Venkaiah Naidu: ఉచితాలు కాదు.. అభివృద్ధే ప్రధానం
ABN , Publish Date - Oct 08 , 2025 | 06:30 AM
ప్రజలకు ఉచిత పథకాలు అందించడంపై కన్నా అభివృద్ధి మీద ప్రభుత్వాలు దృష్టి సారించాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు.
ఈ దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి
క్రిమినల్ కేసులను రెండేళ్లలో విచారించాలి
సీజేఐపై దాడి యత్నం బాధాకరం : వెంకయ్య
వెంకటాచలం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రజలకు ఉచిత పథకాలు అందించడంపై కన్నా అభివృద్ధి మీద ప్రభుత్వాలు దృష్టి సారించాలని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ఉచితాలు అనుచితంగా తయారవుతున్నాయి. ఎన్నికల్లో ప్రయోజనం కోసం ఉచిత పథకాలు ప్రకటించడం అలవాటుగా మారింది. వాటి అమలుతో రాష్ర్టాల అభివృద్ధి కుంటుపడుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు తాహతుకు మించి అప్పులు చేయాల్సి వస్తోంది’’ అని అన్నారు. నెల్లూరు జిల్లా వెంకటాచలంలోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వాలు విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు.
వ్యక్తిగత దూషణ తగదు..
చట్టసభల్లో సరైనభాష మాట్లాడకుండా వ్యక్తిగత దూషణలకు పాల్పడేవారిపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని వెంకయ్యనాయుడు అభిప్రాయపడ్డారు. ‘‘స్పీకర్లు ఇలాంటి విషయాల్లో కఠినంగా వ్యవహరించాలి. అసెంబ్లీ నియమాలను గట్టిగా అమలు చేయడంతోపాటు, ప్రజాప్రతినిధులకు శిక్షణ తరగతులు నిర్వహించాలి. చట్టసభల్లో హుందాగా రాజకీయం చేయాలి’’ అని ఆయన సూచించారు. ప్రజాప్రతినిధులు ఒకవేళ పార్టీ మారాలనుకుంటే, ఆ పార్టీ ద్వారా పొందిన పదవికి ముందుగా రాజీనామా చేయాల్సి ఉంటుందన్నారు. ‘పార్టీ ఫిరాయింపులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాయి. పార్టీలు మారి మంత్రులు అవుతుండటం ప్రస్తుతం తెలంగాణలోను, గతంలో ఏపీలోను చూశాం. చట్టానికి అతీతంగా ఎవరూ వ్యవహరించకూడదు. ప్రజాప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసులను రెండేళ్లలోపే విచారించాలి. దీనికోసం ప్రభుత్వాలు కోర్టుల సంఖ్య పెంచి న్యాయమూర్తులను నియమించాలి’’ అని ఆయన సూచించారు. రాజకీయాల్లో వారసత్వాన్ని ప్రోత్సహించకూడదని, దానికి తాను వ్యతిరేకమని వెంకయ్య చెప్పారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టి్‌సపై దాడి ప్రయత్నం బాధాకరమన్న ఆయన, ఇది చీఫ్ జస్టి్‌సకు సంబంధించిన అంశమే కాదని, సమాజానికి, వ్యవస్థకుసంబంధించిన విషయం కూడా అన్నారు. ఇందుకు పాల్పడిన వ్యక్తిపై కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.