రబీ నుంచి ఓటీపీతోనే ఎరువులు: రాజశేఖర్
ABN , Publish Date - Oct 18 , 2025 | 04:11 AM
రబీ సీజన్ నుంచి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ యాప్ ద్వారానే ఎరువులను విక్రయించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ స్పష్టం చేశారు.
అమరావతి, అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): రబీ సీజన్ నుంచి తప్పనిసరిగా రాష్ట్ర ప్రభుత్వ యాప్ ద్వారానే ఎరువులను విక్రయించాలని వ్యవసాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్ స్పష్టం చేశారు. రబీ సీజన్ సన్నద్ధతపై శుక్రవారం తాడేపల్లిలోని రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కాన్ఫరెన్స్ హాలులో వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ, 26 జిల్లాల వ్యవసాయ, మార్క్‌ఫెడ్ అధికారులతో రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది. రాజశేఖర్ మాట్లాడుతూ ‘రబీలో రైతుల ఆధార్ నంబర్ ద్వారా వెబ్‌ల్యాండ్‌లో భూ కమతం, వ్యవసాయ విశ్వవిద్యాలయ సిఫారసు ప్రకారం సీజన్‌లో దశల వారీగా ఎరువుల కేటాయింపు జరుగుతుంది. రైతుకు వచ్చిన ఓటీపీని ఎరువుల పంపిణీ కేంద్రంలో నమోదు చేయాలి’ అని సూచించారు.
వ్యవసాయశాఖలో పదోన్నతులు
వ్యవసాయశాఖలో 20 మంది డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి లభించింది. 2024-25 ప్యానల్ సంవత్సరంలో వీరికి తాత్కాలిక పదోన్నతులు కల్పించి, పోస్టులు కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది.