Share News

Fund Mismanagement: నిధులున్నా ఖర్చు చేయరు

ABN , Publish Date - Sep 06 , 2025 | 06:08 AM

ఏ ప్రభుత్వ శాఖ అయినా నిధులు లేక సంక్షేమ కార్యక్రమాలను పెండింగ్‌లో పెడుతుంది. కానీ గిరిజన సంక్షేమ శాఖ మాత్రం అందుకు భిన్నం. నిధులున్నా ఖర్చు చేయడానికి అధికారులకు మనసు రావట్లేదు.

Fund Mismanagement: నిధులున్నా ఖర్చు చేయరు

  • గిరిజన సంక్షేమ శాఖలో దుస్థితి.. కూటమి ప్రభుత్వం చొరవతో కేంద్రం నుంచి నిధులు

  • 500 కోట్లు వచ్చినా వాడుకోని వైనం

  • డబ్బు విడుదలకు అధికారుల మోకాలడ్డు

  • మంత్రి ఆదేశాలూ బేఖాతరు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ఏ ప్రభుత్వ శాఖ అయినా నిధులు లేక సంక్షేమ కార్యక్రమాలను పెండింగ్‌లో పెడుతుంది. కానీ గిరిజన సంక్షేమ శాఖ మాత్రం అందుకు భిన్నం. నిధులున్నా ఖర్చు చేయడానికి అధికారులకు మనసు రావట్లేదు. గిరిజన సంక్షేమంపై దృష్టి పెట్టడంలేదు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేపట్టకుండా కేంద్రమిచ్చిన నిధులను వృథా చేశారు. కూటమి సర్కార్‌ వచ్చిన తర్వాత కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. కేంద్రం నుంచి గిరిజన సంక్షేమ శాఖకు సుమారు రూ.500 కోట్లు విడుదలైనా.. ఆ శాఖ అధికారులెవ్వరూ నిధులను గిరిజనుల సంక్షే మానికి విడుదల చేసే ప్రయత్నం చేయడం లేదు. మంత్రి సంధ్యారాణి ఆదేశాలను ఉన్నతాధికారులు ఖాతరు చేయడం లేదంటున్నారు.


కేంద్రం నుంచి నిధులకు నిర్విరామ కృషి

కూటమి ప్రభుత్వం పగ్గాలు చేపట్టిన తర్వాత గిరిజన సంక్షేమ శాఖకు వచ్చిన నిధులు, ఆర్థిక శాఖలో నిలిచిన నిధులు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై కసరత్తు చేశారు. ఢిల్లీకి అధికారులను పంపి నిధులు రాబట్టేందుకు నిర్విరామ కృషి చేసి, సుమారు రూ.500 కోట్లు రాబట్టారు. ట్రైకార్‌ ద్వారా పీవీటీజీలకు గత టీడీపీ ప్రభుత్వం 2018-19లోనే రూ.20 కోట్లు రాబట్టింది. వైసీపీ ప్రభుత్వం ఆ నిధులు ఒక్క పైసా ఖర్చు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖలోనూ ఫైల్‌ క్లియర్‌ చేసి పీవీటీజీల అభివృద్ధికి నిధులను రెడీగా ఉంచారు. అయితే వాటిని ఖర్చు చేసేందుకు అవసరమైన ప్రణాళికలు తయారుచేయడం గానీ, వాటిని అమలు చేయాలన్న ఆలోచన గానీ ఆ శాఖలో ఎవ్వరికీ లేకుండా పోయింది.


బడ్జెట్‌ నిధులున్నా..

స్వయం ఉపాధి పథకాల అమలుకు కూటమి సర్కార్‌ రూ.170 కోట్లు బడ్జెట్‌లో కేటాయించింది. గత ఏడాది ఆ నిధులను వాడుకోలేకపోయారు. ఈ ఏడాది వాడుకోనేందుకు ప్రణాళికలు రూపొందించేందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో పాటు గిరిజన ప్రాంతాల్లో పాఠశాలల అభివృద్ధికి రూ.200 కోట్లు విడుదలైనా ఖర్చు చేసే పరిస్థితి లేదు. ఆర్టికల్‌ 275 నిధులు 2017-18లో రాష్ట్రానికి సుమారు రూ.150 కోట్లు విడుదలయ్యాయి. జగన్‌ సర్కార్‌ ఆ నిధులను పట్టించుకోలేదు. కూటమి సర్కార్‌ ఆ నిధులను ఖర్చు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినా.. ఒక్క అడుగు ముందుకు పడలేదు. గిరిజనుల అభివృద్ధికి షెడ్యూల్డ్‌ ట్రైబ్‌ కాంపోనెంట్‌ కేంద్రం నుంచి 2018-19లో రూ. 100 కోట్లు విడుదలయ్యాయి. ఈ నిధులను గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ఖర్చు చేసే అవకాశమున్నప్పటికీ పట్టించుకోలేదు. పథకాలు అమలు చేస్తే అవినీతి జరుగుతుందంటూ అధికారులు విచిత్ర కారణం చెబుతున్నారు.


నిధులు ఖర్చు చేస్తే మరిన్ని నిధులు..

కేంద్రమిచ్చిన గిరిజన సంక్షేమ నిధులు ఖర్చు చేస్తే మన రాష్ట్రానికి మరిన్ని నిధులు విడుదల అయ్యే అవకాశముంది. కూటమి సర్కార్‌ వచ్చిన మొదట్లో పలు ప్రణాళికలు రూపొందించి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు కసరత్తు జరిగింది. అయితే అధికారుల బదిలీలతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. గిరిజన సంక్షేమశాఖ మంత్రి, ముఖ్యకార్యదర్శి, డైరెక్టర్‌ అందరూ ఎస్టీ వర్గానికి చెందిన వారైనప్పటికీ గిరిజనులకు న్యాయం జరగడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గిరిజనుల సంక్షేమానికి సంబంధించి ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదు. మంత్రి, ఉన్నతాధికారుల మధ్య సమన్వయం కొరవడటంతో ఈ శాఖలో అభివృద్ధి నిలిచిపోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

Updated Date - Sep 06 , 2025 | 06:11 AM