ఉచిత టికెట్ల రగడ!
ABN , Publish Date - Sep 14 , 2025 | 01:26 AM
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే వారు ఎవరైనా సరే ఖచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే. కానీ రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే సరికి మాత్రం దర్శనాలు ఉచితంగా కావాలని ప్రోటోకాల్, వీవీఐపీ, వీఐపీలు కోరుకుంటున్నారు. గతేడాది ప్రోటోకాల్, వీవీఐపీలకు జీరో ఫేర్ టికెట్లను దేవస్థానం జారీ చేసింది. దీని వల్ల దేవస్థానం రూ.2 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. ఈ దసరా ఉత్సవాలలో కూడా ఉచిత టికెట్లను ఇవ్వాలని పలుశాఖలు దేవస్థానానికి సూచిస్తున్నాయి. సమన్వయ కమిటీ సమావేశంలో భక్తుల ఇబ్బందులు, సౌకర్యాలపై ఆయా శాఖలు దృష్టి సారించి దేవస్థానానికి సలహాలు ఇవ్వాలి కానీ, టికెట్ల వంటి దేవస్థాన ఆంతరంగిక విషయాలను కూడా సమన్వయ శాఖలు ప్రభావితం చేసేలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి.
- గతేడాది దసరా ఉత్సవాల్లో ప్రొటోకాల్, వీవీఐపీ, వీఐపీలకు పంపిణీ
- నిర్దేశించిన సమయానికి రాకుండా ఇష్టారాజ్యంగా దర్శనాలు
- మళ్లీ ఈ ఏడాది ఉచిత టికెట్లు కావాలని సమన్వయశాఖల సూచన
- ఇప్పటికే వీఐపీల కోసం రూ. 500 టికెట్లు రద్దు
- తిరుమలను చూసైనా నేర్చుకోవడంలేదని పలువురి విమర్శ
- నేడు మంత్రి సమక్షంలో సమన్వయశాఖల సమావేశం
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే వారు ఎవరైనా సరే ఖచ్చితంగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే. కానీ రాష్ట్రంలోనే రెండో అతిపెద్దదైన కనకదుర్గమ్మ ఆలయానికి వచ్చే సరికి మాత్రం దర్శనాలు ఉచితంగా కావాలని ప్రోటోకాల్, వీవీఐపీ, వీఐపీలు కోరుకుంటున్నారు. గతేడాది ప్రోటోకాల్, వీవీఐపీలకు జీరో ఫేర్ టికెట్లను దేవస్థానం జారీ చేసింది. దీని వల్ల దేవస్థానం రూ.2 కోట్ల మేర ఆదాయాన్ని కోల్పోయింది. ఈ దసరా ఉత్సవాలలో కూడా ఉచిత టికెట్లను ఇవ్వాలని పలుశాఖలు దేవస్థానానికి సూచిస్తున్నాయి. సమన్వయ కమిటీ సమావేశంలో భక్తుల ఇబ్బందులు, సౌకర్యాలపై ఆయా శాఖలు దృష్టి సారించి దేవస్థానానికి సలహాలు ఇవ్వాలి కానీ, టికెట్ల వంటి దేవస్థాన ఆంతరంగిక విషయాలను కూడా సమన్వయ శాఖలు ప్రభావితం చేసేలా వ్యవహరించడంపై విమర్శలు వస్తున్నాయి. గత దసరా ఉత్సవాల్లో వీఐపీ దర్శనాల ప్రభావంతో రూ.500 టికెట్ కొనుక్కుని క్యూలో వెళ్లిన వారికి చుక్కలు కనిపించాయి. వీఐపీ దర్శనాలను క్రమబద్ధీకరించాలని ఒక నిర్ణీత సమయంలో పంపాలని భావించి.. సమన్వయ శాఖలకు, వారు చెప్పిన వారికి ఉచితంగా టికెట్లను ఇచ్చారు. అయితే వీఐపీలు వారికి నిర్ణయించిన సమయాలలో రాలేదు. దీంతో వీఐపీలను క్రమబద్ధీకరించే విధానమన్నది విఫలమైంది. వీఐపీ దర్శనాలు, అనధికారిక వీఐపీ దర్శనాలను నియంత్రించలేకపోయారు. ఇప్పుడైనా వాటిని కట్టడి చేసే అంశంపై దృష్టి సారించకుండా ఈ ఏడాది ఏకంగా రూ.500 టికెట్లు రద్దు చేశారు. ఈ కారణంగా దేవస్థానానికి మరో రూ.2 కోట్ల మేర ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. వీఐపీలను క్రమబద్ధీకరించటం చేతకాక రూ.500 టికెట్లు కొనుగోలు చేసే భక్తులను నియంత్రిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. సమన్వయ శాఖలు సమస్యలను పరిష్కరిస్తున్నాయా లేక సమస్యలను సృష్టిస్తున్నాయో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది.
ఇష్టారాజ్యంగా పైరవీలు!
దసరా ఉత్సవాలలో వీఐపీ అనే అర్థమే మారిపోతుంది. గుడికి వచ్చేవాళ్లంతా వీఐపీలే. ఎవరికి వారు వీఐపీ దర్శనాలకు ఎగబడుతుంటారు. పైరవీలు చేస్తారు. రాజకీయ ఒత్తిళ్లు తీసుకువస్తారు. రాజకీయ నాయకులు కూడా ఇష్టానుసారంగా తమ అనుచరులను కొండమీదకు పంపుతారు. సమన్వయ శాఖలన్నీ తమ కుటుంబాలనే కాకుండా బంధువర్గాలకు వీఐపీల పేరుతో దర్శనాలు చేయిస్తుంటాయి. ప్రోటోకాల్‌లో కూడా ఇష్టానుసారం దర్శనాలు జరుగుతున్నాయి. వీఐపీ సంగతి చెప్పనక్కర లేదు. ఈ రెండింటికీ ధరతో కూడిన టికెట్లను తప్పనిసరి చేస్తేనే అనధికారిక దర్శనాలను నియంత్రించటం సాధ్యమవుతుంది. తిరుపతిలో అనుసరిస్తున్న విధానాన్ని విజయవాడలో అమలు చేయటం ద్వారా భక్తులందరికీ న్యాయం జరుగుతుందని పలువురు పేర్కొంటున్నారు.