AP Govt: కొత్త సీఎస్‌గా సాయిప్రసాద్
ABN , Publish Date - Nov 30 , 2025 | 04:52 AM
జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయిప్రసాద్‌ను నూతన ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
1991 బ్యాచ్ సీనియర్ ఐఏఎస్
మార్చి 1న బాధ్యతలు.. అప్పటి వరకూ విజయానంద్ కొనసాగింపు
సర్వీసు 3 నెలలు పొడిగింపు.. సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు
అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, సీనియర్ ఐఏఎస్ అధికారి జి.సాయిప్రసాద్‌ను నూతన ప్రధాన కార్యదర్శిగా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వచ్చే ఏడాది మార్చి 1వ తేదీన ఆయన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అప్పటి వరకూ ప్రస్తుత సీఎస్ విజయానంద్ పదవిలో కొనసాగనున్నారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. 1991 బ్యాచ్‌కు చెందిన సాయిప్రసాద్ ఇది వరకే సీఎస్ కావాల్సి ఉంది. కానీ అప్పట్లో వివిధ కారణాల వల్ల సీఎం చంద్రబాబు సీఎస్‌గా విజయానంద్‌ను ఎంపిక చేశారు. తొమ్మిది నెలలుగా ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. ఈ నెల 30వ తేదీన విజయానంద్ పదవీ విరమణ చేయాల్సి ఉంది. కానీ సీఎం చంద్రబాబు మరో మూడు నెలల పాటు విజయానంద్‌ను సీఎస్‌గా కొనసాగించాలని నిర్ణయించారు. దానికి అనుగుణంగా ఆయన సర్వీసు మూడు నెలలు పొడిగించాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం విజ్ఞప్తి చేశారు. సీఎం విజ్ఞప్తి మేరకు కేంద్రం విజయానంద్‌కు మూడు నెలల పొడిగింపు ఇస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. సీఎస్‌గా విజయానంద్‌కు మూడు నెలలు పొడిగింపు ఇస్తూ సాధారణ పరిపాలన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం జారీ చేసిన అదే ఉత్తర్వుల్లోనే 2026 మార్చి 1వ తేదీ నుంచి సాయిప్రసాద్ సీఎస్‌గా కొనసాగుతారని సృష్టం చేసింది. ముందుగానే సీఎ్‌సను నియమించడం గతంలో కూడా ఒకసారి జరిగింది. 2017లో అజయ్‌కల్లాంను సీఎస్‌గా నియమించారు. ఆయన పదవీ కాలం నెల రోజులే ఉన్నప్పటికీ సీనియార్టీ ప్రాతిపదికన అవకాశం ఇస్తూ.. అదే జీవోలో నెల తర్వాత దినేశ్ కుమార్ సీఎస్‌గా పనిచేస్తారని పేర్కొన్నారు.
216... ప్రత్యేకం
జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌లుగా ఆదిత్యనాథ్ దాస్, జవహర్‌రెడ్డి, సాయిప్రసాద్
వెలగపూడి సచివాలయంలోని జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ, ఒకే గది నుంచి సేవలందించిన ముగ్గురు అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా నియమితులయ్యారు. సచివాలయంలోని నాలుగో బ్లాకులో జల వనరుల శాఖకు కేటాయించిన 216 నంబరు గదిలో నుంచే జలవనరుల శాఖ ప్రత్యేక సీఎస్‌లుగా ఆదిత్యనాథ్ దాస్, కేఎస్ జవహర్‌రెడ్డి గతంలో విధులు నిర్వహించారు. వీరిద్దరికీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పదోన్నతి లభించింది. ప్రస్తుతం జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న జి.సాయిప్రసాద్ తాజాగా సీఎ్‌సగా నియమితులయ్యారు. ఒకే శాఖ.. ఒకే గది.. నుంచి ముగ్గురు సీఎస్‌లు అయ్యారని ఐఏఎస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పుడు ఈ గది ప్రత్యేక సెంటిమెంట్‌గా మారుతుందేమోనని కొందరు ఐఏఎస్‌లు అంటున్నారు.