Krishna Water: నాడు జగన్మాయ.. నేడు నిజమాయె
ABN , Publish Date - Aug 26 , 2025 | 04:05 AM
నాటి జగన్ పాలనకు, నేటి చంద్రబాబు పాలనకు మధ్య తేడా ఇది! జగన్ హయాంలో కుప్పంలో పారింది మాయా జలాలు’! ఇప్పుడు పారుతున్నది నిజంగా... కృష్ణా జలాలు. రాయలసీమకు జల సిరులు పంచేందుకు...
కుప్పం నియోజకవర్గానికి కృష్ణమ్మ
ఎన్నికల ముందు జగన్ మాయా జలాలు
ఉత్తుత్తి గేటు పెట్టి నీటి విడుదల నాటకం
20ు పనులూ పూర్తిచేయకుండా మోసం
కుప్పం కాలువపై చంద్రబాబు దృష్టి
ఏడాదిన్నరలోనే శరవేగంగా పనులు
ఫేక్ ప్రచారాలే కాదు... ఫేక్ గేట్లు, ఫేక్ నీళ్లు కూడా! ఇది... వైఎస్ జగన్మాయ! ‘చంద్రబాబు నియోజకవర్గానికి నీళ్లు ఇచ్చాం’ అని చెప్పుకోవడానికి సీఎం హోదాలో జగన్ పెద్ద మాయ చేశారు. గత ఏడాది ఎన్నికల ముందు ఉత్తుత్తి గేట్లు పెట్టి... నీటిని ఎత్తిపోశారు.
సరిగ్గా ఏడాదిన్నరలో... చిత్రం మారిపోయింది! కుప్పం కాల్వలకు జల కళ వచ్చింది. మాయలేదు... మోసం లేదు! హంద్రీ నీవా కాల్వల్లోకి కృష్ణా జలాలు గలగలా ప్రవహించాయి. కుప్పం నియోజకవర్గ దశాబ్దాల కల నెరవేరింది. ఆ ప్రాంతానికి కృష్ణా నీళ్లొచ్చాయి.
మాయ
2024 ఫిబ్రవరి 24వ తేదీన రామకుప్పం మండలం రాజుపేట వద్ద ఉత్తుత్తి గేటు పెట్టి జగన్ ‘నీళ్లు విడుదల’ చేశారు. ఆ గేటును మరుసటి రోజునే జేసీబీతో ఇలా ఎత్తేశారు.
నిజం
జగన్ ‘మాయా జలాలు’ ఇచ్చిన అదే రాజుపేట వద్ద... కుప్పం బ్రాంచ్ కెనాల్‌లో నిండుగా పారుతున్న కృష్ణా జలాలు.. (ఇన్‌సెట్) సోమవారం కుప్పం నియోజకవర్గంలోని పరమసముద్రం చెరువుకు చేరుతున్న కృష్ణా జలాల్లో జనం సంబరాలు.
(కుప్పం - ఆంధ్రజ్యోతి)
నాటి జగన్ పాలనకు, నేటి చంద్రబాబు పాలనకు మధ్య తేడా ఇది! జగన్ హయాంలో కుప్పంలో పారింది ‘మాయా జలాలు’! ఇప్పుడు పారుతున్నది నిజంగా... కృష్ణా జలాలు. రాయలసీమకు జల సిరులు పంచేందుకు శ్రీశైలం జలాశయం నుంచి కృష్ణా జలాలను తరలించేందుకు హంద్రీ నీవా పథకాన్ని చేపట్టారు. 2014-2019 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు హంద్రీ-నీవా కాలువ నిర్మాణం ప్రారంభించారు. కుప్పం బ్రాంచి కెనాల్‌ను 123 కిలోమీటర్ల మేర డిజైన్ చేసి, మూడు చోట్ల పంప్ హౌస్‌లు ఏర్పాటు చేశారు.
