Share News

Gulf Rescue: ఎట్టకేలకు స్వదేశానికి నజీర్‌

ABN , Publish Date - Jul 08 , 2025 | 06:29 AM

రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల్లో.. ఎదిగిన కొడుకు కష్టపడితేనే ఆయా కుటుంబాలకు ఒక ఆసరా. ఈ క్రమంలో ఆ కష్టమేదో ఏ అరబ్బు దేశంలోనో చేస్తే.. నాలుగు రాళ్లు వెనకేసుకుని..పేదరికాన్ని జయించవచ్చన్న కలలు కొందరికి సార్థకమవుతుండగా...

Gulf Rescue: ఎట్టకేలకు స్వదేశానికి నజీర్‌

  • ఏపీ ప్రభుత్వం, ‘సాటా సెంట్రల్‌’ చొరవ

  • ఉద్యోగం కోసం వెళ్లి.. పశువుల కాపరిగా మారిన నెల్లూరు వాసి

(ఆంధ్రజ్యోతి గల్ఫ్‌ ప్రతినిధి)

రెక్కాడితేగానీ డొక్కాడని పేద కుటుంబాల్లో.. ఎదిగిన కొడుకు కష్టపడితేనే ఆయా కుటుంబాలకు ఒక ఆసరా. ఈ క్రమంలో ఆ కష్టమేదో ఏ అరబ్బు దేశంలోనో చేస్తే.. నాలుగు రాళ్లు వెనకేసుకుని..పేదరికాన్ని జయించవచ్చన్న కలలు కొందరికి సార్థకమవుతుండగా, మరికొందరికి దళారుల కారణంగా శాపంగా మారుతున్నాయి. నెల్లూరు జిల్లా కలువాయి మండలం కుల్లూరు గ్రామానికి చెందిన 23 ఏళ్ల షేక్‌ నజీర్‌ ఇలాగే గల్ఫ్‌ దేశంలో చిక్కుకుపోయాడు. ఎట్టకేలకు అక్కడి కష్టాల నుంచి గట్టెక్కి స్వదేశానికి రానున్నాడు. వివరాలివీ.. షేక్‌ నజీర్‌ కుల్లూరు గ్రామంలో చిన్నచిన్న పనులు చేసుకొంటూ గడిపేవాడు. పేద కుటుంబం కావడంతో.. ఎక్కడికైనా వెళ్లి నాలుగు డబ్బులు సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలవాలనుకున్నాడు. కొందరు దళారుల సాయంతో సూపర్‌మార్కెట్‌లో ఉద్యోగమని నమ్మి సౌదీ అరేబియా వెళ్లాడు. తీరా అక్కడికెళ్లాక దళారులు మోసం చేయడంతో వేల కిలోమీటర్ల దూరంలోని మారుమూల పల్లెలో పశువుల కాపరిగా, తర్వాత వ్యవసాయ కూలీగా మారాడు. దీంతో తాను మోసపోయిన విషయాన్ని, తాను ఎదుర్కొంటున్న కష్టాలను వివరిస్తూ తల్లిదండ్రులకు వీడియో పంపించాడు. వారు ఆందోళన చెంది వెంటనే కొందరి సాయంతో సౌదీలోని తెలుగు ప్రవాసీయుల సంఘం ‘సాటా సెంట్రల్‌’ ప్రతినిధులు షేక్‌ జానీ బాషా, రంజిత్‌, ముజమ్మీల్‌, నరేంద్రలను సంప్రదించారు. దీనిపై జానీ బాషా బృందం వెంటనే స్పందించి, రియాద్‌ నుంచి సుమారు వెయ్యి కిలోమీటర్ల దూరంలో నజీర్‌ ఉంటున్న ప్రాంతానికి, అతడు పంపిన జీపీఎస్‌ ఆధారంగా పయనమైంది. అయితే వారు ప్రయాణిస్తు కారు జీపీఎస్‌ సిగ్నల్‌ అందక దారితప్పి మధ్యలో ఇసుకలో దిగబడింది. అయినప్పటికీ జానీ బాషా బృందం కొన్ని వందల కిలోమీటర్ల దూరం కాలినడకన నజీర్‌ను చేరుకొంది. ఈ క్రమంలో నజీర్‌ కథనం ‘ఆంధ్రజ్యోతి’లో రావడంతో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్‌, ఢిల్లీలోని రెసిడెంట్‌ కమిషనర్‌ లవ్‌ అగర్వాల్‌తో పాటు ఏపీ ఎన్నార్టీ సంస్థ ఉన్నతాధికారులు స్పందించారు. రియాద్‌ నగరంలో నజీర్‌కు ఆశ్రయం కల్పించి, భారతీయ ఎంబసీ చొరవతో సౌదీ ప్రభుత్వ అధికారుల సాయంతో నజీర్‌ ఇండియా రావడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. విమాన టికెట్‌ కూడా సమకూర్చగా, నజీర్‌ ఒకటి రెండ్రోజుల్లో స్వదేశానికి చేరుకుంటారని జానీ బాషా బృందం వెల్లడించింది.

Updated Date - Jul 08 , 2025 | 06:31 AM