Road Projects: రహదారుల పనుల జోరు
ABN , Publish Date - Aug 02 , 2025 | 04:06 AM
రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారుల పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ...
రాష్ట్రంలో పలు కొత్త ప్రాజెక్టులు
185 కి.మీ. పరిధిలో నిర్మాణం
రూ.2,381 కోట్ల పనులకు నేడు గడ్కరీ, సీఎం శంకుస్థాపన
అమరావతి, ఆగస్టు 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న రహదారుల పనులకు మోక్షం లభించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కేంద్ర జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ, జాతీయ రహదారుల సంస్థలు సంయుక్తంగా పలు కొత్త ప్రాజెక్టులు చేపట్టబోతున్నాయి. 185 కి.మీ. పరిధిలో కొత్తగా రూ. 2,381 కోట్లతో రహదారుల నిర్మాణం, విస్తరణ, అభివృద్ధి, ప్లైఓవర్‌ల నిర్మాణం చేపట్టబోతున్నారు. కేంద్ర రోడ్డురవాణా, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ, ముఖ్యమంత్రి చంద్రబాబు కలసి శనివారం ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇవి కాకుండా ఇప్పటికే కేంద్రం చేపట్టిన రెండు రహదారి ప్రాజెక్టు పనులు పూర్తయ్యాయి. వాటిని లాంఛనంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకురాబోతున్నారు.
శంకుస్థాపన చేసే ప్రాజెక్టులు
పల్నాడు జిల్లాలో చిలూకలూరిపేట నుంచి నకరికల్లు వరకు ఉన్న జాతీయ రహదారి 167ఏని రూ. 787 కోట్లతో విస్తరించబోతున్నారు. ఈ రహదారి 38 కిమీ పొడవు ఉంది.
రాజమండ్రిలో ఎన్‌హెచ్ 16పై గామన్ జంక్షన్ వద్ద రూ. 327 కోట్ల వ్యయంతో 3 కి.మీ. పొడవైన ప్లైఓవర్ నిర్మించబోతున్నారు. ఈ పనిని ఎన్‌హెచ్‌ఏఐ చేపట్టనుంది. లాలాచెరువు జంక్షన్ వద్ద ఎన్‌హెచ్ 216ఏను రూ. 232 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ రహదారి పొడవు 6 కి.మీ..
చింతూరు నుంచి మోటు వరకు ఉన్న ఎన్‌హెచ్ 326 రహదారిని రెండు వరుసలుగా విస్తరించనున్నారు. దీని నిర్మాణ వ్యయం రూ. 98 కోట్లు.
గురజాల నగరంలో మాచర్ల, రెంటచింతల బైపా్‌సరోడ్డు విస్తరణ పనులను రూ. 54 కోట్లతో విస్తరణ చేయనున్నారు.