Share News

Government Ban: ఫ్రీహోల్డ్‌ భూములపై మరో 2 నెలలు నిషేధం

ABN , Publish Date - Jul 12 , 2025 | 06:40 AM

ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లకు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా అని చిన్నాచితకా రైతులు, సక్రమంగా ఫ్రీహోల్డ్‌ రిజిస్ర్టేషన్లు చేసుకున్న వారు ఎదురుచూస్తుంటే..

Government Ban:  ఫ్రీహోల్డ్‌ భూములపై మరో 2 నెలలు నిషేధం

  • పొడిగిస్తూ ప్రత్యేక సీఎస్‌ ఆదేశాలు

అమరావతి, జూలై 11(ఆంధ్రజ్యోతి): ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లకు ప్రభుత్వం ఎప్పుడెప్పుడు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తుందా అని చిన్నాచితకా రైతులు, సక్రమంగా ఫ్రీహోల్డ్‌ రిజిస్ర్టేషన్లు చేసుకున్న వారు ఎదురుచూస్తుంటే.. ప్రభుత్వం మాత్రం వాటి రిజిస్ర్టేషన్లపై నిషేధాన్ని మరో రెండు నెలలు పొడిగించింది. ఏడాది నుంచి విచారణ పేరుతో భూముల రిజిస్ర్టేషన్‌ జరక్కుండా నిషేధం విధించారు. ఇప్పుడు మళ్లీ 2 నెలలు పొడిగిస్తున్నట్లు స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, రెవెన్యూ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి శుక్రవారం ఆదేశాలు జారీచేశారు. దీనిపై రైతులు, ఇతరులు ఆందోళన వ్యక్తంచేస్తుండడంతో.. ఆగస్టు, సెప్టెంబరు నాటికి ఈ సమస్యను కొలిక్కి తెస్తామని, ఆ తర్వాత దసరా నుంచి ఫ్రీహోల్డ్‌ భూముల రిజిస్ర్టేషన్లకు అనుమతిస్తామని రెవెన్యూ శాఖ అధికారులు చెబుతున్నారు. జగన్‌ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసం, అస్మదీయులకు మేలు చేసేందుకు, సెటిల్‌మెంట్ల కోసం నిషేధిత 22ఏ జాబితాలోని భూములను యథేచ్ఛగా ఫ్రీహోల్డ్‌ చేసేసింది. ఆ గత ఏడాది ఆ ప్రభుత్వం పోయి చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది. గత సర్కారు చేసిన తప్పు సరిదిద్దే పేరిట చిన్నాచితకా రైతులను ఇబ్బందులకు గురిచేస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఫ్రీహోల్డ్‌పై ఎటూ తేల్చకుండా కాలం గడిపేస్తోంది.


పార్టీ ఏదైనా అర్హులకు న్యాయం జరగాలి: సీఎం

ఇటీవల ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష చేసి తక్షణమే దీన్ని పరిష్కరించాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఫ్రీహోల్డ్‌కు అర్హులైన వారు వైసీపీ కార్యకర్తలైనా, టీడీపీ కార్యకర్తలైనా, ఏ పార్టీ వారైనా అర్హులకు న్యాయం చేయాల్సిందేనని తేల్చిచెప్పారు. నాన్చుడు ధోరణి వద్దని, అసైనీలు భూమిపై పొజిషన్‌లో ఉన్నవి, పక్కా అసైన్‌మెంట్‌ రికార్డులు కలిగి ఉండి 20 ఏళ్లు గడువు దాటిన వాటిని రాజకీయాలతో సంబంధం లేకుండా ఫ్రీహోల్డ్‌ చేయాలని స్పష్టంచేశారు. అసైన్‌మెంట్‌ రికార్డులు లేని భూములు, కలెక్టర్‌ ఉత్తర్వులు లేనివి, జీవో 596కి విరుద్ధంగా ఉన్నవి, అధిక విస్తీర్ణం క్లెయిమ్‌ చేసేవి, అసలైన అసైనీలు భూమిపై పొజిషన్‌లో లేనివి, ఇతరులు క్లెయిమ్‌ చేసే భూములు, అభ్యంతరాలున్న పోరంబోకు భూములు, 20 ఏళ్ల గడువుదాటని అసైన్డ్‌ భూములకు ఫ్రీహోల్డ్‌ వద్దని స్పష్టంగా ఆదేశించారు.

పొడిగింపు ఆదేశాలు చూపిస్తూ దందాలు

అక్రమంగా ఫ్రీహోల్డ్‌ చేసిన భూముల వివరాలు జిల్లాల వారీగా ప్రభుత్వం వద్ద ఉన్నాయి. ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లో ఈ భూములు ఎక్కువగా ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో ఇవి చాలా చాలా తక్కువ అయినప్పటికీ.. సమస్య ఉన్న చోట, లేని చోట కూడా ఇదే నిషేధం కొనసాగిస్తుండడం చిన్న రైతులకు శాపంగా మారింది. అటు ఎప్పటికప్పుడు నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వం ఇస్తున్న ఆదేశాలను చూపిస్తూ రాజకీయ నాయకులు ఫ్రీహోల్డ్‌ భూములను తక్కువ ధరలకే తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటున్నారు. దీనిపై ఏకంగా దందాలే నడుపుతున్నారు.

Updated Date - Jul 12 , 2025 | 09:47 AM