CID Investigation: ఇక పరకామణిపై సమగ్ర దర్యాప్తు
ABN , Publish Date - Dec 12 , 2025 | 05:18 AM
తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసులో హైకోర్టు ఆదేశాలతో పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగనుంది. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీని...
హైకోర్టు ఆదేశాలతో రంగంలోకి దిగనున్న సీఐడీ
కేసు రాజీ వెనుక సూత్రధారులెవరో తేలే అవకాశం
రవికుమార్ ఆస్తుల లావాదేవీలు ఇక బహిర్గతం
ఆస్తులు రాయించుకున్నవారూ వెలుగులోకి
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
తిరుమల శ్రీవారి పరకామణిలో చోరీ కేసులో హైకోర్టు ఆదేశాలతో పూర్తిస్థాయిలో దర్యాప్తు కొనసాగనుంది. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సీఐడీని ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. 2023 ఏప్రిల్ 29న హుండీ లెక్కింపు సందర్భంగా చోరీకి పాల్పడిన సీవీ రవికుమార్‌పై అప్పట్లో పరకామణి ఏవీఎస్‌వోగా ఉన్న సతీశ్ కుమార్ తిరుమల వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నిందితుడు తీవ్ర పశ్చాత్తాపానికి గురయ్యారని, ప్రాయశ్చిత్తంగా తన ఆస్తులు రాసిచ్చేందుకు సిద్ధపడ్డారంటూ టీటీడీ అధికారులు ప్రచారం చేశారు. అదే ఏడాది మే నెలలో రవికుమార్, అతని భార్య రమ్య కలిసి తిరుపతి, చంద్రగిరి, చెన్నైలో ఉన్న రూ.14.42 కోట్ల ప్రభుత్వ విలువ కలిగిన ఆస్తులను టీటీడీ పేరిట రిజిస్టర్ చేశారు. వీటిలో చంద్రగిరిలో 10.26 ఎకరాల మామిడి తోట, తిరుపతి ఉపాధ్యాయనగర్‌లో 150 అంకణాల ఖాళీ స్థలం, తిరుపతి పెద్దకాపు లే అవుట్‌లోని అశోకా అపార్ట్‌మెంట్‌లో ఒక ఫ్లాట్, తిరుపతి అర్బన్ మండలం శెట్టిపల్లిలోని పసుపర్తి అపార్టుమెంట్‌లో 13 ఫ్లాట్లతో పాటు చెన్నైలో గెస్ట్‌హౌస్ ఉన్నాయి. ఆ తర్వాత అదే ఏడాది సెప్టెంబరు 9న తిరుమల వన్‌టౌన్ పోలీసులు రవికుమార్‌పై నమోదు చేసిన క్రిమినల్ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేసుకున్నారు. చోరీపై పోలీసులకు ఫిర్యాదు చేసిన అప్పటి ఏవీఎస్‌వో సతీశ్ కుమారే నిందితుడితో రాజీ పడ్డారు. ప్రభుత్వం, టీటీడీ బోర్డు అనుమతి లేకుండానే ఈ తతంగం నడిచింది. ఆ తర్వాత కేసును మూసివేశారు.
హైకోర్టు జోక్యంతో కదలిన డొంక
పరకామణి చోరీ కేసును నిబంధనలకు విరుద్ధంగా రాజీ చేసుకున్నారని, రవికుమార్ ఆస్తులను అప్పటి అధికార పార్టీ ప్రముఖులు, టీటీడీకి సంబంధించిన కీలక వ్యక్తులు, పోలీసు అధికారులు రాయించుకున్నారని, అందుకే కేసు రాజీ చేశారన్న ఆరోపణలు ఉన్నాయంటూ తిరుపతికి చెందిన మాచర్ల శ్రీనివాసులు పిల్ దాఖలు చేశారు. హైకోర్టు జోక్యంతో ఈ కేసులో డొంక కదిలింది. మొత్తం వ్యవహారంపై విచారణ జరిపి ఈ నెల 2న నివేదిక అందజేయాలని సీఐడీ డీజీని ఆదేశించింది. దాంతో గత నెల 4నుంచి 30వరకూ సీఐడీ డీజీ వేగంగా విచారణ జరిపారు. ఈ నెల 1న హైకోర్టులో నివేదిక సమర్పించారు. ఆ వేదికను పరిశీలించిన హైకోర్టు దర్యాప్తు కొనసాగించాలని, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దీంతో సీఐడీ రంగంలోకి దిగనుంది.
యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన
పరకామణి చోరీ కేసు నిందితుడి నుంచి ఆస్తులు స్వీకరించే విషయంలోనూ టీటీడీ నిబంధనలు పాటించలేదు.
ఆస్తులు స్వీకరించే అంశాన్ని పాలకమండలి సమావేశం అజెండాలో చేర్చినపుడు కేసులో రవికుమార్ నిందితుడని పేర్కొనలేదు.
నిందితుడి నుంచి ఆస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోలేదు.
ఆస్తుల స్వీకరణపై అభ్యంతరాలను తెలుసుకునేందుకు పత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇవ్వలేదు. పైగా పబ్లిక్ నోటీసు ఇవ్వకుండా మినహాయింపు ఇస్తూ బోర్డు తీర్మానం కూడా చేశారు.
బోర్డు సమావేశంలో చర్చించడానికి ముందుగానే కొన్ని ఆస్తులను టీటీడీ భౌతికంగా స్వాధీనం చేసుకుంది.