Free Bus Travel for Women: నేటి నుంచే ఉచిత ప్రయాణం
ABN , Publish Date - Aug 15 , 2025 | 05:05 AM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(స్ర్తీ శక్తి) హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది...
బెజవాడలో ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
బస్సుల్లో ఆధార్, రేషన్, ఓటర్ కార్డుల్లో ఏదొకటి చూపిస్తే ‘జీరో ఫేర్’ టికెట్
2.62 కోట్ల మంది మహిళలకు ప్రతి నెలా రూ.3 వేల వరకూ ఆదా
తల్లికి వందనం, దీపం-2 తర్వాతమహిళలకు మూడో పథకం అమలు
అమరావతి/విజయవాడ (బస్‌స్టేషన్), ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం(స్ర్తీ శక్తి) హామీ అమలుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. శుక్రవారం విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 2.62 కోట్ల మంది మహిళలకు స్త్రీ శక్తి వర్తిస్తుందని, ప్రతి నెలా రూ.వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకూ మహిళలకు ఆదా అవుతుందని ప్రభుత్వ అంచనా. ఈ పథకం కోసం ఏడాదికి రూ.1,942 కోట్ల భారాన్ని ప్రభుత్వమే భరించనుంది. ఆర్టీసీలోని మొత్తం బస్సుల్లో 8,458 బస్సుల్లో (74 శాతం) మహిళలు, యువతులు, థర్డ్ జెండర్లు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఈ మేరకు ఇటీవలే ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో.. ఆధార్, రేషన్ కార్డు, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి చూపించి కండక్టర్ జారీ చేసే జీరో ఫేర్ టికెట్‌తో ప్రయాణించవచ్చు. స్త్రీ శక్తి పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ఏపీఎ్‌సఆర్టీసీ యాజమాన్యం కసరత్తు పూర్తిచేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బస్సులతో మొదలు పెట్టి, అవసరం మేరకు భవిష్యత్తులో కొత్త బస్సులు సమకూర్చుకోనున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. డ్రైవర్ల కొరత ఉండటంతో ఆన్‌కాల్ డ్రైవర్లను నియమించుకుని ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్త పడ్డారు. నాన్‌స్టాప్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సులు, ఘాట్ రోడ్లలో తిరిగే బస్ సర్వీసుల్లో ఉచిత ప్రయాణం వర్తించదని అధికారులు తెలిపారు.
సూపర్ సిక్స్‌లో మరో అడుగు..
ఎన్నికల హామీల్లో భాగంగా ఇప్పటికే కూటమి ప్రభుత్వం వృద్ధులు-వికలాంగులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, రైతులకు అన్నదాత సుఖీభవ, నిరుద్యోగులకు మెగా డీఎస్సీ విడుదల చేసింది. విద్యార్థుల తల్లులకు తల్లికి వందనం, దీపం-2లో భాగంగా ఉచిత గ్యాస్ సిలిండర్లు అమలు చేసింది. తాజాగా స్త్రీ శక్తి పథకాన్ని అమల్లోకి తెచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించబోతోంది.
ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు: ఆర్టీసీ ఎండీ
స్ర్తీ శక్తి పథకంపై ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు గురువారం తన చాంబర్ నుంచి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి అధికారి ఆయా జిల్లాల కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్లాలని సూచించారు. మహిళా ప్రయాణికుల పట్ల సంస్ధ ఉద్యోగులు మర్యాదపూర్వకంగా నడుచుకోవాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు స్ర్తీశక్తి పథకాన్ని ప్రారంభించిన తర్వాత మహిళలకు జీరో టికెట్ల జారీ కొనసాగుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కడా ఏవిధమైన ఫిర్యాదులు రాకూడదని స్పష్టం చేశారు. సిబ్బందితో సమావేశాలు నిర్వహించి, జాగ్రత్తగా విధులు నిర్వహించేలా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్యారేజీ సిబ్బంది, ట్రాఫిక్ సిబ్బంది క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ ఏ ఆటంకం లేకుండా చూడాలన్నారు. ఈ పథకం వలన ప్రభుత్వానికి, ఆర్టీసీకి మంచి పేరు వచ్చేలా అందరూ కృషి చేయాలని కోరారు.