Inspirational Transformation: కత్తులు వదిలి.. కలం, హలం
ABN , Publish Date - Aug 27 , 2025 | 04:23 AM
రాయలసీమలో కరుడు గట్టిన ఫ్యాక్షన్ గ్రామం అది!. పచ్చని ఆ పల్లెను ఫ్యాక్షన్ భూతం నాశనం చేసింది. ఐదు దశాబ్దాలకు పైగా ముఠా గొడవలతో రక్తం పారింది. పదేళ్ల క్రితం ఆ పల్లెలో ఓ ఐపీఎస్ అధికారి అడుగు పెట్టారు. ‘‘ఇది నా ఊరు..
మారిన కప్పట్రాళ్ల ముఖచిత్రం
ఐపీఎస్ రవికృష్ణ దత్తతతో కీలక మార్పు
డీఎస్సీలో 8 మంది గురువులుగా ఎంపిక
ఏడాదిపాటు శిక్షణ ఇచ్చిన రవికృష్ణ
‘సేవ్ ట్రీస్’ద్వారా రైతులకు మొక్కల పంపిణీ
‘తానా’ సహకారంతో స్త్రీశక్తి భవన నిర్మాణం
(కర్నూలు- ఆంధ్రజ్యోతి)
రాయలసీమలో కరుడు గట్టిన ఫ్యాక్షన్ గ్రామం అది!. పచ్చని ఆ పల్లెను ఫ్యాక్షన్ భూతం నాశనం చేసింది. ఐదు దశాబ్దాలకు పైగా ముఠా గొడవలతో రక్తం పారింది. పదేళ్ల క్రితం ఆ పల్లెలో ఓ ఐపీఎస్ అధికారి అడుగు పెట్టారు. ‘‘ఇది నా ఊరు.. ఇక్కడి జనం నా వాళ్లు.. పండుగైనా.. సంబరమైనా ఈ ఊళ్లోనే.’’ అంటూ దత్తత తీసుకున్నారు. ‘‘రోడ్లు, మురుగుకాల్వలు, తాగు నీరు వంటి వసతులు కల్పిస్తే చాలా?. కానే కాదు, మనుషులు మారాలి.. వాళ్ల మనసులు మారాలి.’’ అని సంకల్పించారు. అది జరగాలంటే కత్తులు పట్టిన చేతులు కలం.. హలం పట్టాలని భావించారు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం(తానా) వంటి సంస్థల సహకారంలో ఓ వైపు ప్రగతి పనులు చేయిస్తూనే.. మరో వైపు చదువు.. ఉద్యోగం.. ఉజ్వల భవితపై యువతలో ఆసక్తి పెంపొందించారు. ఏడాదికిపైగా నిరుద్యోగ యువతకు ఆయన ఇచ్చిన ప్రేరణ ఫలించింది. ఫ్యాక్షన్ జోన్‌గా పేరుబడ్డ కర్నూలు జిల్లా కప్పట్రాళ్ల నుంచి తాజా డీఎస్సీలో ఎనిమిది మంది గురువులుగా ఎంపికయ్యారు. ఆ ఐపీఎస్ అధికారే ఒకప్పటి కర్నూలు ఎస్పీ, ప్రస్తుత ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ.
రవికృష్ణ స్పూర్తి..
