Share News

అన్నదాతలకు స్వాంతన

ABN , Publish Date - Aug 13 , 2025 | 11:42 PM

గత వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి బొమ్మతో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది.

   అన్నదాతలకు స్వాంతన

రాజముద్రతో పాసు పుస్తకం

జిల్లాకు చేరిన 1.5 లక్షల పాసు పుస్తకాలు

కర్నూలు అగ్రికల్చర్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): గత వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి బొమ్మతో రైతులకు ఇచ్చిన పట్టాదారు పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. వాటి స్థానంలో ఎవరి బొమ్మలు లేకుండా రాజముద్రతో ఎటువంటి లోపాలు లేకుండా రైతులకు స్వాంతన చేకూర్చే విదంగా పాసు పుస్తకాలను కూటమి ప్రభుత్వం ఆగస్టు 15 నుంచి పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టింది. గత ప్రభుత్వంలో వారసత్వంగా, కష్టపడి సంపాదించి కొనుగోలు చేసిన భూములపై నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన బొమ్మతో ముద్రించిన పాసు పుస్తకాలు పంపిణీ చేశారు. దీనిపై రైతుల్లో తీవ్ర ఆందోళన మొదలైంది. గత ప్రభుత్వం చేసిన పొరపాట్లను చక్కదిద్దేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తప్పులతడకగా మారిన భూసర్వేను మళ్లీ గాడిన పెట్టేందుకు రైతుల పొలాలకు సంబంధించి సరైన హద్దులతో పాసు పుస్తకాలు పంపిణీ చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా ఆగస్టు 15 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రాజముద్రతో పాసు పుస్తకాలను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ఈ తరహా పాసు పుస్తకాలు అందించేందుకు ఆగస్టు 31 వరకు ప్రత్యేక కార్యక్రమాన్ని చేపట్టారు. కర్నూలు జిల్లాకు 1.05లక్షలు పాసు పుస్తకాలు విడుదల చేసినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఈ పాసు పుస్తకాల్లో ఇంకా ఏమైనా తప్పు ఒప్పులు ఉన్నాయేమోనని వారం రోజులుగా మండల కేంద్రాల్లోని రెవెన్యూ కార్యాలయాల్లో వీఆర్వోలు, తహసీల్దార్లు, ఆర్‌ఐలు సూక్ష్మ స్థాయిలో పరిశీలన చేస్తున్నారు. గ్రామాల వారీగా తహసీల్దార్ల ఆధ్వర్యంలో సదస్సులు ఏర్పాటు చేసి పాసు పుస్తకాలను రైతులకు పంపిణీ చేయడం చేస్తారు. ఈ కార్యక్రమాల్లో మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అందుకు అనుగుణంగా జిల్లా యంత్రాంగం చర్యలు చేపట్టింది.

Updated Date - Aug 13 , 2025 | 11:42 PM