Share News

Ajay Mining Scam: మైనింగ్‌ డాన్‌!

ABN , Publish Date - Apr 15 , 2025 | 03:40 AM

ఉద్యోగాల పేరుతో మోసాలు చేసిన అజయ్‌ ఇప్పుడు గనుల శాఖలో అధికారుల సహకంతో సెటిల్మెంట్లు చేస్తూ ప్రభావం చూపిస్తున్నాడు. సీఎం గమనించడంతో దారిమార్చి, కేసుల పరిష్కారానికి కసరత్తు చేస్తున్నాడు.

Ajay Mining Scam: మైనింగ్‌ డాన్‌!

మొన్నటిదాకా చిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీ ఓనర్‌

నేడు గనుల శాఖలో రాజాధిరాజులా అజయ్‌

ఆయన ఓ మైనింగ్‌ డాన్‌! ఆయన కన్ను ఏ మైనింగ్‌లీజు, పరిశ్రమపై పడినా యజమానికి మూడినట్టే! మొదట గనులశాఖలో అత్యంత కీలకమైన ఓ వ్యక్తి సంబంధిత కంపెనీ ఎండీకి ఫోన్‌ చేస్తారు. ఆ వెంటనే మరో అధికారి ఫోన్‌ చేస్తారు. ‘‘సారుకు సంబంధిత మైనింగ్‌ లీజు, పరిశ్రమ కావాలి. మీరు అప్పగించండి. రివిజన్‌ కేసు మీకు అనుకూలంగా సెటిల్‌ అవుద్ది’’ అనేది ఈ ఫోన్ల సారాంశం. మాట విని మైనింగ్‌ డాన్‌ చెప్పినట్టు చేస్తే సరి. కంపెనీలో వాటా లేక లాభాల్లో వాటా లేదంటే మొత్తంగానే కంపెనీని అప్పగించేయడం.. ఇందులో డాన్‌ ఏది కోరితే అది చేయాల్సిందే!. లేదంటే విజిలెన్స్‌ దాడులు జరిగిపోతాయి. రూ.10కోట్ల నుంచి 100 కోట్ల మేర పెనాల్టీ వేస్తారు. అంతే....కంపెనీ మూత పడాల్సిందే!

కన్ను పడిందంటే ఏదొక కంపెనీకి మూడినట్టే

ముందు విజిలెన్స్‌ దాడులు.. ఆపై సెటిల్‌మెంట్లు

కంపెనీలో వాటా.. లాభాల్లో వాటా.. మొత్తంగానే

హస్తగతం.. వీటిలో ఏది కోరితే అది చేయాల్సిందే!

లేదంటే కంపెనీ మూసుకోవాల్సిందే

ఉత్తరాంధ్రలో పెద్దల పేరుతోనే నయా దందా

విషయం తెలిసి ముఖ్యమంత్రి సీరియస్‌

అయినా అదే దూకుడు.. వేరే దారిలో డీలింగ్స్‌

రేపు 64 కంపెనీలపై విజిలెన్స్‌ రివిజన్‌ కేసుల విచారణ!

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

జయ్‌ అనే వ్యక్తి హైదరాబాద్‌లో చిన్న సాఫ్ట్‌వేర్‌ కంపెనీని నడిపేవారు. ఉద్యోగాల పేరిట యువ తకు ఎరవేసిన కేసుల్లో ఆయన నిందితుడు. ఎట్టకేలకు ఆ కేసుల్లో రాజీలు చేసుకుని, సొంత రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు మకాం మార్చారు. ఇక్కడకు రాగానే ఆయనను గనులు ఆకర్షించాయి. ప్రభుత్వంలోని పెద్ద మనుషుల పేరును దీనికోసం వాడుకోవడం మొదలుపెట్టారు. గనులశాఖలో కీలక, ముఖ్య వ్యక్తుల సహకారం, ప్రోద్బలంతో ఒక వెలుగు వెలిగిపోతున్నారు. గత ప్రభుత్వంలో భారీ పెనాల్టీకి గురయిన గ్రానైట్‌ కంపెనీ విషయంలో అజయ్‌ భారీ సెటిల్‌మెంట్‌ చేశారు. ఆ తర్వాత దాన్ని హస్తగతం చేసుకున్నారు. ఇక.. అక్కడనుంచి మరింత రెచ్చిపోయి మరో కంపెనీపై కన్నేశారు. అయితే, ఇక్కడ కథ అనూహ్యంగా రివర్స్‌ అయింది. అజయ్‌ వ్యవహారం ముఖ్యమంత్రిదాకా వెళ్లింది. సీఎం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో రూటు మార్చారు. ఈ సారి మైనింగ్‌ కంపెనీల మీదున్న విజిలెన్స్‌ కేసుల రివిజన్‌పై పడ్డారు.

