APSRTC: ఆర్టీసీ గేర్ మారింది
ABN , Publish Date - Nov 14 , 2025 | 05:41 AM
ప్రైవేటు రవాణా వాహనాలతో పోటీపడలేక ఇబ్బంది పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీకి ‘స్త్రీ శక్తి’ పథకం నూతనోత్తేజాన్ని ఇచ్చింది.
మహిళలకు ఉచిత ప్రయాణంతో ఆర్టీసీకి కళ
66 శాతం నుంచి 88 శాతానికి ఆక్యుపెన్సీ
పదిన్నర లక్షల వరకు పెరిగిన ప్రయాణికులు
రద్దీతో బస్సులు, బస్టాండ్లు నిత్యం కిటకిట
‘స్త్రీ శక్తి’కి 400 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం
ఆగస్టు నుంచి అక్టోబరు వరకు రీయింబర్స్‌మెంట్
హర్షం వ్యక్తం చేసిన యూనియన్లు
ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణ పథకం మహిళల ప్రయాణ ఖర్చులను గణనీయంగా తగ్గిస్తోంది. విద్యార్థినులతో పాటు ఉద్యోగ, ఉపాధికి రాకపోకలు సాగించేవారికి ‘స్త్రీ శక్తి’ పథకం ఎంతగానో ఉపయోగ పడుతోంది. మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి దోహదపడుతోంది. అంతేకాదు.. ఆర్టీసీకి ప్రయాణికుల కళ తెచ్చింది. ఎక్కడ చూసినా బస్టాండ్లు, బస్సులు మహిళలతో కిటకిటలాడుతున్నాయి.
అమరావతి, నవంబరు 13(ఆంధ్రజ్యోతి): ప్రైవేటు రవాణా వాహనాలతో పోటీపడలేక ఇబ్బంది పడుతున్న ఏపీఎస్ ఆర్టీసీకి ‘స్త్రీ శక్తి’ పథకం నూతనోత్తేజాన్ని ఇచ్చింది. సంస్థ రికార్డుల ప్రకారం ప్రయాణికుల సంఖ్యలో వృద్ధి భారీగా నమోదైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణాన్ని అమలు చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ మూడు నెలల క్రితం విజయవాడలో ప్రారంభించిన ‘స్త్రీ శక్తి’ పథకం ప్రజా రవాణా సంస్థకు కళ పెంచింది. అంతేకాకుండా కూటమి ప్రభుత్వ నిర్ణయం రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలకు ప్రయాణాల్లో ఆర్థిక భారం పూర్తిగా లేకుండా చేసింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. 66 శాతం నుంచి 88 శాతానికి ఆక్యుపెన్సీ పెరిగింది. 2024 సెప్టెంబరులో రోజువారీ ప్రయాణికుల సగటు 35.70 లక్షలు ఉండగా, ఈ ఏడాది సెప్టెంబరులో ఆ సంఖ్య 46.24 లక్షలకు చేరుకుంది. దీంతో అదనంగా 10.54 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించినట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఈ పెరుగుదలకు మహిళా ప్రయాణికులే కారణమని ఆర్టీసీ ఉన్నతాధికారులు చెబుతున్నారు.
గ్రామీణ ప్రాంత బస్సులు కిటకిట
ఉచిత ప్రయాణ పథకం గ్రామీణ ప్రాంత బస్సుల్లో దాదాపుగా నూరు శాతం ఆక్యుపెన్సీ వచ్చేలా చేసింది. గతంలో 55 నుంచి 62 శాతం మధ్య కొనసాగిన ఆక్యుపెన్సీ రేటు గ్రామీణ బస్సు సర్వీసులకు ఇప్పుడు 95 నుంచి 100 శాతం వరకు ఉంటోంది. పల్లెల నుంచి పట్టణ ప్రాంతాలకు మహిళా ప్రయాణికులు పెద్ద సంఖ్యలో వచ్చి వెళుతున్నారు. నగరాలలో ఉపాధి, ఉద్యోగం కోసం వెళ్లే మహిళలు ఎక్కువగా ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఈ బస్సులు పట్టణాలు, నగరాలకు అత్యంత రద్దీగా రాకపోకలు సాగిస్తున్నాయి.
బ్రేక్ జర్నీతో దూర ప్రాంతాలకు..
