Share News

DGP Harish Kumar Gupta: భవిష్యత్‌ పోలీసింగ్‌ ఏఐతోనే..

ABN , Publish Date - Jul 22 , 2025 | 05:52 AM

నేరాల తీరుతెన్నులు ఎప్పటికప్పుడు మారుతున్నాయని, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు కృత్రిమ మేధ తోడ్పాటు ఎంతో కీలకమని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా అన్నారు.

DGP Harish Kumar Gupta: భవిష్యత్‌ పోలీసింగ్‌ ఏఐతోనే..

  • ఫిర్యాదు నుంచి చార్జిషీటు వరకూ అదే చేస్తుంది: డీజీపీ

  • హరీశ్‌ గుప్తాను కలిసిన 28 మంది ట్రైనీ ఐపీఎస్‌లు

  • ఏఐ, అస్త్రం, శక్తి, ఈగల్‌పై అవగాహన

అమరావతి, జూలై 21(ఆంధ్రజ్యోతి): నేరాల తీరుతెన్నులు ఎప్పటికప్పుడు మారుతున్నాయని, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేందుకు కృత్రిమ మేధ తోడ్పాటు ఎంతో కీలకమని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్న 28 మంది యువ ఐపీఎస్‌లు సోమవారం మంగళగిరిలోని ఏపీ పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. శాంతిభద్రతల ఏడీజీ మధుసూదన్‌రెడ్డి, ఐజీలు ఆకే రవికృష్ణ, సీహెచ్‌ శ్రీకాంత్‌, రాజకుమారి తదితరులతో కలిసి వారికి డీజీపీ వృత్తిపరమైన మెలకువలతో పాటు కీలక సూచనలు చేశారు. రాష్ట్రంలో నేరాల కట్టడి , శాంతిభద్రతల నిర్వహణకు చేపడుతున్న చర్యలను వివరించారు. ‘‘మహిళల రక్షణకు ‘శక్తి’, గంజాయిని అరికట్టేందుకు ‘ఈగల్‌’ బృందాన్ని, అదేవిధంగా సైబర్‌ నేరాల కట్టడికి ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశాం. ట్రాఫిక్‌ నియంత్రణకు ‘అస్త్రం’ అమలవుతోంది. డ్రోన్లు పర్యవేక్షిస్తే సిబ్బంది అప్రమత్తమై ట్రాఫిక్‌ క్లియర్‌ చేస్తున్నారు. ఏపీ పోలీసింగ్‌లో ఏఐని ప్రవేశపెడుతున్నాం. ఫిర్యాదు నుంచి చార్జిషీటు వరకూ అన్నీ అదే చేస్తుంది. ఇటీవల గుంటూరులో ఏఐ హ్యాకథాన్‌ నిర్వహించి జాతీయస్థాయిలో నిపుణుల సలహాలు, సూచనలు తీసుకున్నాం.. శిక్షల శాతం పెంచడం నుంచి ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణకు నిరంతరం శ్రమిస్తున్నాం.. శాంతిభద్రతల పరిరక్షణలో కొత్త కొత్త సవాళ్లను ఎదుర్కొనేందుకు ఎప్పటికప్పుడు సిద్ధమవుతున్నాం’ అని డీజీపీ తెలిపారు.

Updated Date - Jul 22 , 2025 | 05:53 AM