EX Vice President Venkaiah Naidu: ఉచితాలతో వ్యవస్థ మనుగడకే ముప్పు
ABN , Publish Date - Sep 02 , 2025 | 07:17 AM
‘రాజకీయ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వమైనా ఉచితాల పంపిణీకి బటన్లు నొక్కడం సరికాదు. ఈ విధానంతో వ్యవస్థ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది’ అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
విద్య, వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలి
మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు
పెళ్లకూరు, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): ‘రాజకీయ ప్రయోజనాల కోసం ఏ ప్రభుత్వమైనా ఉచితాల పంపిణీకి బటన్లు నొక్కడం సరికాదు. ఈ విధానంతో వ్యవస్థ మనుగడకే ముప్పు ఏర్పడుతుంది’ అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తిరుపతి జిల్లా పెళ్లకూరులోని చాగణం లలితమ్మ-భాస్కర్‌రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన పలు సేవా కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ‘ప్రజలకు ఉచితంగా కావాల్సింది విద్య, వైద్యం మాత్రమే. ఈ రెండింటిని అందించగలిగితే సమాజంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు. అంతే తప్ప అప్పులు చేసి, రాష్ట్రాలను దివాళా తీయించి ఉచితాలను పంపిణీ చేయడం వల్ల ప్రజలను సోమరులుగా తయారు చేయడం తప్ప మరో ప్రయోజనం లేదు. ప్రతి ఊర్లో విద్యాలయం, దేవాలయం, గ్రంథాలయం, సేవాలయం ఉండాలి’ అని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. అనంతరం చాగణం లలితమ్మ-భాస్కర్‌రావు మెమోరియల్ ట్రస్టీ చాగణం గౌరీశంకర్-వరలక్ష్మి ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు రూ.50 లక్షల విలువ చేసే లలితమ్మ విద్యా వికాస ఉపకార వేతనాలను ఆయన పంపిణీ చేశారు.