కప్పట్రాళ్లను దత్తత తీసుకున్న ఐపీఎస్ ఆకే రవికృష్ణ.. ఇక్కడి చదువుకున్న యువత అభిరుచులు గుర్తించారు. పోలీస్ అవ్వాలని అనుకున్నవారికి ఉచిత కోచింగ్ సహా హాస్టల్ వసతి కల్పించారు. ఆయన ప్రేరణతో నలుగురు యువకులు కానిస్టేబుళ్లుగా ఎంపికయ్యారు. రవికృష్ణ బదిలీపై వెళ్లినా ఈ ఊరును మరువలేదు. ఉద్యోగాల కోసం సాధన చేసే నిరుద్యోగ యువతకు చేయూతగా నిలిచారు. కూటమి ప్రభుత్వం రాగానే ‘మెగా డీఎస్పీ’ ప్రకటన ఇచ్చింది. దీంతో కప్పట్రాళ్ల గ్రామంలో డిప్లమో ఇన్ ఎడ్యుకేషన్(డీఈడీ) చేసిన 15 మందిని గుర్తించారు. తాను అడ్మిన్‌గా ఉంటూ ఆ 15 మందితో ‘డీఎస్సీ-2025’ వాట్సాప్ గ్రూపును ఏర్పాటు చేశారు. 90 రోజుల ప్రణాళిక సిద్ధం చేశారు. తాను సివిల్స్‌కు ఎలా సాధన చేశారో.. అదే తరహాలో వారితో సాధన చేయించారు. నిత్యం వారికి ఫోన్లో అందుబాటులో ఉంటూ గైడ్ చేశారు. అంతేకాదు ప్రతి 10-15 రోజులకు ఒకసారి గంటకు పైగా జూమ్ వీడియో సమావేశం నిర్వహించి.. ఆ పక్షం రోజులు వారి సాధన ఎలా ఉంది? ఎలాంటి పొరపాట్లు చేశారు? రాబోయే 15 రోజులు ఎలా సాధన చేయాలి? రోజువారి పరీక్షలు ఎలా రాయాలి? వంటి అంశాలపై అవగాహన కల్పించారు. ఒకటి రెండు నెలలు కాదు.. ఏకంగా ఏడాదికిపైగా ప్రణాళికా బద్ధంగా సాధన చేయించారు. ఆయన ప్రణాళిక ఫలించింది. డీఎస్పీ-2025లో ఏకంగా ఎనిమిది మంది ఎస్జీటీ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వారంతా కార్పొరేట్ పాఠశాల, కళాశాలల్లో చదివలేదు. 1-10వ తరగతి వరకు ఊళ్లోని ప్రభుత్వ బడిలో, ఇంటర్మీడియట్ కోడుమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో తెలుగు మీడియంలో చదివిన వారే. కప్పట్రాళ్ల దత్తపుత్రుడు ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ ఎంత ఒత్తిడి ఉన్నా.. దత్తత తీసుకున్న ఊరి యువత భవిషత్తు కోసం కృషి చేయడమే తమను విజేతలుగా నిలిపిందని ఉపాధ్యాయులుగా ఎంపికైన వారు చెబుతున్నారు.
దత్తతతో మార్పు!
కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఫ్యాక్షన్ గ్రామం కప్పట్రాళ్ల. ఆధిపత్యం కోసం మొదలైన గొడవలు ఫ్యాక్షన్ భూతంగా మారాయి. దాడులు, ప్రతిదాడుల్లో ఎందరో అసువులు బాశారు. 2014లో కర్నూలు ఎస్సీగా ఆకే రవికృష్ణ బాధ్యతలు తీసుకున్నారు. కప్పట్రాళ్లలో మార్పు తీసుకురావాలని సంకల్పించారు. ఈ క్రమంలోనే 2015లో కప్పట్రాళ్లను దత్తత తీసుకున్నారు. ‘సేవ్ ట్రీస్’ అనే సంస్థ సహకారంతో రైతులకు ఉచితంగా 60 వేల పండ్ల మొక్కలు పంపిణీ చేయించారు. కొందరు రైతులు ఇప్పుడు ఆదాయం కూడా ఆర్జిస్తున్నారు. రైతుల ఉత్పత్తుల నిల్వకు రూ.20 లక్షలతో సోలార్ శీతల గిడ్డంగి నిర్మించారు. మహిళలనూ పొదుపు సంఘాల్లో చేర్పించి సుమారు రూ.30 లక్షలకు పైగా రుణాలు ఇప్పించారు. ‘తానా’ సహకారంతో సుమారు రూ.40 లక్షల వ్యయంతో ‘స్త్రీ శక్తి’ భవనాన్ని నిర్మించారు. ఆకే రవికృష్ణ సతీమణి పార్వతీదేవి కూడా ఓ పొదుపు సంఘం సభ్యురాలే. నేను సైతం.. అంటూ ఆమె కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చల్లో పాల్గొంటూ దిశానిర్దేశం చేస్తుంటారు. అన్నదాతలు, మహిళలకు దారి చూపిన రవికృష్ణ.. పదెకరాల విస్తీర్ణంలో పాఠశాల, ప్రహరీ నిర్మించారు. దాతల సహకారంతో కల్యాణ మండపం, రైతు భవనాలు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతులు కల్పించారు.
