Share News

పత్రాలు లేని భూములకు ఉచిత రిజిసే్ట్రషన్‌!

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:56 AM

ఎటువంటి పత్రాలు లేకుండా సాగు చేసుకుంటున్న చిన్న, సన్నకారు రైతుల భూముల ఉచిత రిజిసే్ట్రషన్‌కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. 2024 జూన్‌ 15వ తేదీకి ముందు తమ అవసరాలకు క్రయ, విక్రయ జరుపుకున్న వారికి వర్తింపజేయనుంది. ఉచితంగా రిజిసే్ట్రషన్‌లు చేసుకునేందుకు 2027 డిసెంబరు 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాలను తెలియజేస్తూ ఈ నెల 4న జీవో 467ను జారీ చేసింది. వివిధ రకాల భూములకు ఇది వర్తించదని స్పష్టం చేసింది.

పత్రాలు లేని భూములకు ఉచిత రిజిసే్ట్రషన్‌!

-సాదా బైనామాతో చిన్న రైతులకు మేలు

- జిల్లాలో పత్రాలు లేని భూములు 20 వేల ఎకరాలు!

- 2024 జూన్‌ 15 నాటి వరకు క్రయ, విక్రయాలు రాసుకున్న వారికి అవకాశం

- 2027 డిసెంబరు 31 వరకు భూముల రిజిస్ర్టేషన్‌కు గడువు

- ఈ నెల 4న జీవో 467ను జారీ చేసిన ప్రభుత్వం

- పలు రకాల భూములకు వర్తించదని ఉత్తర్వుల్లో స్పష్టం

ఎటువంటి పత్రాలు లేకుండా సాగు చేసుకుంటున్న చిన్న, సన్నకారు రైతుల భూముల ఉచిత రిజిసే్ట్రషన్‌కు అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం సరికొత్త నిర్ణయం తీసుకుంది. 2024 జూన్‌ 15వ తేదీకి ముందు తమ అవసరాలకు క్రయ, విక్రయ జరుపుకున్న వారికి వర్తింపజేయనుంది. ఉచితంగా రిజిసే్ట్రషన్‌లు చేసుకునేందుకు 2027 డిసెంబరు 31వ తేదీ వరకు అవకాశం ఇచ్చింది. దీనికి సంబంధించిన విధి విధానాలను తెలియజేస్తూ ఈ నెల 4న జీవో 467ను జారీ చేసింది. వివిధ రకాల భూములకు ఇది వర్తించదని స్పష్టం చేసింది.

ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం:

సాగు చేసుకుంటున్న భూమికి సరైన పత్రాలు లేకపోయినా వ్యక్తిగత, ఇంటి అవసరాల నిమిత్తం ఇతరులకు అమ్ముకునేందుకు సాదా బైనామా (భూమికి సరైన పత్రాలు, రిజిసే్ట్రషన్‌ లేకుండా, సాధారణ స్టాంప్‌ పేపర్‌పై రాసి సంతకాలు చేసిన అమ్మకపు ఒప్పంద పత్రం) పేరుతో ప్రభుత్వం తాజాగా అవకాశం కల్పించింది. తెల్లకాగితాలపై రైతులు ఒప్పంద పత్రాలు రాసుకుని రిజిస్ర్టేషన్‌ కాని భూములకు రిజిస్ర్టేషన్‌ చేసి, భూములు కొనుగోలు చేసిన రైతుల పేరున పట్టాదారు పాస్‌పుస్తకాలతో పాటు భూమిపై సర్వహక్కులు కల్పించేందుకు చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించి ఈ నెల 4వ తేదీన జీవో 467 నెంబర్‌తో ఉత్తర్వులను జారీ చేసింది. 2027 డిసెంబరు 31వ తేదీ వరకు ఈ తరహా భూముల క్రయ, విక్రయాలకు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం జారీ చేసిన ఈ ఉత్తర్వులతో భూమి పత్రాలు సక్రమంగా లేని చిన్నపాటి రైతులు తమ భూములను విక్రయించుకునేందుకు అవకాశం ఏర్పడనుంది.

గతంలో అనేక ఇబ్బందులు

భూములను రైతులు వాస్తవంగా సాగు చేసుకుంటూ, పిల్లల చదువులు, వివాహాలు, అనారోగ్య సమస్యలు, వివిధ అవసరాల కోసం వాడుకునేందుకు భూములను సకాలంలో విక్రయించుకోలేని పరిస్థితి నెలకొంది. భూములు విక్రయించేందుకు పత్రాలు సక్రమంగా లేని కారణంగా రిజిస్ర్టేషన్‌ చేసేందుకు అవకాశం లేకుండా పోయింది. భూమి విక్రయించే రైతులు, కొనుగోలు చేసే రైతులు తెల్లకాగితంపై పెద్దల సమక్షంలో ఒప్పంద పత్రాలు రాసుకుని భూమిని విక్రయించేందుకు ప్రయత్నాలు చేస్తే రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో అడ్డంకులు ఏర్పడుతున్నాయి. అధికంగా చిన్నపాటి రైతుల విషయంలోనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో ఈ తరహా రైతుల ఇబ్బందులను తొలగించేందుకు ప్రభుత్వం సాదా బైనామా పద్ధతిని అందుబాటులోకి తెచ్చింది.

