Share News

AP State Cabinet: 15 నుంచి స్త్రీశక్తి

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:32 AM

సూపర్‌ సిక్స్‌ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి స్త్రీ శక్తి పేరుతో ఈనెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. ఆ రోజు నుంచి మహిళలు ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రమంతా...

AP State Cabinet: 15 నుంచి స్త్రీశక్తి

  • మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి క్యాబినెట్‌ రైట్‌రైట్‌

  • 5 రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ప్రయాణించొచ్చు

  • రోజుకు 26.95 లక్షల మంది మహిళలకు లబ్ధి

  • ఏటా 1,942 కోట్ల వ్యయం

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘సూపర్‌ సిక్స్‌’ హామీల్లో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ వసతి ‘స్త్రీ శక్తి’ పేరుతో ఈనెల 15వ తేదీ నుంచి అమల్లోకి వస్తోంది. ఆ రోజు నుంచి మహిళలు ఐదు రకాల బస్సుల్లో రాష్ట్రమంతా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు అతివల ఉచిత బస్సు పథకానికి రాష్ట్ర క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ భేటీల్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు సమాచార, పౌరసంబంధాలు, గృహనిర్మాణ శాఖల మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ‘మన రాష్ట్రానికి చెందిన మహిళలు, విద్యార్థినులు, ట్రాన్స్‌జెండర్లు.. ఆధార్‌, ఓటర్‌ ఐడీ, రేషన్‌ కార్డును చూపించి.. పల్లెవెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్‌, మెట్రో ఎక్స్‌ప్రెస్‌ బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. అయితే నాన్‌స్టాప్ అంతర్రాష్ట్ర సర్వీసులు, ఇతర కేటగిరీ బస్సులకు, కాంట్రాక్ట్‌ క్యారేజ్‌ సర్వీసులు, చార్టెడ్‌ సర్వీసులు, ప్యాకేజీ టూర్లకు ఇది వర్తించదు. రాష్ట్రంలో ఉన్న మొత్తం ఆర్టీసీ బస్సుల్లో 6,700 బస్సుల్లో (74ు) మహిళల ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పిస్తున్నాం. దీనివల్ల ప్రభుత్వానికి నెలకు రూ.162 కోట్లు, ఏడాదికి రూ.1,942 కోట్లు ఖర్చవుతుంది.


రాష్ట్రంలో రోజుకు సుమారు 26.95 లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరనుంది. ఏడాదికి 142 లక్షల మంది మహిళలు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకుంటారని అంచనా. బస్సుల డిమాండ్‌కు తగినట్లుగా ఈ ఏడాది అదనంగా 3 వేల ఎలక్ర్టిక్‌ బస్సులను కొనుగోలు చేస్తాం. వచ్చే రెండేళ్లలో మరో 1,400 ఎలక్ర్టిక్‌ బస్సులు ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది’ అని వెల్లడించారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని, చేనేత కార్మికులకు ప్రభుత్వం ప్రకటించిన పలు రాయితీలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. చేతి మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, పవర్‌లూమ్‌ మగ్గాలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందించాలని నిర్ణయించింది. చేనేత ఉత్పత్తులపై విధించిన 5 శాతం జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. చేనేత సహకార సంఘాలకు రూ.5కోట్లతో త్రిఫ్ట్‌ ఫండ్‌ ఏర్పాటుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. నాయీ బ్రాహ్మణుల అభ్యర్ధన మేరకు హెయిర్‌ కటింగ్‌ సెలూన్లకు ఉచితంగా నెలకు ఇచ్చే 150 యూనిట్ల విద్యుత్‌ను 200 యూనిట్లకు పెంచడానికి కూడా సమ్మతించింది. ప్రజాగళం మేనిఫెస్టో ప్రకారం మొత్తం 40,808 హెయిట్‌ కటింగ్‌ సెలూన్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ వర్తించనుంది. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.100 కోట్లు ప్రభుత్వం భరించనున్నది.


మరిన్ని నిర్ణయాలు..

  • 2025-26 నూతన బార్‌ పాలసీకి ఆమోదం. కనీసం నాలుగు దరఖాస్తులు వస్తేనే వేలం విధానం. బార్లకు రాత్రి 11 గంటల వరకు అనుమతి. మొత్తం 840 బార్లలో 10 శాతం కల్లుగీత కార్మికులకు 50శాతం ఫీజు రాయితీతో రిజర్వ్‌. వచ్చే నెల 1 నుంచి 2028 ఆగస్టు 31 వరకు కొత్త విధానం అమలు.

  • మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు మేరకు మద్యం పర్మిట్‌ రూములకు అనుమతి. తిరుపతి దగ్గర పర్మిట్‌ రూమ్స్‌కు 2024-26 లైసెన్సు కాలాన్ని పొడిగించడానికి ఏపీ ఎక్సైజ్‌ నిబంధనలు, లైసెన్స్‌ రూల్స్‌ సవరణకు ఆమోదం.

  • అల్లూరి జిల్లా వై రామవరం మండలాన్ని ఎగువ వై రామవరం, దిగువ రామవరం మండలాలుగా విభజించడానికి ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీ చేయడానికి అనుమతి.

  • పాఠశాలల రేషనలైజేషన్‌ ఆదేశాలకు ధ్రువీకరణ.

  • ఏపీ ల్యాండ్‌ ఇన్సెంటివ్‌ ఫర్‌ టెక్‌ హబ్‌(ఎల్‌ఐఎఫ్‌టీ) పాలసీ 4.0కి ఆమోదం.

  • పర్యాటక శాఖకు చెందిన 6 క్లస్టర్లలో 22 హోటళ్లు, రిసార్ట్స్‌ల నిర్వహణకు స్టార్‌ రేటింగ్‌ అనుభవం ఉన్న ఏజెన్సీల ఎంపికకు, ఆర్‌ఎఫ్‌పీ ప్రకటన జారీ చేయడానికి టూరిజం ఎండీకి అధికారం అప్పగింతకు ఆమోదం.


  • తిరుపతి మండలంలో 35 ఎకరాల ఏపీటీఏ భూమిని టీటీడీ భూమితో మార్పిడి చేసుకోవడానికి.. తిరుపతిలో 25 ఎకరాల టీటీడీ భూమితో ఎక్స్చేంజ్‌ డీడ్‌ను అమలు చేయడానికి, ఒబెరాయ్‌ గ్రూప్‌నకు భూకేటాయింపును రద్దు చేయడానికి ఆమోదం.

  • డిస్కంలకు ప్రభుత్వ గ్యారెంటీలు.

  • మావోయిస్టు పార్టీ, దాని అనుబంధ సంస్థలపై నిషేధం మరో ఏడాది పొడిగింపు.

  • తిరుపతి, పుట్టపర్తి, గన్నవరం, మొవ్వ, గాజువాకలోని మేజిస్ర్టేట్‌ కోర్టుల్లో ఐదు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ పోస్టులు రెగ్యులర్‌ ప్రాతిపదికన మంజూరు.

  • పరిశ్రమల అభివృద్ధికి ఏపీఐఐసీ ద్వారా రూ.7,500 కోట్ల రుణం సమీకరణ.

  • చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తమ్మిగానిపల్లెలో ఇండస్ట్రియల్‌ పార్కు ఏర్పాటు కోసం 81.227 సెంట్ల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీ చిత్తూరు జోనల్‌ మేనేజర్‌కు ఉచితంగా బదిలీ.

  • రాష్ట్రంలోని జర్నలిస్టులకు సంబంధించిన మీడియా అక్రిడిటేషన్‌ నిబంధనలు జీవో 38 రద్దు.. కొత్తగా రూపొందించిన ’కాంప్రహెన్సివ్‌ ఏపీ మీడియా అక్రిడిటేషన్‌ రూల్స్‌-2025కు ఆమోదం.

Updated Date - Aug 07 , 2025 | 05:55 AM