సార్ ప్రోత్సాహం మరవలేనిది
అమ్మ నాన్నలు లక్ష్మిదేవి, రాముడు. పొలంలో పనులు చూస్తూ చదివించారు. ఊళ్లోనే పదవ తరగతి వరకు, కోడుమూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివాక.. డీఎడ్ చేశాం. మా ఊరును దత్తత తీసుకున్న ఈగల్ చీఫ్ రవికృష్ణ ప్రోత్సాహంతో కోచింగ్ సెంటర్లో రెండు నెలలు శిక్షణ తీసుకున్నాం. తొలి ప్రయత్నంలోనే అన్నాచెల్లెళ్లు ఇద్దరం ఎస్జీటీ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాం.
- చింతమాను శ్రీరాములు, రాజేశ్వరి
నాడు వలస కూలీలు.. నేడు టీచర్లు
మాది నిరుపేద కుటుంబం. రెండెకరాలు పొలం ఉన్నా.. అమ్మ నాన్నలు రంగమ్మ, కృష్ణలు కూలీ పనులు చేస్తూ, రాళ్లు కొడుతూ మమ్మల్ని బడికి పంపారు. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వస్తుందని తెలియడంతో రవికృష్ణ సార్ మాతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసి మోటివేషన్ చేశారు. ఆయన ఇచ్చిన ప్రణాళిక ప్రకారం సాధన చేయడం వల్లే ఎస్జీటీ ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాం.
- ఎన్.రామాంజనేయులు,రామానాయుడు
అమ్మ, అన్న ప్రోత్సాహం మరవలేను
ఎస్జీటీ ఉపాధ్యాయుడిగా ఎంపికై బడిలో అడుగుపెట్టబోతున్నానంటే మోటివేషన్ చేసిన ఈగల్ చీఫ్ ఆకే రవికృష్ణ సార్, అమ్మ చంద్రమ్మ, అన్న ఉపేంద్ర ప్రోత్సాహం ఎంతో ఉంది. వారిని జీవితంలో మరవలేను. నాన్న శ్రీనివాసులు చనిపోతే, అమ్మ టైలరింగ్ చేస్తూ, అన్న వ్యవసాయ పనులు చేస్తూ నన్ను చదివించారు. డీఎస్సీ-2025లో మెరిట్ సాధించి ఉద్యోగం సాధించడానికి నాతో సహా మా మిత్రులకు రవికృష్ణ సార్ మోటివేషన్ ఎంతగానో దోహదపడింది.
- ఈ. ఉత్తేజ్ గౌడ్
జూమ్ శిక్షణ గెలిపించింది
మాది వ్యవసాయ కుటుంబం. అమ్మనాన్నలు జయలక్ష్మి, రంగన్నలు పొలంలో పనులు చేస్తూ చదివించారు. కోడుమూరు సమీపంలోని ఠాగూర్ డీఈడీ కళాశాలలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేశాను. మా ఊరు దత్తపుత్రుడు ఆకే రవికృష్ణ సార్ ప్రేరణ మాకు ఎంతో ఉపయోగ పడింది. జూమ్ సమావేశంలో అవగాహన కల్పించారు. ప్రణాళిక బద్ధంగా సాధన చేయించారు. గురువుగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది.
- మర్యాద రామకృష్ణ