వంసంతో రాష్ట్రం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిపోయింది. వచ్చీ రాగానే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను రద్దు చేసి అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడిదారులను భయపెట్టారు. రివర్స్ ఇంజనీరింగ్‌తో కాంట్రాక్టు సంస్థలను బెదరగొట్టారు. రాజకీయ కక్షతో అమర్‌రాజా వంటి ప్రతిష్ఠాత్మక సంస్థనే బెదరగొట్టారు. దీంతో... ఆంధ్రప్రదేశ్‌పై పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో ‘నెగెటివ్ ముద్ర’ పడింది. కూటమి సర్కారు ఏర్పడిన తర్వాత అదే కొనసాగింది. తొలి 15 నెలల్లో టీసీఎస్ వంటి టెక్ దిగ్గజాలు, బీపీసీఎల్, ఆర్సెలార్ మిట్టల్ వంటిసంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైనా ‘మళ్లీ జగన్ వస్తే...’ అనే భయం పీడిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తూనే... అభివృద్ధి, పెట్టుబడులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పుడు ‘గూగుల్’తో ఒప్పందంతో ఒక్కసారిగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏపీకి సానుకూల వాతావరణం ఏర్పడింది. విశాఖలో సుమారు రూ.1.33 లక్షల పెట్టుబడి పెట్టేందుకు ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడం.. వాల్‌స్ట్రీట్ జర్నల్ వంటి అంతర్జాతీయ మీడియా సైతం గూగుల్ విశాఖ రాకపై పెద్ద ఎత్తున కథనాలు ఇవ్వడం.. ఆ వెంటనే కర్నూలు పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీ ఏపీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వడంతో రాష్ట్రంలో ఒక్కసారిగా సానుకూల వాతవరణం ఏర్పడింది. కర్నూలులో జరిగిన జీఎస్టీ సభలో గూగుల్ తాలుకా జోష్ ప్రజల్లో కనిపించింది.
అయినా విషం చిమ్మడమే!
‘గూగుల్ గేమ్ చేంజర్’ అని నిపుణులు విస్పష్టంగా చెబుతుండగా... వైసీపీ నేతలు దీనిపైనా విషం చిమ్ము తున్నారు. డేటాసెంటర్ వల్ల అనర్థమే అని వైసీపీ ముసుగులోని పర్యావరణవేత్తలు శోకాలు పెడుతుండ గా.. దానివల్ల ఒరిగేదేమీ ఉండదని, ఉద్యోగాలూ రావని వైసీపీ మేధావులు ప్రచారానికి తెరదీశారు. అయితే.. జగన్ పాలనను, చంద్రబాబు ట్రాక్ రికార్డును పోల్చి చూస్తున్న జనం వైసీపీ దుష్ప్రచారాన్ని నమ్మడంలేదు. గతంలో హైటెక్ సిటీ నిర్మాణ సమయలోనూ కంప్యూటర్లు కూడు పెడతాయా అంటూ విమర్శలు చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో 6 లక్షలకుపైగా ఐటీ, ఐటీ అనుబంధ రంగాల ఉద్యోగులున్నారు. గూగుల్ విషయంలోనూ అదే జరుగుతుందని విశ్వసిస్తున్నారు.