Liquor Revenue: నాడు పోగొడితే.. నేడు రాబట్టారు
ABN , Publish Date - Sep 22 , 2025 | 04:34 AM
జగన్ హయాంలో జే బ్రాండ్లతో దోచుకున్నారు. కమీషన్ల కోసం మద్యం కంపెనీలకు చుక్కలు చూపించారు. మరోవైపు ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని పోగొట్టారు.
మద్యం ఆదాయంలో రాష్ట్రమే టాప్
వైసీపీ హయాంలో పొరుగుకు మేలు
పాపులర్ బ్రాండ్లు లేకపోవడంతో ఇతర రాష్ట్రాల వైపు మందుబాబుల చూపు
సరిహద్దుల్లో తీవ్ర స్థాయిలో ఆదాయ నష్టం
ప్రభుత్వం మారాక పెరిగిన అమ్మకాలు
10.29శాతం మేరకు పుంజుకున్న విక్రయాలు
ఈ ఏడాది రూ.30 వేల కోట్ల ఆదాయం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
జగన్ హయాంలో ‘జే’ బ్రాండ్లతో దోచుకున్నారు. కమీషన్ల కోసం మద్యం కంపెనీలకు చుక్కలు చూపించారు. మరోవైపు ఖజానాకు రావాల్సిన ఆదాయాన్ని పోగొట్టారు. వైసీపీ ప్రభుత్వం అమలుచేసిన అడ్డగోలు మద్యం విధానంతో రాష్ర్టానికి రావాల్సిన ఆదాయం పక్క రాష్ర్టాలకు తరలిపోయింది. ఐదేళ్లలో సుమారు రూ.18 వేల కోట్ల ఆదాయ నష్టం వాటిల్లిందని ప్రభుత్వం అంచనా వేసింది. తాజాగా మద్యం అమ్మకాలపై తీసిన లెక్కలు ఇదే విషయాన్ని రుజువు చేశాయి. గత ప్రభుత్వంలో ఏపీలో మంచి బ్రాండ్లు లేక పక్క రాష్ర్టాల బాట పట్టిన మందుబాబులు ఇప్పుడు రాష్ట్రంలోనే మద్యం కొనుక్కుని తాగుతున్నారు. ఫలితంగా మన ఆదాయం మనకే దక్కుతోంది. ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దుల్లోని షాపుల్లో అమ్మకాలు భారీగా పెరిగి, పక్క రాష్ర్టాల షాపుల్లో విక్రయాలు పడిపోయాయి. దీంతో 11.05 శాతం ఆదాయం పెరిగింది. కర్ణాటక మినహా మిగిలిన ఏ రాష్ట్ర మద్యం ఆదాయంలోనూ రెండంకెల వృద్ధి కనిపించలేదు.
అమ్మకాలు పైపైకి!
ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు 5 నెలల్లో అమ్మకాలపై ఎక్సైజ్ శాఖ అధ్యయనం చేసింది. ఈ వివరాలను ఇటీవలి కలెక్టర్ల సదస్సులో ఆ శాఖ అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ ఐదు నెలల కాలంలో 10.29శాతం అమ్మకాలు పెరిగాయి. 2024-25లో రూ.11,812 కోట్ల అమ్మకాలు నమోదయ్యాయి. ఈ ఏడాది అదే కాలంలో రూ.13,028 కోట్ల విక్రయాలు జరిగాయి. అదే తెలంగాణలో 3.45 శాతం, తమిళనాడులో 5.3 శాతం, కర్ణాటకలో 4.27 శాతం, కేరళలో 6.74 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయి. గతేడాది అక్టోబరులో కొత్త మద్యం విధానం అమల్లోకి వచ్చిన తర్వాత పరిస్థితి మారింది. ఆదాయాన్ని పరిశీలిస్తే.. ఐదు నెలల కాలంలో ఏపీ 11.05 శాతం వృద్ధి సాధించింది. తెలంగాణ 0.65 శాతం, తమిళనాడు 2.53 శాతం, కర్ణాటక 13.64 శాతం, కేరళ 6.25 శాతం ఆదాయం పెరిగింది. మద్యం అమ్మకాలు భారీగా నమోదయ్యే ఒక్క కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ర్టాల్లో ఆదాయం చెప్పుకోదగ్గ స్థాయిలో పెరగలేదు. ఏపీ ప్రజలు పక్క రాష్ర్టాల్లో మద్యం కొనుగోలు మానేయడం వల్లే అమ్మకాలు, ఆదాయం ఇలా పెరిగాయని అధికారులు అంచనా వేశారు. సాధారణంగా మద్యం విక్రయాలలో ఎప్పుడూ 10శాతం వృద్ధి ఉంటుంది. గత ప్రభుత్వం నిర్వాకంతో అమ్మకాలు పెంచుకున్న సరిహద్దు రాష్ర్టాలకు ఇప్పుడు ఆ అవకాశం లేకుండా పోయింది. ఫలితంగా విక్రయాలు తగ్గాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తంగా రూ.29,442 కోట్ల ఆదాయం రాగా, ఈ ఏడాది రూ.30 వేల కోట్లు దాటనుంది.
జిల్లాల వారీగా ఇలా...
జిల్లాలవారీగా గడిచిన 5 నెలల అమ్మకాలు పరిశీలిస్తే కర్నూలు టాప్‌లో ఉంది. తెలంగాణతో సరిహద్దు ప్రాంతం ఎక్కువగా ఉండే ఆ జిల్లాలో 57శాతం అమ్మకాలు పెరిగాయి. శ్రీసత్యసాయి జిల్లాలో 53 శాతం, అల్లూరిలో 52 శాతం, చిత్తూరులో 44శాతం అమ్మకాలు పుంజుకున్నాయి. కానీ, విజయనగరం, కృష్ణా, కడప, శ్రీకాకుళం జిల్లాల్లో అమ్మకాలు పెరగకపోగా తగ్గాయి. గుంటూరు, నెల్లూరులో 3 శాతం మాత్రమే అమ్మకాలు పెరిగాయి. అయితే, కొన్ని జిల్లాల్లో ఎమ్మార్పీ ఉల్లంఘనల కారణంగా అమ్మకాలు తగ్గుతున్నాయి.
రూ.132 కోట్ల భారం తగ్గింది
వైసీపీ ప్రభుత్వంలో నాసిరకం బ్రాండ్లతో ఇక్కడి మద్యం తాగాలంటే వినియోగదారులు భయపడ్డారు. వాటికే ధరలు విపరీతంగా పెంచడంతో అమ్మకాలు ఇంకా తగ్గాయి. పోనీ ఈ కారణాల వల్ల ప్రజలు మందు మానేశారా అంటే అదీ లేదు. ఎక్కువ ఖర్చయినా కొందరు పక్క రాష్ర్టాల నుంచి మద్యం తెప్పించుకున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సరైన ప్రమాణాలు పాటించని 29 బ్రాండ్లను నిలిపేశారు. 46 బ్రాండ్లు స్వచ్ఛందంగా ధరలు తగ్గించుకున్నాయి. ఈ ప్రభుత్వంలో కమీషన్ల బెడద లేకపోవడంతో తక్కువ ధరకే మద్యం సరఫరా చేసేందుకు ముందుకొచ్చాయి. దీంతో ఒక్కో లిక్కర్ బాటిల్‌పై రూ.10నుంచి రూ.100 వరకు ధర తగ్గింది. ఫలితంగా నెలకు వినియోగదారులపై రూ.132 కోట్ల భారం తగ్గింది. ఇది ఖజానాకు నష్టం అయినప్పటికీ ఏపీలో 11.05 శాతం వృద్ధి నమోదైందని అధికారులు చెప్పారు.