వచ్చే బుధవారం ఒకేసారి 64 కంపెనీల కేసుల విచారణను సింగిల్‌ టేక్‌ లో సెటిల్‌ చేసేందుకు రెడీ అయ్యారు. గనుల శాఖను దున్నిపడేస్తూ, మైనింగ్‌ డాన్‌గా వెలుగొందుతున్నారు. గనుల శాఖలోని విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అజయ్‌ది ఉమ్మడి కృష్ణాజిల్లా. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ కేంద్రంగా ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీ పెట్టి, అమెరికా, యూరప్‌ దేశాల్లో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని చెప్పి కోట్లాది రూపాయలు వసూలు చేశారు. ఆనక బోర్డు తిప్పేశారు. దీంతో ఆయనపై సైబర్‌క్రైమ్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత ఈ కేసునుంచి తాత్కాలికంగా బయటపడి అమరావతికి వచ్చారు. బందరుకు చెందిన ఓ కీలక టీడీపీ నేత ఆరాధించే ఆధ్యాత్మిక గురువు సిఫారసుతో గనులశాఖలో అడుగుపెట్టారు. గతంలో జగన్‌ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర గనుల్లో అక్రమాలు చేసిన అనుభవం ఆయనకు ఉందని చెబుతున్నారు. దానినే తన అర్హతగా గనుల శాఖలో చెప్పుకొని తిరుగుతున్నారని సమాచారం. తెరవెనక సెటిల్‌మెంట్లు, దందాలు బాగా చేయగలనంటూ గనులశాఖలోని కీలక వ్యక్తుల మద్దతు పొందినట్టు తెలిసింది. దీంతో అజయ్‌కు వారు అన్నివిధాల ప్రోద్బలం అందిస్తున్నారని చెబుతున్నారు.


అనామకంగా వచ్చి కంపెనీ హస్తగతం

గత ఏడాది ఆగస్టులో గనుల శాఖ పెద్దల వద్దకు కర్ణాటకకు చెందిన ఓ గ్రానైట్‌ వ్యాపారి కేసు వచ్చింది. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి చిత్తూరు, విశాఖ జిల్లాల పరిధిలో ఆ వ్యాపారికి మూడు గ్రానైట్‌ మైన్స్‌ లీజులు, పరిశ్రమలు ఉన్నాయి, ఉమ్మడి విశాఖలో అత్యంత ఖరీదైన మూన్‌లైట్‌ గ్రానైట్‌ దొరుకుతుంది. విదేశీ ఎగుమతుల్లో అది టాప్‌లో ఉంటుంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో ఆ వ్యాపారి కంపెనీపై విజిలెన్స్‌ దాడులు చేసి 50 కోట్లపైనే పెనాల్టీ విధించారు. తనకు కేటాయించిన దానికంటే ఎక్కువగా మైనింగ్‌ చేశారన్నది ఆ కంపెనీపై మోపిన అభియోగం. దీన్ని అడ్డంపెట్టుకొని, జగన్‌ ప్రభుత్వంలో గనుల శాఖలోని ఓ కీలకపెద్ద ఆ మైనింగ్‌ వ్యాపారాన్ని పూర్తిగా హస్తగతం చేసుకోవాలని ప్రయత్నించగా, అందుకు యజమాని అంగీకరించలేదు. దీంతో నాటి గనుల మంత్రి వద్ద కనీసం అప్పీల్‌ రివిజన్‌కు దాఖలు చేయలేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ వ్యాపారి అప్పీల్‌ చేశారు. వెంటనే ఊరట దొరికింది. ఎలాంటి పెనాల్టీ కట్టే అవసరం లేదని తేల్చారు. ఈలోగా ఆ కంపెనీ వద్ద ఉన్న గ్రానైట్‌ను విదేశాలకు ఎగుమతి చేసుకున్నారు. సరిగ్గా ఇదేసమయంలో అజయ్‌ తెరమీదకు వచ్చారు. గనులశాఖలోని కీలక వ్యక్తి పేరిట ఆయన మంత్రాంగం నడిపారు. అంతే...ఉమ్మడి విశాఖ జిల్లాలోని రెండు మైనింగ్‌ లీజులను దక్కించుకున్నారు. అంటే, ఆ వ్యాపారం పూర్తిగా అజయ్‌కు ఇచ్చేసేలా లిఖితపూర్వక ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతోపాటు ఉత్తరాంధ్ర పరిధిలోని మరి కొన్ని గ్రానైట్‌ లీజులను సెటిల్‌మెంట్‌ రూపంలో దక్కించుకొన్నారని చెబుతున్నారు.


మళ్లీ రివిజన్స్‌ పేరిట ముందుకు...

కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పటివరకు 143 విజిలెన్స్‌ పెనాల్టీ కేసులను పలు దఫాలుగా రివిజన్‌ చేశారు. అందులో అనేక కేసుల్లో కీలక కంపెనీలను అజయ్‌ చేజిక్కించుకున్నారు. కొన్నింటిలో వాటాలు పుచ్చుకున్నారు. ఇటీవల నర్సీపట్నం కేసు సీఎం దాకావెళ్లడంతో విషయం తిరగబడింది. డాన్‌ కథ కంచికే అనుకున్నారు. కానీ రివిజన్‌ల రూపంలో మరోసారి ఆయన ముందుకొచ్చారు. ఈనెల 16వ తేదీన 63 విజిలెన్స్‌ కేసుల రివిజన్‌ ఉంటుందని గనులశాఖ తేదీ ఖరారు చేసింది. అందులోనూ ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర కంపెనీలే చాలా ఎక్కువగా ఉన్నాయి. ఒకేసారి 63 కేసుల రివిజన్‌ వెనక అజయ్‌ హస్తం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి.

సీన్‌ రివర్స్‌

ఉత్తరాంధ్రలోని నర్సీపట్నం ఏరియాలో రూ.వందల కోట్ల విలువైన మూన్‌లైట్‌ గ్రానైట్‌ మైనింగ్‌ పరిశ్రమను అజయ్‌ దక్కించుకున్నారు. దాని పక్కనే మరో బడా గ్రానైట్‌ కంపెనీ ఉంది. దాని పరిధిలో భూములు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆ భూములను తనకి స్తే తన పరిశ్రమకు పవర్‌ లైన్స్‌ ఏర్పాటు చేసుకుంటానని ఆయన అడిగారు. ఇందుకు ఆ కంపెనీ యజమాని ఒప్పుకోలేదు. అంతే...తొలుత గనులశాఖలో ఓ కీలక వ్యక్తినుంచి ఫోన్‌ వెళ్లింది. అజయ్‌ చెప్పినట్లు చేయాలని ఆదేశించారు. ఆయన ప్రభుత్వ పెద్దల ఆత్మీయ బంధువంటూ ఏవో కొన్ని ఫొటోలు కూడా పంపించి దారికితెచ్చుకొనే ప్రయత్నం చే శారు. ఆయినా మాట వినకపోయేసరికి ఉత్తరాంధ్ర గనుల విజిలెన్స్‌ అధికారి.. అశోక్‌ అనే అధికారి నేతృత్వంలో టీమ్‌ను పంపించారు. పెద్దలు చెప్పారు కదా అని అశోక్‌ టీమ్‌ దాడులు చేసి హడావుడి చేసింది. 30 కోట్ల పెనాల్టీ వేయబోతున్నట్లుగా సంకేతాలు పంపినట్టు తెలిసింది. ఈ విషయం నర్సీపట్నం నుంచి ఏకంగా ఢిల్లీ పెద్దలదాకా వెళ్లింది. ఆ సమాచారం అంతే వేగంగా ఏపీ ప్రభుత్వ పెద్దలకు చేరింది. అసలేం జరిగిందని ఆరాతీసి ప్రభుత్వ పెద్దలు విస్మయానికి గురయ్యారు. ‘‘ఎవరీ అజయ్‌? మైనింగ్‌ కంపెనీలపై ఆయన పెత్తనం ఏంటి? ఆయన కోసం గనులశాఖ కీలక వ్యక్తులు పనిచేయడం ఏంటి? అసలు రివిజన్‌ పేరిట ఏం జరుగుతోంది?’’ అని ముఖ్యమంత్రి ఆరాతీశారు. ప్రభుత్వంతో సంబంధం లేని ప్రైవేటు వ్యక్తి గనులశాఖపై పెత్తనం చేస్తున్నారని సీఎంకు స్పష్టంగా అర్థమయింది. దీంతో సంబంధిత వ్యక్తులను పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఇవన్నీ ఆపేయాలని మందలించారు. ఇంతటితో అజయ్‌ కథ కంచికి చేరినట్లేనని గనులశాఖ అధికారవర్గాలు, మైనింగ్‌ పరిశ్రమల, కంపెనీల ఓనర్లు భావించారు. అయితే, సీఎం ఆగ్రహావేశాలు తాత్కాలికమేనని మరోసారి తేలిపోయింది.


ఈ వార్తలు కూడా చదవండి:

Visakhapatnam: మరో 24 గంటల్లో డెలివరీ కానున్న భార్య.. భర్త ఎంత దారుణానికి ఒడికట్టాడో..

PM Narendra Modi: కంచ గచ్చిబౌలి భూములు.. కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోదీ..

Updated Date - Apr 15 , 2025 | 04:57 AM