మహిళల ఉచిత ప్రయాణం పథకంలో భాగంగా సరికొత్త కోణం ఆవిష్కృతం అవుతోంది. దూరప్రాంతాలకు నడిచే ఏసీ, సూపర్ లగ్జరీ తదితర బస్సుల్లో ఉచిత ప్రయాణం లేకపోవటంతో మహిళలు బ్రేక్ జర్నీని ఆశ్రయిస్తున్నారు. విజయవాడ నుంచి విశాఖపట్నం, తిరుపతి వంటి సుదూర ప్రాంతాలకు వెళ్లే మహిళలు మధ్యలో బస్సులు మారుతూ వెళుతున్నారు.
ఏసీ బస్సులు, సూపర్ లగ్జరీ బస్సులు నేరుగా విశాఖపట్నం వెళ్తాయి. వీటిలో డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది గనుక మహిళలు ఎక్స్‌ప్రెస్ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. కిటకిటలాడుతూ ఉండాల్సిన హయ్యండ్ బస్సుల్లో ఇటీవల ఆక్యుపెన్సీ తగ్గిపోతుండటాన్ని మొదట్లో ఆర్టీసీ అధికారులు పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఆరా తీయగా.. ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో బ్రేక్ జర్నీ చేస్తూ మహిళలు ప్రయాణిస్తున్నట్లు తెలుసుకున్నారు.
భారం ఎక్కువై బస్సులు బ్రేక్ డౌన్
గ్రామీణప్రాంతాల సర్వీసులన్నీ ప్రతి ట్రిప్పులోనూ ఫుల్ అవుతున్నాయి. ఉదయం, సాయంత్రం వేళల్లో కిక్కిరిసి పోతున్నాయి. దీంతో ముందుకు కదల్లేక తరచూ బస్సులు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. బస్సులో 55 సీట్ల కెపాసిటీ ఉంటే 100 మందికి పైగా ఒక్కోసారి బస్సులోకి ఎక్కుతున్నారు. ఆర్టీసీలో గ్రామీణ సర్వీసులన్నీ దాదాపు కాలం చెల్లినవే. మరోవైపు మైలేజీ కూడా రావట్లేదని, టైర్లు కూడా అరిగి పోతున్నాయని సిబ్బంది చెబుతున్నారు. అద్దె బస్సుల యజమానులు సైతం రద్దీ పెరగడంతో మైలేజీ పడిపోయి నిర్వహణభారం అవుతోందని యాజమాన్యం దృష్టికి తీసుకొచ్చారు.తమకు అద్దెపెంచాలని లేదంటే బస్సులు వెనక్కి తీసుకుంటామని అంటున్నారు.
స్త్రీ శక్తికి నిధుల విడుదల భేష్
నేషనల్ మజ్దూర్, ఎంప్లాయీస్ యూనియన్ల కృతజ్ఞతలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన స్ర్తీశక్తి పథకానికి ప్రభుత్వం రూ. 400 కోట్లు విడుదల చేయటంపై యూనియన్లు హర్షం వ్యక్తం చేశాయి. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.వి.రమణారెడ్డి, వై.శ్రీనివాసరావు, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.దామోదరరావు, జి.వి.నరసయ్య గురువారం ఒక ప్రకటనలో సంతోషం వెలిబుచ్చారు. ఆగస్టు 15 నుంచి అక్టోబరు 31వ తేదీ వరకు 75 రోజులకు రూ. 400 కోట్లు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావులకు యూనియన్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు. స్ర్తీ శక్తి పథకానికి నిధుల విడుదల ఆర్టీసీ ఎండీ ద్వారా పలుమార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు అందచేసినట్టు ఈయూ నేతలు తెలిపారు. స్ర్తీశక్తి పథకం విజయవంతంగా నడవాలంటే 3 వేల బస్సులు కొనుగోలు చేసి, 10 వేల ఖాళీలు భర్తీ చేయాలని కోరారు.
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి 400 కోట్లు
మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీకి భారీ ఊరట లభించింది. స్త్రీ శక్తి పథకం కోసం ప్రభుత్వం రూ. 400 కోట్లు మంజూరు చేసింది. పథకం ప్రారంభమైన ఆగస్టు నుంచి అక్టోబరు వరకు రీయింబర్స్‌మెంట్ కోసం ఈ నిధుల విడుదలకు పాలన అనుమతులు ఇచ్చింది. దీంతో మహిళల ఉచిత ప్రయాణ పథకానికి ఖర్చయిన మొత్తం ప్రభుత్వం చెల్లించింది. దీనికి సంబంధించి ఆర్టీసీ ఎండీ తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ పథకం ప్రారంభమైనప్పటి నుంచి మహిళల ప్రయాణ భారం తగ్గిందని, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళల ప్రయాణం పెరిగిందని ఈ సందర్భంగా పేర్కొంది.