Achievements: నాడు అవమానం.. నేడు ప్రశంస
ABN , Publish Date - Dec 10 , 2025 | 06:06 AM
కేంద్ర ప్రభుత్వ పథకాలను గత జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటూ..
ఆర్‌జీఎస్ఏ అమల్లో అనూహ్య ప్రగతి
కేంద్ర ప్రభుత్వ పథకం సద్వినియోగం
2.56 లక్షల మంది ప్రజాప్రతినిధులు,అధికారులకు ‘అభియాన్’ కింద శిక్షణ
దేశంలో 24వ స్థానం నుంచి 1వ మెట్టుకు
జగన్ హయాంలో దీనిని పట్టించుకోని వైనం
దీంతో కేంద్రం ముందు తలొంచుకున్న రాష్ట్రం
వైసీపీ హయాంలో ఢిల్లీ ముందు తలొంచుకున్న రాష్ట్రం.. ఇప్పుడు సగర్వంగా తలెత్తుకుని నిలబడింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్‌జీఎ్‌సఏ) అమలును అటకెక్కించిన జగన్ ప్రభుత్వానికి హస్తినలో నాడు అవమానాలు ఎదురవగా.. అదేపథకాన్ని అమలు చేయడంలో వేగం పెంచిన ప్రస్తుత ప్రభుత్వానికి ప్రశంసలు దక్కాయి. ఈ పథకాన్ని సమగ్రంగా అమలు చేస్తున్న రాష్ట్రాల్లో నాడు 24వ స్థానంలో ఉన్న ఏపీ.. నేడు 1వ స్థానానికి ఎగబాకి దేశరాజధానిలో సత్తా చాటింది!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
కేంద్ర ప్రభుత్వ పథకాలను గత జగన్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తే.. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకుంటూ.. ఢిల్లీ పెద్దల మన్ననలు పొందుతోంది. గత టీడీపీ హయాంలో ప్రతి శాఖకు సంబంధించి లక్ష్యాలు సాధించడంలో ముందున్న రాష్ట్రాన్ని.. వైసీపీ అధికారంలోకి వచ్చాక వెనక్కినెట్టింది. పలు పథకాలకు రాష్ట్ర వాటా ఇవ్వకుండా కేంద్ర పథకాలను అటకెక్కించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని స్థానికసంస్థల ప్రజాప్రతినిధుల శిక్షణకు ఉద్దేశించిన కీలక పథకం రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్(ఆర్‌జీఎస్ఏ)ను సైతం జగన్ సర్కారు విస్మరించింది. ఒక్క ప్రజాప్రతినిధికి కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి రూపాయి నిధులు కూడా రాలేదు. దీంతో రాష్ట్రం దేశంలో 24వ స్థానంలో నిలిచింది. ఢిల్లీలోని కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ అధికారుల వద్దకు వెళ్లినప్పుడు తప్పు చేసిన వాళ్లలా మన అధికారులు తలవంచుకునేవారు.
2.56 లక్షల మందికి శిక్షణ
ఆర్‌జీఎస్ఏ ద్వారా 2024-25 సంవత్సరంలో ప్రజాప్రతినిధులు, పంచాయతీరాజ్‌సంస్థ ఉద్యోగులు సుమారు 3 లక్షల మందికి శిక్షణ ఇచ్చేందుకు లక్ష్యాలు నిర్దేశించగా.. జూలై నుంచి నవంబరు లోపు 1.36 లక్షల మందికి శిక్షణ ఇచ్చారు. దీంతో గత ఏడాది రాష్ట్రం దేశంలో నాలుగో స్థానం సాధించింది. ఇక, 2025-26లో ఇప్పటి వరకు 2.56 లక్షల మందికి శిక్షణ ఇచ్చి మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సమీక్షలు, అధికారుల పనితీరుతో ఆర్‌జీఎస్ఏ అమలులో 18 నెలల్లో మొదటి స్థానానికి ఎగబాకింది. శిక్షణ పరంగా పలు వినూత్న విధానాలు తీసుకొచ్చారు. మహిళా ప్రజా ప్రతినిధులు సహకారం, పంచాయతీల్లో ఆదాయం పెంపు, మహిళా ఫ్రెండ్లీ గ్రామ పంచాయతీ నమూనా, ఎంపీడీఓలు, డీడీఓలకు, జూనియర్ అసిస్టెంట్లకు ఫౌండేషన్ కోర్సుల్లో శిక్షణ అందించడం ద్వారా అటు సంస్థలు, ఇటు ఉద్యోగుల సామర్థ్యం పెంచేందుకు పంచాయతీరాజ్ అధికారులు కృషి చేశారు. విశాఖపట్నం ఐఐఎం నేతృత్వంలో 500 మంది పంచాయతీరాజ్ అధికారులకు శిక్షణ ఇచ్చేందుకు ఎస్‌ఐఆర్‌డీ ఎంఓయూ చేసుకుంది. మొదటి బ్యాచ్‌లో 57 మందికి శిక్షణ ఇచ్చారు.
శిక్షణ సంస్థపై ప్రత్యేక దృష్టి
పంచాయతీరాజ్ విభాగంలో ఉద్యోగులు, స్థానికసంస్థల ప్రతినిధులకు శిక్షణ ఇవ్వడం ద్వారా వారుగ్రామీణాభివృద్ధి కోసం ప్రభావవంతంగా కృషి చేయగలరని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ భావించారు. ఈ క్రమంలోనే 617 గ్రామ పంచాయతీలకు కొత్త భవనాలను మంజూరుచేశారు. వాటిలో చాలా భవనాల నిర్మాణాలు పూర్తవుతున్నాయి. పంచాయతీరాజ్ సిబ్బంది వెయ్యిమందిని ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లి పంచాయతీరాజ్‌శాఖ పనితీరుపై అధ్యయనం చేశారు. కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ ఆదేశాలతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ను విజయనగరంలోని కేంద్రగిరిజన యూనివర్సిటీలో ఏర్పాటు చేశారు. రూ.కోటితో రాష్ట్రస్థాయి కేంద్రాన్ని(స్టూడియో) ఏర్పాటుచేశారు. ఇలా పలు కార్యక్రమాల ద్వారా ఆర్‌జీఎ్‌సఏకు తిరిగి పూర్వ వైభవం తీసుకురాగలిగారు. కేంద్రం సహకారంతో ఆర్‌జీఎ్‌సఏను అమరావతిలో నెలకొల్పడంద్వారా దేశంలో ఈ శిక్షణా సంస్థను తలమానికంగా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.