Share News

Land Disputes: ఇంతలో ఎంత వైవిధ్యం!

ABN , Publish Date - Mar 16 , 2025 | 04:30 AM

నాడు విధ్వంసానికి సాక్షిగా నిలిచిన స్వామివారి సన్నిధి.. నేడు లోక కల్యాణానికి వేదికగా మారింది. అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి గత జగన్‌ ప్రభుత్వం వెంకటపాలెం శ్రీనివాసుడి సన్నిధినే సాక్షిగా మార్చుకోగా..

Land Disputes: ఇంతలో ఎంత వైవిధ్యం!

  • నాడు విధ్వంసం... నేడు లోక కల్యాణం..

  • రెండింటికీ వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణమే వేదిక

  • ఇక్కడే సెంటు పట్టాల పేరుతో రాజధాని రైతుల గుండెల్లో చిచ్చు

  • రైతులు, మహిళల ఆక్రందనలు, ఆక్రోశాలతో మార్మోగిన ప్రాంతం

  • నేడు వేద మంత్రోచ్ఛరణలు, అన్నమయ్య సంకీర్తనలతో పునీతం

  • రాజధాని రైతులకు, మహిళలకు కల్యాణోత్సవంలో అగ్రతాంబూలం

  • వేదికకు సమీపంలో వారికోసం ప్రత్యేకంగా గ్యాలరీలు కేటాయింపు

గుంటూరు, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ఇంతలో ఎంత వైవిధ్యం! సరిగ్గా రెండేళ్లలో అంతా మారిపోయింది. నాడు విధ్వంసానికి సాక్షిగా నిలిచిన స్వామివారి సన్నిధి.. నేడు లోక కల్యాణానికి వేదికగా మారింది. అమరావతి రాజధానిని ధ్వంసం చేయడానికి గత జగన్‌ ప్రభుత్వం వెంకటపాలెం శ్రీనివాసుడి సన్నిధినే సాక్షిగా మార్చుకోగా.. నేడు కూటమి ప్రభుత్వం లోక కల్యాణం కోసం చేసే శ్రీవారి కల్యాణానికి అదే ప్రాంతాన్ని వేదికగా మార్చి కొత్త భాష్యాన్ని ఇచ్చింది. యాధృచ్ఛికమా.. పాలకుల సంకల్పమా.. ఆ స్వామివారి చిత్తమా... ఏదేమైనా రాజధాని అమరావతిలోని ఆ శ్రీనివాసుడి సన్నిధి రెండు భిన్న ఘటనలకు వేదికగా మారింది. రెండేళ్ల కిత్రం అప్పటి వైసీపీ ప్రభుత్వం రాజధాని రైతుల గుండెలపై వెలిగించిన ఆరని కుంపటి ఆర్‌-5 జోన్‌ చిచ్చును ఇక్కడే రాజేసింది. రాజధానిలో పేదలకు సెంటు పట్టాల పేరుతో మొదలుపెట్టిన చిచ్చుకు అప్పటి ప్రభుత్వం శ్రీవారి సన్నిధినే వేదికగా ఎంచుకుంది. 2023 మే 25న ఆ తతంగాన్ని నిర్వహించింది. వేలాది మందిని ఇక్కడికి తరలించి, రాజధాని రైతులపై యుద్ధం ప్రకటించారా అనే స్థాయిలో కార్యక్రమాన్ని నిర్వహించి రైతులపై బల ప్రదర్శనకు దిగింది. సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా లెక్కచేయకుండా తన పంతం నెగ్గించుకుంది. ఆర్‌-5 జోన్‌లో ప్లాట్లను కేటాయిస్తూ లబ్ధిదారులకు పట్టాలిచ్చింది. ఆ రోజున రాజధాని గ్రామాలన్నీ గుండెలు పగిలేలా ఆక్రోశించాయి. మా సమాధులపై ఇవ్వండి సెంటు పట్టాలంటూ రోదించాయి.


అవేవీ పట్టని పాలకుడు దర్జాగా హెలీకాప్టర్లో వచ్చి ఒకరిద్దరికి సెంటు పట్టాలిచ్చి వెళ్లిపోయాడు.. సరిగ్గా 22 నెలలు గడిచేసరికి మొత్తం పరిస్థితి మారిపోయింది. నాటి విధ్వంసానికి మౌనసాక్షిగా నిలిచిన శ్రీవారు.. నేడు తన కల్యాణంతో లోక కల్యాణానికి శ్రీకారం చుట్టారు. శనివారం వెంకటపాలెంలో శ్రీవారి కల్యాణ మహోత్సవాన్ని టీటీడీ అంగరంగ వైభవంగా నిర్వహించింది. గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి శ్రీవారి కల్యాణోత్సవాన్ని తిలకించి, భక్తి పారవశ్యంలో ఓలలాడారు. అమరావతి చిరకాలం వర్ధిల్లాలని వేద పండితులు ఆశీర్వదించారు. రాజధాని రైతులకు, ప్రత్యేకించి రాజధాని మహిళలకు కల్యాణోత్సవంలో అగ్రతాంబూలం ఇచ్చి ప్రభుత్వం గౌరవించింది. వేదికకు సమీపంలో వారికోసం ప్రత్యేకంగా గ్యాలరీలు కేటాయించి, వేడుకల్లో భాగస్వాములను చేసింది.

ఏర్పాట్లలోనూ వైరుధ్యం

సెంటు పట్టాల పంపిణీ కార్యక్రమానికి వేలాది మందిని బలవంతంగా తరలించిన గత వైసీపీ ప్రభుత్వం సభా ప్రాంగణంలోకి కొంతమందినే అనుమతించింది. మిగిలినవారిని వారి ఖర్మానికి వదిలేసింది. మండు వేసవి ఎండల్లో తినడానికి తిండి లేక, కనీసం తాగడానికి నీళ్లు కూడా లేక మహిళలు, పేదలు అల్లాడిపోయారు. అప్పటి ముఖ్యమంత్రి మాత్రం 8 కి.మీ దూరానికే హెలికాప్టర్లో ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. కాగా ఇప్పుడు పకడ్బందీ ఏర్పాట్లతో ఏ ఒక్క భక్తుడికీ చిన్న ఇబ్బంది కూడా రాకుండా అధికారులు పక్కాగా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరికీ తాగునీరు, మజ్జిగ ప్యాకెట్లు, శ్రీవారి ప్రసాదం అందించి క్రమశిక్షణతో సేవలు అందించారు.

Updated Date - Mar 16 , 2025 | 04:30 AM