Health Services: మహిళలకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
ABN , Publish Date - Nov 08 , 2025 | 05:33 AM
ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ల వద్దకే వచ్చి ఉచితంగా నిర్వహించే క్యాన్సర్ స్ర్కీనింగ్ టెస్ట్‌లను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్...
సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్యశాఖ పిలుపు
అమరావతి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ఇళ్ల వద్దకే వచ్చి ఉచితంగా నిర్వహించే క్యాన్సర్ స్ర్కీనింగ్ టెస్ట్‌లను మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ జి.వీరపాండియన్ పిలుపునిచ్చారు. జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం సందర్భంగా క్యాన్సర్ పరీక్షకు ఆహ్వానం పేరుతో రూపొందించిన కార్డులను కలెక్టర్ లక్ష్మీశతో కలిసి విజయవాడలో ఆయన ఆవిష్కరించడంతో పాటు క్యాన్సర్ స్ర్కీనింగ్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆరోగ్యశాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి 18ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ అసంక్రమిత వ్యాధులైన రక్తపోటు, మధుమేహం పరీక్షల్ని ఉచితంగా చేస్తారన్నారు. 30 ఏళ్లు దాటిన మహిళల ఇళ్లకు ఏఎన్‌ఎం, సీహెచ్‌వోలు వెళ్లి..స్ర్కీనింగ్ చేసుకోవాలని ఆహ్వానిస్తూ ఇన్విటేషన్ కార్డును అందజేస్తారని పేర్కొన్నారు. ఆ ప్రాంతంలోనే స్ర్కీనింగ్ పరీక్షలకు ఎప్పుడు రావాలో కార్డుపై రాసి ఇస్తారన్నారు. మహిళలకు రొమ్ము, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ పరీక్షలపై అవగాహన కల్పించి, సమీప వైద్యాధికారికి సమాచారం అందిస్తారని తెలిపారు.