‘ఫుల్’జోష్!
ABN , Publish Date - Aug 19 , 2025 | 01:31 AM
ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సోమవారం మహిళలు పోటెత్తారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా బస్టాప్‌లు, బస్‌స్టేషన్లు కిటకిటలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం స్ర్తీ శక్తి పథకం ప్రారంభించినప్పటి నుంచి సెలవు దినాలు కావటంతో పెద్దగా రద్దీ కనిపించలేదు. సోమవారం వర్కింగ్ డే కావటంతో మహిళలు బస్సుల్లో ప్రయాణించటానికి కదం తొక్కారు. ఎక్కడ చూసినా కూడా ఇదే రద్దీ కనిపించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కటానికి క్యూ కట్టారు.
-ఆర్టీసీ బస్సుల్లో పోటెత్తిన మహిళలు
- బస్టాప్‌లు, బస్‌ష్టేషన్లు కిటకిట
- ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విజయవంతంగా ‘స్త్రీ శక్తి’
- ఆదివారం లక్షన్నర మంది మహిళల ప్రయాణం
- సోమవారం అంతకు ఐదారు రెట్లు ఎక్కువగా..
- 100 మందికిపైగా ప్రయాణికులతో నడిచిన సిటీ బస్సులు
(ఆంధ్రజ్యోతి, విజయవాడ / మైలవరం / ఇబ్రహీంపట్నం / చల్లపల్లి / తోట్లవల్లూరు / గూడూరు): ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సోమవారం మహిళలు పోటెత్తారు. ఉమ్మడి కృష్ణాజిల్లా వ్యాప్తంగా బస్టాప్‌లు, బస్‌స్టేషన్లు కిటకిటలాడాయి. రాష్ట్ర ప్రభుత్వం స్ర్తీ శక్తి పథకం ప్రారంభించినప్పటి నుంచి సెలవు దినాలు కావటంతో పెద్దగా రద్దీ కనిపించలేదు. సోమవారం వర్కింగ్ డే కావటంతో మహిళలు బస్సుల్లో ప్రయాణించటానికి కదం తొక్కారు. ఎక్కడ చూసినా కూడా ఇదే రద్దీ కనిపించింది. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు ఎక్కటానికి క్యూ కట్టారు. పీఎన్‌బీఎస్, సిటీ బస్‌పోర్టు, జగ్గయ్యపేట, తిరువూరు, గుడివాడ, అవనిగడ్డ, గన్నవరం, ఆటోనగర్, మచిలీపట్నం ప్రధాన బస్‌డిపోలలో రద్దీ అనూహ్యంగా ఉంది. ఇవి కాకుండా బస్‌స్టేషన్లుగా ఉన్న మైలవరం, కంకిపాడు, చల్లపల్లి తదితర బస్‌స్టేషన్లలో కూడా రద్దీ విపరీతంగా నెలకొంది. సోమవారం రోజున మహిళా ప్రయాణికులే మూడొంతుల మంది ఉన్నారు. ఆర్టీసీ బస్సులు రాగానే మహిళలు ఎక్కటానికి ఎగబడ్డారు. ఇలాంటి రద్దీ సంక్రాంతి పండగల సమయంలో మాత్రమే కనిపించేంది. కానీ, సోమవారం సంక్రాంతిని తలపించింది.
ఓవర్‌లోడ్.. రెట్టింపు ప్రయాణాలు
ఆర్టీసీ బస్సుల్లో రెట్టింపు సంఖ్యలో ప్రయాణాలు జరిగాయి. సిటీ బస్సులలో 50 శాతం ఆక్యుపెన్సీ సగటున ఉంటే.. సోమవారం ఒక్కరోజునే 100 శాతం దాటి పోవటం విశేషం. సిటీ బస్సులలో 100 మంది వరకు ప్రయాణించే పరిస్థితి ఏర్పడింది. ఒక బస్సులో 43 నుంచి 45 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. నిలబడి ప్రయాణించేవారు కూడా ఉంటారు. ఈ లెక్కన తీసుకుని ఓ 70 మంది ప్రయాణించటానికి అవకాశం ఉంటుంది. కానీ, ఆర్టీసీ సిటీ బస్సులలో ప్రధానంగా సబర్బన్ ప్రాంతాల నుంచి విజయవాడకు వచ్చే బస్సులలో 100 మందికి పైగా ప్రయాణికులతో బస్సులు నడిచాయి. హెవీ ఓవర్ లోడ్‌తో ఆర్టీసీ బస్సులు ప్రయాణించాయి.
రికార్డు స్థాయిలో ప్రయాణాలు
ఉమ్మడి కృష్ణాజిల్లాలో ఒక్క ఆదివారం రోజున జరిగిన మహిళా ప్రయాణికులే రికార్డు స్థాయిలో ఉన్నారు. సోమవారం వర్కింగ్ డే కావడంతో ఐదారు రెట్లు ఎక్కువుగా మహిళలు ప్రయాణించి ఉంటారని అంచనా వేస్తున్నారు. సోమవారం నాటి గణాంకాలు మంగళవారం నాటికి కానీ రావు. ఆదివారం ఎన్టీఆర్ జిల్లా పరిధిలో లక్ష మంది మహిళలు ప్రయాణించారు. వీరిలో పెద్ద వాళ్లు 98,553 మంది ఉండగా.. పిల్లలు 1,903 మంది వరకు ఉన్నారు. కృష్ణాజిల్లా వ్యాప్తంగా 50 వేల మంది మహిళలు ప్రయాణాలు సాగించారు.