Share News

ఉచిత బస్సు ప్రయాణానికి విశేష ఆదరణ

ABN , Publish Date - Aug 17 , 2025 | 11:47 PM

ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి విశేష ఆదరణ లభిస్తోందని జమ్మలమడుగు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి.

ఉచిత బస్సు ప్రయాణానికి  విశేష ఆదరణ
ఉచిత బస్సులో ఆధార్‌కార్డును పరిశీలిస్తున్న కండెక్టర్‌

34.68 శాతం మహిళలు ప్రయాణించారు ఫ ఆర్టీసీ డీఎం వెల్లడి

పాత ఆధార్‌కార్డులు అప్‌డేట్‌ చేసుకోవాలి ఫ జిరాక్స్‌లు చెల్లవు

జమ్మలమడుగు, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యానికి విశేష ఆదరణ లభిస్తోందని జమ్మలమడుగు ఆర్టీసీ వర్గాలు వెల్లడించాయి. జమ్మలమడుగు నుంచి, మైలవరం మండలంలోని ఆర్టీసీ బస్సు సర్వీసు ఉన్న గ్రామాల నుంచి మహిళలు ఆదివారం ఉదయం నుంచి కొంత శాతం పెరిగారు. జమ్మలమడుగు-ముద్దనూరు రోడ్డు మార్గంలో కూడా ఎక్కువగా మహిళలు ప్రయాణించారు. జమ్మలమడుగు మండలంలోని గూడెం చెరువు, ముద్దనూరు, కొండాపురం, ఎర్రగుంట్ల ప్రాంతాలకు ప్రయాణించడంతో దాదాపు ఒక్కొక్కరు రూ.100 నుంచి రూ.120 తమకు ఆదా జరిగిందని మహిళలు తెలిపారు. అయితే జమ్మలమడుగు నుంచి తాడిపత్రి, ఆళ్లగడ్డ, కోవెలకుంట్ల ప్రాంతాలకు సైతం మహిళలే అధికంగా ఉన్నట్లు ఆర్టీసీ వారు పేర్కొంటున్నారు. ఏది ఏమైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే మహిళలు ఆధార్‌ కార్డు, రేషన్‌కార్డు, ఓటరు ఐడీ కానీ తెచ్చుకోవాలని కండక్టర్లు కోరుతున్నారు.

నాన్‌స్టాప్‌ సర్వీసుల్లో స్త్రీశక్తికి అనుమతి ఇవ్వాలి

జమ్మలమడుగు-ప్రొద్దుటూరు నాన్‌స్టాప్‌ సర్వీసుల్లో మహిళలకు స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని మహిళలు విజ్ఞప్తి చేస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి ప్రతి ఏ చిన్న పని పడినా ఎక్కువ మంది ప్రొద్దుటూరుకు వెళ్లాల్సి వస్తోందని అందువల్ల ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆర్టీసీ డీఎం ఏమన్నారంటే: ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యంపై జమ్మలమడుగు ఆర్టీసీ డీఎం ప్రవీణ్‌ ‘ఆంధ్రజ్యోతి’తో మాట్లాడుతూ రెండు రోజుల్లో 34.68 శాతం మహిళలు ఉచిత బస్సు ప్రయాణం చేశారన్నారు. సోమవారం నుంచి ఇంకా రద్దీ పెరిగే అవకాశం ఉందన్నారు. జమ్మలమడుగు- ప్రొద్దుటూరు మధ్య నడిచే నానస్టాప్‌ సర్వీసు ల్లో ఉచిత ప్రయాణం విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు.

Updated Date - Aug 17 , 2025 | 11:47 PM