నిబంధనలు ఇలా..

సరైన భూమి పత్రాలు లేకుండానే క్రయ, విక్రయాలకు సంబంధించి తెల్లకాగితాలపై ఒప్పంద పత్రాలు రాసుకున్న భూములు జిల్లాలోని 25 మండలాల్లో సుమారుగా 20 వేల ఎకరాల వరకు ఉంటాయని రెవె న్యూ అధికారుల అంచనాగా ఉంది.

- ఈ తరహాలో ఉన్న భూములను కొనుగోలు, విక్రయాలు చేసే సమయంలో మాగాణి భూములయితే 2.50 ఎకరాలు, మెట్ట భూములైతే ఐదు ఎకరాల వరకు రిజిస్ర్టేషన్‌ చేసేందుకు అనుమతులు ఇచ్చారు. 10 ఎకరాలు భూమి ఉన్న రైతులు ఈ తరహా భూములను కొనుగోలు చేస్తే మాగాణి భూమి 1.25 ఎకరాలు, మెట్ట భూమి అయితే 2.50 ఎకరాల వరకు రూపాయి ఖర్చులేకుండా రిజిస్ర్టేషన్‌ చేసేందుకు అవకాశం ఉంది.

- భూములకు సంబంధించి 2024 జూన్‌ 15వతేదీకి ముందు తెల్లకాగితంపై ఒప్పందం చేసుకున్న పత్రాలతో పాటు రోమన్‌ అంకె 10తో ఉన్న దరఖాస్తును జతచేసి గ్రామ సచివాయాల్లో లేదా మీసేవా కేంద్రాల్లో భూమి విక్రయానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తులను ఆయా మండలాల తహసీల్దార్‌లు పరిశీలించి భూమిని సర్వే చేస్తారు. భూమి సరిహద్దుదారుల నుంచి వివరాలు, సంతకాలు సేకరిస్తారు. భూమి విక్రయించేందుకు ఒప్పందం చేసుకున్న వ్యక్తి మరణిస్తే, గ్రామ పెద్దల సంతకాలు తీసుకుంటారు. గతంలో రైతులు భూమి పేరున విత్తనాలు, ఎరువుల కొనుగోలు, పంట నష్టపరిహారం తీసుకోవడం, ఈ-క్రాప్‌లో నమోదు, ధాన్యం విక్రయాలు, కౌలురైతుల కార్డులు, నీటి తీరువా చెల్లించి ఉంటే సంబంధిత అన్ని పత్రాలను సేకరించి, అవన్నీ సక్రమంగా ఉన్నాయంటూ ధ్రువీకరించి మండల మేజిస్ర్టేట్‌ హోదాలో తహసీల్దార్‌లు ప్రత్యేక నివేదిక తయారు చేసి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయానికి పంపుతారు.

- తహసీల్దార్‌లు పంపిన నివేదికలను ఆఽధారంగా చేసుకుని సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో భూమి కొనుగోలు చేసిన రైతుల పేరున వెబ్‌ల్యాండ్‌, అడంగల్‌లో నమోదు చేస్తారు. ఈ వివరాలు మళ్లీ తహసీల్దార్‌ కార్యాలయానికి చేరతాయి. తుది విడతగా తహసీల్దార్‌లు ఈ వివరాలను పరిశీలించి అభ్యంతరాలు ఏమీ లేవని నిర్ధారించుకున్న తర్వాత భూమి రిజిస్ర్టేషన్‌ చేయవచ్చని అనుమతులు ఇస్తారు. ఈ ప్రక్రియతో భూమి కొనుగోలు చేసిన రైతుల పేరున ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ర్టేషన్‌ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఈ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు రెవెన్యూ అధికారులు గ్రామ సభలు నిర్వహించాలని కూడా ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ విధానంతో చిన్న రైతులకు మేలు జరిగే అవకాశం ఉంది.

ఈ భూములకు వర్తించదు

ఎలాంటి పత్రాలు, ఆధారాలు లేని భూములను రిజిస్ర్టేషన్‌ చేసేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను విధించింది. మునిసిపల్‌ కార్పొరేషన్‌లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలు, మండల కేంద్రాలకు సమీపంలో ఉన్న భూములతోపాటు అసైన్డ్‌ భూములు, గ్రామ కంఠం భూములకు కూడా ఈ వెసులబాటు వర్తించదని తేల్చి చెప్పింది. కేవలం గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్న భూములకే వర్తిస్తుందని స్పష్టం చేసింది.

Updated Date - Dec 23 , 2025 | 12:56 AM