Share News

High Court: ప్రొవిజనల్‌ అసైన్‌మెంట్‌పై సైనికులకు సంపూర్ణ హక్కులు

ABN , Publish Date - Nov 25 , 2025 | 05:45 AM

ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద సైనికోద్యోగులకు భూకేటాయింపులు, వాటి అమ్మకానికి సంబంధించి పలు అంశాలపై స్పష్టత ఇస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

High Court: ప్రొవిజనల్‌ అసైన్‌మెంట్‌పై సైనికులకు సంపూర్ణ హక్కులు

  • అసైన్డ్‌ భూములపై హైకోర్టు స్పష్టత

  • మాజీ సైనికోద్యోగి భూమిని 22(ఏ) నుంచి తొలగించాలని కలెక్టర్‌కు ఆదేశం

అమరావతి, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద సైనికోద్యోగులకు భూకేటాయింపులు, వాటి అమ్మకానికి సంబంధించి పలు అంశాలపై స్పష్టత ఇస్తూ హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద ప్రొవిజనల్‌ అసైన్‌మెంట్‌ చేసినప్పటికీ సైనికోద్యోగులకు ఆ భూములపై సంపూర్ణ హక్కులు ఉంటాయని స్పష్టం చేసింది. భూమిని విక్రయించేందుకు అనుమతిస్తూ 2010 మార్చి 3న రెవెన్యూ కార్యదర్శి మెమో జారీ చేశారని గుర్తు చేసింది. ప్రొవిజనల్‌ అసైన్‌మెంట్‌ అనంతరం భూమిని సాగులోకి తీసుకొస్తే డీఫామ్‌ పట్టా జారీ లాంఛనప్రాయమేనని పేర్కొంది. డీఫామ్‌ పట్టా జారీలో జాప్యం చోటు చేసుకుందనే కారణంతో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద లభించే ప్రయోజనాలను సైనికోద్యోగులకు దూరం చేయడానికి వీల్లేదని తేల్చిచెప్పింది. ప్రస్తుత కేసులో (మాజీ) సైనికోద్యోగి(అప్పీల్‌దారు) గత 40 ఏళ్లుగా భూమిని సాగు చేస్తున్నారని, ఈ నేపఽథ్యంలో భూమిని విక్రయించేందుకు అతనికి హక్కులు ఉన్నాయని స్పష్టం చేసింది. ఇసుక దిబ్బల పోరంబోకు భూమిని అసైన్‌ చేయడానికి వీల్లేదన్న అధికారుల వాదనను తిరస్కరించింది. అప్పీల్‌దారుకు భూకేటాయింపు చేసిన సర్వే నం.75లోనే ఇతరులకు కూడా భూమిని అసైన్‌ చేశారని గుర్తు చేసింది. వారు ఆ భూమిని ల్యాండ్‌ పూలింగ్‌ కింద వీఎంఆర్‌డీఏకు అప్పగించారని, అందుకు బదులుగా వారు ప్లాట్లు పొందారని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఇసుక దిబ్బల పోరంబోకు భూమిని ఎందుకు అసైన్‌ చేయకూడదనే విషయంపై స్పష్టత లేదని పేర్కొంది. ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద జూనియర్‌ కమిషన్డ్‌ ఆఫీసర్లు, సర్వీసులో ఉన్న సైనికోద్యోగులు అసైన్‌మెంట్‌కు అర్హులేనని మరోసారి స్పష్టత ఇచ్చింది. ఇందుకు సంబంధించి గతంలో తీర్పులు ఉన్నాయని గుర్తు చేసింది. మాజీ సైనికోద్యోగి అప్పారావుకు చెందిన భూమిని రిజిస్ట్రేషన్‌ నిషేధిత భూముల జాబితా నుంచి తొలగించాలని, తీర్పు ప్రతి అందిన నాటి నుంచి ఆరు వారాల్లో నిరభ్యంతర పత్రం జారీ చేయాలని విశాఖ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.


ఆ లోపు నిషేధిత జాబితా నుంచి భూములు తొలగించకుంటే భూముల బదిలీ/విక్రయం నిమిత్తం దస్త్రాలను సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ వద్ద ఉంచవచ్చని పిటిషనర్‌కు తెలిపింది. వాటిని పరిగణనలోకి తీసుకొని రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేయాలని సబ్‌రిజిస్ట్రార్‌ను ఆదేశించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.రఘునందనరావు, జస్టిస్‌ బీవీఎల్‌ఎన్‌ చక్రవర్తితో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది. విశాఖపట్నానికి చెందిన పీసీ అప్పారావు ఇండియన్‌ నేవీలో చీఫ్‌ పెట్టి ఆఫీసర్‌ (ఎలక్ట్రీషియన్‌) హోదాలో 1989 నవంబరు 6న పదవీ విరమణ చేశారు. 1978 డిసెంబరులో ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ కోటా కింద అప్పారావుకు భీమునిపట్నం మండలం కొత్తవలస గ్రామం పరిధిలోని సర్వే నం. 75-2లో 5.10 ఎకరాల భూమిని అసైన్‌ చేశారు. గత 40 ఏళ్లుగా ఆ భూమిలో అప్పారావు జీడి సాగుచేస్తున్నారు.

Updated Date - Nov 25 , 2025 | 05:46 AM