Gadkari urges service to humanity for peace: సేవతో శాంతి.. ఆనందం
ABN , Publish Date - Nov 21 , 2025 | 03:53 AM
ఇతరులకు అవసరమైన సేవలు అందించినప్పుడే మనకు ఆనందం, శాంతి చేకూరుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆకలితో ఉన్న వారికి ఆధ్యాత్మికత కంటే ఆహారమే ముఖ్యమని, వారికి ఆహారం అందించి నరుడి సేవయే నారాయణ సేవ అని సత్యసాయి చెప్పిన మాటలను అందరూ ఆచరించాలని అన్నారు...
సత్యసాయి సేవలకు వెల కట్టలేం
నరుడి సేవయే నారాయణ సేవ అన్నమాటలను అందరూ ఆచరించాలి
ఆకలితో ఉన్నవారికి ఆధ్యాత్మికత కంటేఆహారమే ముఖ్యం: కేంద్ర మంత్రి గడ్కరీ
పుట్టపర్తిలో 11వ అంతర్జాతీయ సదస్సు
45 దేశాల నుంచి 2500 మంది ప్రతినిధుల హాజరు
పుట్టపర్తి, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఇతరులకు అవసరమైన సేవలు అందించినప్పుడే మనకు ఆనందం, శాంతి చేకూరుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆకలితో ఉన్న వారికి ఆధ్యాత్మికత కంటే ఆహారమే ముఖ్యమని, వారికి ఆహారం అందించి నరుడి సేవయే నారాయణ సేవ అని సత్యసాయి చెప్పిన మాటలను అందరూ ఆచరించాలని అన్నారు. శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో జరుగుతున్న సత్యసాయి శత జయంతి వేడుకలలో ఆయన పాల్గొన్నారు. గురువారం ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ మందిరంలో శ్రీసత్యసాయి 11వ అంతర్జాతీయ సదస్సు ప్రారంభమైంది. సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ప్రతినిధులు రత్నాకర్, చక్రవర్తి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సత్యసాయి సంస్థల విద్యార్థుల వేద పఠనంతో కార్యక్రమం మొదలైంది. ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి గడ్కరీ మొదట సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం సదస్సులో ప్రసంగించారు. మనిషికి ఆశ పెరిగినప్పుడు అశాంతి నెలకొంటుందని, సామాజిక స్పృహ, సేవాభావంతో జీవనం సాగిస్తే సంతోషం వెల్లివిరుస్తుందని అన్నారు. సత్యసాయి ప్రేమ, సేవ అనన్యమని, తన బోధనలతో కోట్లాది మంది భక్తులకు ఆరాధ్యదైవం అయ్యారని అన్నారు. ‘‘సత్యసాయి జీవితం, బోధనలు, విలువలు, ప్రేమతత్వం, మానవాళిని శాంతిజీవనం వైపు నడిపిస్తున్నాయి. ప్రతి వ్యక్తి జీవితంలో శాంతి ముఖ్యం. శాంతి ఉన్నచోట సమస్యకు సహజ పరిష్కారం దొరుకుతుంది. భవిష్యత్తు ఎలా ఉంటుందోనన్న ఆందోళన పెంచుకుంటే అశాంతి పెరుగుతుందే తప్ప శాంతి దొరకదు. అవసరమైన సేవలు అందించడమే సేవకు పరమార్థం. ప్రతి వ్యక్తి తన జీవితాన్ని ఆనందంగా మార్చుకోవడానికి గురువు మార్గదర్శకం అయినట్లే.. సముద్రాల్లోకి వృథాగా పోతున్న నీటిని గురువు లాంటి డ్యామ్ ద్వారా ఉపయోగించుకోవాలి. సత్యసాయి అందించిన విద్య, వైద్యం, తాగునీటి సేవలకు వెల కట్టలేం. సత్యసాయి ప్రారంభించిన సేవలను మరింత పారదర్శకంగా కొనసాగిస్తున్న ట్రస్టు ప్రతినిధుల కృషి అభినందనీయం. నేను బోధించడానికి ఇక్కడికి రాలేదు. ఇక్కడున్న భక్తి, విలువలు, సేవాభావాన్ని చూసి మరింత ఎక్కువగా మంచి పనులు, సేవలు చేయాలన్న ప్రేరణ పొందడానికి వచ్చాను’’ అని అన్నారు. సదస్సు అనంతరం నితిన్ గడ్కరీని ట్రస్టు ప్రతినిధులు సత్కరించారు. సాయి కుల్వంత్ హాల్‌లో భక్తులు సంగీత కచేరి నిర్వహించారు. అంతర్జాతీయ సదస్సులో ట్రస్టు సభ్యులు డాక్టర్ మోహన్, ప్రసాద్, రాష్ట్ర మంత్రులు కందుల దుర్గేశ్, బీసీ జనార్దన్‌రెడ్డి, సత్యకుమార్ యాదవ్, సవిత తదితరులు పాల్గొన్నారు. 45 దేశాల నుంచి 2500 మంది ప్రతినిధులు హాజరయ్యారు.