2019 ఎన్నికల నాటికి ఆ పనులు 80 శాతం పూర్తయ్యాయి. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యారు. హంద్రీ-నీవా కాలువను పూర్తి చేసి కుప్పానికి నీళ్లిస్తానని ఆయన ఎన్నికల్లో హామీ ఇచ్చారు. కానీ... అధికారంలోకి వచ్చాక దానిని పూర్తిగా విస్మరించారు. ఎన్నికలకు సరిగ్గా నాలుగైదు నెలల ముందు, హంద్రీ-నీవా కాలువకు నీళ్లను విడుదల చేస్తున్నామంటూ పెద్ద డ్రామాకు తెరతీశారు. 2024 ఫిబ్రవరి 26వ తేదీన రామకుప్పం మండలం రాజుపేట వద్ద హంద్రీ-నీవా కాలువకు నీటిని ‘విడుదల చేస్తున్నట్లు’ ఒక సెట్టింగ్ వేశారు. జగన్ గేటు ఎత్తి హడావుడి చేశారు. కానీ... అదంతా ఒట్టి మోసం. ప్రారంభోత్సవం చేసిన చోట... అదే రోజు సాయంత్రానికే నీళ్లు నిశ్చలంగా, మడుగులా నిలిచిపోయాయి. ఆ మరుసటి రోజున... జేసీబీని తెచ్చి గేటును సైతం అక్కడి నుంచి తరలించారు. వెరసి... కేవలం ఎన్నికల సమయంలో ప్రజలను మోసం చేసేందుకే ఈ డ్రామా ఆడినట్లు స్పష్టమైంది.
కుప్పం చేరిన కృష్ణా జలాలు
హంద్రీ-నీవా పెండింగ్ పనులను పూర్తి చేసి కృష్ణా జలాలను తీసుకు వస్తానని ఎన్నికల ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి రాగానే నిధులు విడుదల చేశారు. లైనింగ్‌తోపాటు, ఇతర పెండింగ్ పనులను శరవేగంగా పూర్తి చేయించారు. ఇందుకోసం మొత్తం రూ.560 కోట్లు వ్యయం చేశారు. నంద్యాల జిల్లా మాల్యాల పంపింగ్ స్టేషన్ వద్ద గత జూలై 17న ముఖ్యమంత్రి చంద్రబాబు కృష్ణా జలాలను హంద్రీ-నీవా కాలువకు విడుదల చేశారు. అక్కడి నుంచి పరుగులు పెడుతూ వచ్చిన కృష్ణమ్మ శనివారం అర్ధరాత్రికి రామకుప్పం మండలం వర్దికుప్పం వద్ద కుప్పం నియోజకవర్గంలోకి ప్రవేశించాయి. అక్కడి నుంచి... శాంతిపురం, గుడుపల్లె మండలాల మీదుగా సోమవారం సాయంత్రానికి జరుగు పంచాయతీ వద్ద కుప్పం మండలంలోకి ప్రవేశించాయి. రాత్రి సుమారు 7.30-8.00 మధ్య అంతిమ స్థానమైన కుప్పం మండలంలోని పరమసముద్రం చెరువుకు చేరుకున్నాయి. స్థానికులు హంద్రీ-నీవా కాలువ ద్వారా తరలివచ్చిన కృష్ణా జలాలకు సంబరంగా స్వాగతం పలికారు.
గంగమ్మే మమ్మల్ని ఆశీర్వదించింది
సాక్షాత్తు ఆ శివుడి తలలోని గంగమ్మ తల్లే మమ్మల్ని ఆశీర్వదించడానికి ఈ కాలవ రూపంలో భూమ్మీదకు దిగొచ్చింది. ఏడాదంతా ఈ తల్లి మాతోనే ఉంటుంది. మాకు ధాన్యరాశులు ప్రసాదిస్తూ భాగ్యవంతుల్ని చేస్తుంది.
- శ్రీదేవి, గుడ్లనాయనిపల్లె, కుప్పం మండలం
ఇక దిగులు లేదు
ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న గంగమ్మ మా ముంగిట్లోకి వచ్చేసింది. నీళ్లుంటే మాలాంటి రైతులకు దిగులే లేదు. ఎంత కష్టమైనాపడి సేద్యంచేసి పంటలు పండించుకోగలం. పంట పండితే రైతుకు అంతకుమించిన భాగ్యం ఇంకేమీ లేదు.
- కుపేంద్ర, జోగిండ్లు, గుడుపల్లె మండలం