Share News

Tirumala: ఇక టికెట్‌ పొందినరోజే శ్రీవాణి దర్శనం

ABN , Publish Date - Jul 31 , 2025 | 06:52 AM

శ్రీవాణి టికెట్ల కేటాయింపు, దర్శన వేళల్లో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం పది గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనం శ్రీవాణి దాతలకు లభిస్తోంది.

 Tirumala: ఇక టికెట్‌ పొందినరోజే శ్రీవాణి దర్శనం

  • తిరుమలలో రేపటి నుంచే అమలు

తిరుమల, జూలై 30 (ఆంధ్రజ్యోతి): శ్రీవాణి టికెట్ల కేటాయింపు, దర్శన వేళల్లో టీటీడీ మార్పులు చేసింది. ప్రస్తుతం ఉదయం పది గంటలకు వీఐపీ బ్రేక్‌ దర్శనం శ్రీవాణి దాతలకు లభిస్తోంది. ఈ సమయాన్ని సాయంత్రం 4.30 గంటలకు మార్చారు. ప్రస్తుతం ఉన్నట్టుగానే వీరికి లఘు దర్శనం ఉంటుంది. ఆగస్టు 1 నుంచే ఈ సమయం అమల్లోకి వస్తుంది. అయితే, ఇప్పటికే అడ్వాన్స్‌ బుకింగ్‌ ద్వారా అక్టోబరు 31వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులను మాత్రం పాత సమయంలోనే ఉదయం 10 గంటలకే దర్శనానికి అనుమతిస్తారు. తిరుమలలోని గోకులం సమావేశ మందిరంలో బుధవారం శ్రీవాణి దర్శనాలపై అధికారులతో సమీక్షించిన తర్వాత టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలో శ్రీవాణి టికెట్లను ఉదయం 7 గంటలకు జారీ చేస్తున్నారు. భక్తులు ముందు రోజు రాత్రే తిరుమలకు చేరుకుని, తెల్లవారు జాము నుంచే క్యూలో ఉండాల్సివస్తోంది. పైగా వీరికి మరుసటి రోజు ఉదయం దర్శనం కేటాయిస్తున్నారు. ఇందువల్ల దాదాపుగా మూడు రోజుల పాటు తిరుమలలో శ్రీవాణి దాతలు ఉండాల్సి వస్తోంది. ఇలా కాకుండా ప్రతిరోజూ ఉదయం 10 గంటలకు శ్రీవాణి టికెట్లు కేటాయించి, అదేరోజు సాయంత్రం 4.30 గంటలకు దర్శనం కల్పిస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందనే ఆలోచనతో టీటీడీ ఈ మార్పులు చేసింది. ఈ కొత్త విధానాన్ని ప్రయోగాత్మకంగా ఆగస్టు 15 దాకా అమలు చేసి పరిశీలిస్తారు. ప్రస్తుతం కేటాయిస్తున్నట్టే తిరుమలలో ఆఫ్‌లైన్‌ ద్వారా 800 టికెట్లు, ఎయిర్‌పోర్టులో ఉదయం 7 గంటలకు 200 టికెట్లు ఇస్తారు.

గదుల సమయంలోనూ....

శ్రీవాణి టికెట్లు పొందిన భక్తులు కోరుకుంటే కేవలం రెండు మూడు గంటల పాటు మాత్రమే గదులు కేటాయించే అంశాన్ని టీటీడీ పరిశీలిస్తున్నట్టు తెలిసింది. అలాగే శ్రీవాణి టికెట్ల జారీ కేంద్రానికి సమీపంలో చిన్నపాటి గదులతో వీఐపీ లాంజ్‌ల ఏర్పాటు అంశంపై అధ్యయనం చేయాలని అధికారులకు అదనపు ఈవో వెంకయ్య చౌదరి సూచన చేసినట్టు తెలిసింది.

Updated Date - Jul 31 , 2025 | 06:52 AM