Funeral of Maoist Leader Hidma: హిడ్మా అంత్యక్రియలు పూర్తి
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:05 AM
మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు హిడ్మా, రాజే దంపతులది ప్రేమ వివాహం. నమ్మిన సిద్ధాంతం కోసం కలిసి జీవించారు. కలిసే మరణించారు...
పువర్తికి భారీగా తరలివచ్చిన ఆదివాసీలు
చింతూరు, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): మోస్ట్ వాంటెడ్ మావోయిస్టులు హిడ్మా, రాజే దంపతులది ప్రేమ వివాహం. నమ్మిన సిద్ధాంతం కోసం కలిసి జీవించారు. కలిసే మరణించారు. చివరకు వారిని ఒకే పాడిపై మోసి, ఒకే చితిపై ఉంచి ఎర్రని వస్త్రాలు కప్పి దహనం చేశారు. పోస్టుమార్టం అనంతరం హిడ్మా దంపతుల మృతదేహాలను గురువారం వారి స్వగ్రామమైన ఛత్తీ్‌సగఢ్ రాష్ట్రం దక్షిణ సుక్మా జిల్లాలోని పువర్తికి తరలించారు. ఈ సందర్భంగా గిరిజనుల కన్నీళ్లతో పువర్తి తడిసి ముద్దైంది. కడసారి చూపు కోసం పరిసర ప్రాంతాల ఆదివాసీలు తండోపతండాలుగా కిలోమీటర్ల కొద్ది కాలినడకనే పువర్తికి చేరుకున్నారు. ఇళ్లకు తాళాలు వేసి చిన్నారులను, వృద్ధులను వెంటబెట్టుకొని అంతా తరలివచ్చారు. పాడె మోసేందుకు, చితిని పేర్చేందుకు గిరిజనులంతా పోటీపడ్డారు. కొడుకును కడసారి చూసుకొని హిడ్మా తల్లి వెక్కివెక్కి ఏడ్చారు. హిడ్మా చిన్నతనంలో ఇంట్లో వినియోగించిన సామగ్రిని కూడా అదే చితిపై దహనం చేశారు. కాగా, గురువారం తెల్లవారుజాము నుంచే పువర్తి జవాన్లతో నిండిపోయింది. నిఘా నేత్రాలు వెంటాడాయి.