అధికారుల తీరుతో నిధులు వెనక్కి
ABN , Publish Date - Dec 02 , 2025 | 11:02 PM
మున్సిపల్ అధికారుల తీరుతో ఎంపీ నిధులు వెనక్కి వెళ్తున్నాయని మున్సిపల్ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మున్సిపల్ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి ఆగ్రహం
నందికొట్కూరు, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ అధికారుల తీరుతో ఎంపీ నిధులు వెనక్కి వెళ్తున్నాయని మున్సిపల్ చైర్మన దాసి సుధాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మున్సిపల్ కార్యాలయంలో విలేకర్ల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలోని మారుతి నగర్, హాజీ నగర్ కాలనీవాసుల కోసం కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి ఎంపీ నిధుల నుంచి రూ.10 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. కమ్యూనిటీ హాల్ కోసం 20 సెంట్లు స్థలం సేకరించాలని టౌన ప్లానింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించగా, ఆయా కాలనీల్లో ఎలాంటి ప్రభుత్వ స్థలం అధికారులు నివేదిక ఇచ్చారన్నారు. దీంతో ఎంపీ నిధులు వెనక్కి వెళ్లే పరిస్థితి ఏర్పడిందని అసహనం వ్యక్తం చేశారు. అధికారులు రాజకీయాలు చేయాలనుకుంటే తమ ఉద్యోగాలకు రాజీనామా చేయాలని సూచించారు. అలాగే సంగయ్యపేట, సుబ్బారావుపేట, షికారిపేటలకు అందుబాటులో ఉండేందుకు రూ. 3 కోట్లతో నూతన పీహెచసీ మంజూరైతే అక్కడ స్థల సేకరణ చేయకుండా ఎవరూ లేని బైరెడ్డి నగర్‌లో స్థల సేకరణ చేయడం ఏమిటని అధికారులను ప్రశ్నించారు. మున్సిపల్ నిధులను కూడా దుర్వినియోగం చేస్తున్నారన్నారు. మున్సిపాల్టీలో ట్రాక్టర్ టయర్లు దెబ్బతింటే... నూతన టయర్లు ఏర్పాటు చేసేది పోయి నెలకు రూ.40 వేలు చెల్లిస్తూ మరో ట్రాక్టర్‌ను అద్దెకు ఏర్పాటు చేశారన్నారు. ఇలా ఐదు నెలలుగా దాదాపు రూ.2 లక్షలు ట్రాక్టర్ బాడుగ కింద చెల్లించారన్నారు. ట్రాక్టర్‌కు అద్దె చెల్లిస్తూ నిధులు దుర్వినియోగం చేస్తున్నారన్నారు. సమావేశంలో కౌన్సిలర్లు చాంద్‌బాషా, లాలుప్రసాద్, టీడీపీ నాయకులు సత్యనారాయణలు పాల్గొన్నారు.