Share News

నిధులు గోల్‌మాల్‌!

ABN , Publish Date - Jul 17 , 2025 | 12:18 AM

తరకటూరు పీఏసీఎస్‌లో నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. తీసుకున్న రుణం తిరిగి చెల్లించినా సెక్రటరీ రశీదు ఇవ్వకపోడంతో అనుమానం వచ్చిన రైతు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు రూ.78 లక్షల వరకు నిధులు గోల్‌మాల్‌ అయినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్యాష్‌ బుక్‌ మాయం చేసిన సెక్రటరీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పూర్తిస్థాయిలో వివరాలు సేకరించే పనిలో సహకారశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

నిధులు గోల్‌మాల్‌!

- తరకటూరు పీఏసీఎస్‌లో అవినీతిపై కలెక్టర్‌కు రైతు ఫిర్యాదు

- విచారణలో రూ.78 లక్షల వరకు దుర్వినియోగమైనట్టు నిర్ధారణ

- క్యాష్‌ బుక్‌ మాయం చేసిన పీఏసీఎస్‌ సెక్రటరీ

-సమగ్రంగా వివరాలు సేకరించే పనిలో సహకారశాఖ అధికారులు

తరకటూరు పీఏసీఎస్‌లో నిధులు గోల్‌మాల్‌ అయ్యాయి. తీసుకున్న రుణం తిరిగి చెల్లించినా సెక్రటరీ రశీదు ఇవ్వకపోడంతో అనుమానం వచ్చిన రైతు కలెక్టరేట్‌లో ఫిర్యాదు చేశారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన అధికారులు రూ.78 లక్షల వరకు నిధులు గోల్‌మాల్‌ అయినట్టు ప్రాథమిక అంచనాకు వచ్చారు. క్యాష్‌ బుక్‌ మాయం చేసిన సెక్రటరీ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో పూర్తిస్థాయిలో వివరాలు సేకరించే పనిలో సహకారశాఖ అధికారులు నిమగ్నమయ్యారు.

ఆంద్రజ్యోతి-మచిలీపట్నం:

గూడూరు మండలం తరకటూరు పీఏసీఎస్‌ సెక్రటరీగా గళ్లా శ్రీనివాసరావు పనిచేస్తున్నారు. ఆయన రైతులు తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లించే సమయంలో రశీదులు ఇవ్వలేదు. అడిగితే తర్వాత ఇస్తానని చెప్పడంతో వెళ్లిపోయారు. మరికొందరు రైతులు ఈ సెక్రటరీపై ఉన్న నమ్మకంతో ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు చెల్లించారు. వారికి కూడా పంట రుణం చెల్లించినట్టుగా రశీదులు ఇవ్వలేదు. ఈ విధంగా గత ఏడాది కాలంగా కొనసాగుతోంది. ఎంతకూ రశీదులు ఇవ్వకపోవడంతో పలువురు రైతులు గట్టిగా అడిగితే తనపై నమ్మకం లేదా అంటూ వారిని నోరెత్తనీయలేదు. ఈక్రమంలో ఈ సెక్రటరీ పనితీరు బాగుండక పోడంతో తరకటూరుకు చెందిన యానాదిరావు అనే రైతు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణకు ఆదేశించారు. సెక్రటరీకి చెల్లించిన పంట రుణాల నగదు రూ.78 లక్షల వరకు ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఇందులో కొంత మొత్తాన్ని పీఏసీఎస్‌లో జమ చేసిన సెక్రటరీ, మిగిలిన మొత్తం చెల్లించే స్థోమతలేక కొద్దిరోజులుగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఈ సెక్రటరీ తరకటూరులోని తన సొంత భూమిలో ఈ ఏడాది వరి నాట్లు వేయకుండా ఖాళీగా వదిలేయడంపై ఆరా తీస్తే ఆయన కొద్దిరోజులుగా తప్పించుకు తిరుగుతున్నాడనే విషయం బయట పడింది.

