ప్రాణం తీసిన సరదా
ABN , Publish Date - Jul 19 , 2025 | 12:12 AM
మంత్రాలయం బస్టాండు సమీపంలో ఇద్దరు స్నేహితులు సరాదాగా ఆడుకుంటూ కింద పడడంతో ఒకరు మృతి చెందారు.
ప్రైవేట్ భాగాలపై తన్నడంతో కిందపడి వ్యక్తి మృతి
స్నేహితుడిపై హత్య కేసు నమోదు
మంత్రాలయం, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మంత్రాలయం బస్టాండు సమీపంలో ఇద్దరు స్నేహితులు సరాదాగా ఆడుకుంటూ కింద పడడంతో ఒకరు మృతి చెందారు. మంత్రాలయం ఎస్‌ఐ శివాంజల్ తెలిపిన వివరాలివీ.. కర్ణాటకలోని రాయచూరు జిల్లా మల్కాపురం గ్రామానికి చెందిన బోయ దుల్హయ్య (36), మంత్రాలయం మండలం మాధవరం గ్రామానికి చెందిన తలారి దుగ్గు రామకృష్ణ ఇద్దరూ ట్రాక్టరు డ్రైవర్లుగా, హామాలీలుగా, హోటల్‌లో పని చేస్తూ స్నేహితులుగా ఉంటూ వచ్చారు. గురువారం రాత్రి ట్రాక్టర్ కొండీని విరగొట్టావని ఒకరు, లేదని మరొకరు తమాషాగా భుజాల మీద చేయి వేసుకుంటూ చిలిపిచేష్టలు చేస్తూ వచ్చారు. దుగ్గు రామకృష్ణ సరదగా చేస్తూ ప్రైవేటు భాగాలపై తన్నడంతో కింద పడి తలకు రక్తగాయాలై దుల్హయ్య అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన ప్రైవేటు హోటల్ సీసీ కెమెరాల్లో రికార్డయింది. గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారని, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. అయితే సీసీ ఫుటేజీని క్షుణ్ణంగా పరిశీలించి దుగ్గు రామకృష్ణ తన్నడం వల్లే కిందపడి మృతి చెందారని దుల్హయ్య సోదరుడు ఆంజనేయ ఫిర్యాదు చేశారు. దీంతో ఎమ్మిగనూరు డీఎస్పీ ఉపేంద్రబాబు, కర్నూలు క్లూస్ టీం ఎస్‌ఐ పవనకుమార్ రెడ్డి, మంత్రాలయం సీఐ రామాంజులు, ఎస్‌ఐ శివాంజల్, అన్వర్‌బాషా శుక్రవారం ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలు సేకరించారు. మృతదేహానికి ఎమ్మిగనూరు ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. కర్ణాటకలోని దుల్హయ్య తల్లి యంకమ్మ, అన్న ఆంజనేయులు ఇచ్చిన పిర్యాదు మేరకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.