క్యాష్‌ బుక్‌ మాయం

కలెక్టర్‌ ఆదేశాలతో తరకటూరు పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై సహకారశాఖ అధికారులు ఇటీవల విచారణ ప్రారంభించారు. జిల్లా సహకారశాఖ అధికారి చంద్రశేఖరరెడ్డి మంగళవారం తరకటూరు పీఏసీఎస్‌కు వెళ్లి రికార్డులను తనిఖీ చేశారు. కేడీసీసీబీ గూడూరు బ్రాంచ్‌ మేనేజరును తరకటూరు పీఏసీఎస్‌కు పిలిపించి మరీ విచారణ చేశారు. ఈ సందర్భంగా పలువురు రైతులు తాము పీఏసీఎస్‌ సెక్రటరీకి ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా నగదు చెల్లించామని, మరికొందరు రైతులు పీఏసీఎస్‌కు వచ్చి నగదును సెక్రటరీకి ఇచ్చామని తెలిపారు. మరికొందరు రైతులు మా ఇంటి పేరుతో ఉన్న సెక్రటరీని నమ్మి పంట రుణాలు కట్టే నిమిత్తం నగదు చేతికి ఇచ్చామని, రశీదులు మాత్రం ఇవ్వలేదని అధికారులకు వివరించారు. రైతులు తిరిగి రుణాలు చెల్లించే సమయంలో రైతులకు రసీదులు రాసి ఇచ్చే క్యాష్‌ బుక్‌ ఒకటి పీఏసీఎస్‌లో మాయమైనట్లుగా అధికారులు గుర్తించారు. రైతుల నుంచి రుణాలు వసూలు చేసిన సమయంలో పీఏసీఎస్‌కు చెందిన రికార్డులలో కాకుండా, తాను సొంతంగా పెట్టుకున్న పుస్తకంలో రైతులు రుణాలు చెల్లించినట్లుగా రాసి, తర్వాత రశీదులు ఇస్తానని సెక్రటరీ రైతులను నమ్మించి మోసం చేసినట్లుగా తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందని డీసీవో తెలిపారు. తరకటూరు పీఏసీఎస్‌ సెక్రటరీ పెద్దమొత్తంలో నగదును పక్కదారి పట్టించడంతో అతని ఆస్తులను అటాచ్‌ చేసేందుకు వెనకాడబోమని డీసీవో చెప్పారు. ఈ పీఏసీఎస్‌లో 600 మందికిపైగా రైతులు ఉన్నారని, వారు తీసుకున్న రుణాలు, తిరిగి చెల్లించిన నగదు వివరాలను అందించాలని కోరామని, త్వరితగతిన ఈ పీఏసీఎస్‌లో విచారణను పూర్తిచేయాలని అధికారులను ఆదేశించినట్లు డీసీవో వివరించారు.

ఈ పీఏసీఎస్‌ల్లో అవినీతిపై చర్యలేవి?

జిల్లాలో పలు పీఏసీఎస్‌లలో అక్రమాలు బయటపడినా అధికారులు విచారణను పూర్తి చేయకుండా సాచివేత ధోరణితో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మచిలీపట్నం మండలం గోకవరం పీఏసీఎస్‌లో రైతులు తీసుకున్న రుణాలు చెల్లించినట్లు పీఏసీఎస్‌ రికార్డులలో చూపినా, కేడీసీసీ మచిలీపట్నం బ్రాంచ్‌లో ఈ నగదును జమచేయలేదు. రైతుల ఫిర్యాదుతో ఈ పీఏసీఎస్‌లో జరిగిన అక్రమాలపై సహకారశాఖ అధికారులు గత నాలుగు నెలలుగా విచారణ చేస్తూనే ఉన్నారు. అధికారుల ప్రాథమిక విచారణలో రూ.50లక్షలను సంబంధిత సెక్రటరీ వాడుకున్నట్లుగా రుజువైంది. అయినా బాధ్యుడిపై చర్యలు తీసుకోకుండా జాప్యం చేయడం గమనార్హం.

-గూడూరు మండలం ముక్కొల్లు పీఏసీఎస్‌లో రుణాలు తీసుకున్న రైతుల నుంచి రుణాల వసూలు పేరుతో పీఏసీఎస్‌ సెక్రటరీ తన ఫోన్‌పే నెంబరుకు నగదును జమ చేయించుకున్నాడు. కానీ రైతుల ఖాతాల్లో రుణాలు చెల్లించినట్లుగా చూపలేదు. దీంతో రైతులు అన్ని ఆధారాలతో అధికారులకు ఫిర్యాదు చేశారు. విచారణ చేసిన అధికారులు రూ.45లక్షల వరకు నగదు పక్కదారి పట్టినట్లుగా నిర్థారించారు. ఏడాదిన్నర కాలంగా ఈ పీఏసీఎస్‌ కార్యదర్శి తప్పించుకు తిరుగుతున్నాడు. అయినా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

- నాగాయలంక పీఏసీఎస్‌లో ఎరువులు పక్కదారి పట్టడం, టి-కొత్తపాలెంకు చెందిన రైతులకు రుణాలు ఇచ్చిన రికార్డులు సక్రమంగా లేకపోవడం, క్యాష్‌బుక్‌లో దిద్దుబాట్లు ఉన్నట్లుగా అధికారుల విచారణలో వెల్లడైంది. అయినా ఇంతవరకు అక్రమార్కులపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. తరకటూరు, ముక్కొల్లు, గోకవరం, తదితర పీఏసీఎస్‌ల్లో జరిగిన అక్రమాలపై విచారణ పూర్తయ్యేదశలో ఉన్నాయని, విచారణ పూర్తయిన తర్వాత చర్యలు తీసుకుంటామని డీసీవో చంద్రశేఖరరెడ్డి తెలిపారు. రుణాలు చెల్లించే సమయంలో తప్పనిసరిగా కంప్యూటర్‌ నుంచి తీసిన ఒరిజినల్‌ రసీదును రైతులు అడిగి తీసుకోవాలని సూచించారు.

Updated Date - Jul 17 , 2025 | 12:18 AM