APSRTC: తిరుమల కొండకూ ఉచిత బస్సు
ABN , Publish Date - Aug 20 , 2025 | 05:02 AM
తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు.
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడి
ఉచిత ప్రయాణానికి స్మార్ట్ కార్డులు మహిళలకు త్వరలో అందజేస్తాం
ఆధార్ జిరాక్స్‌కూ ఓకే: ఆర్టీసీ ఎండీ
తిరుమల కొండపైకి వెళ్లే మహిళా భక్తులకు ఉచిత బస్సు పథకం వర్తిస్తుందని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు తెలిపారు. ఘాట్‌రోడ్డు అయినందున ఆ బస్సుల్లో సిటింగ్ వరకే అనుమతి ఉంటుందని చెప్పారు. అయితే ఎలక్ట్రిక్ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉండదని కొనకళ్ల పేర్కొన్నారు.
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే మహిళలకు స్మార్ట్ కార్డులను అందజేస్తామని ఆ సంస్థ ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. మంగళవారం శ్రీసత్యసాయి జిల్లా మడకశిరకులో ఆయన మాట్లాడుతూ ఉచిత ప్రయాణానికి ఆధార్ జిరాక్స్ కాపీలను కూడా అనుమతించాలని ఆదేశించామన్నారు. ఈ పథకం ద్వారా రోజుకు 25నుంచి 26లక్షల మంది ప్రయాణం చేస్తారని అంచనా వేశామని, అయితే, పథకం ప్రారంభమయ్యాక తొలి ఐదు రోజుల్లో రోజుకు సగటున 18 లక్షల మంది ప్రయాణించారని తెలిపారు. విద్యార్థుల బస్సుల్లో ‘స్ర్తీ శక్తి’ వర్తించదన్నారు. ఈ పథకం కొన్ని డిపోల్లో 100 శాతం, తుని డిపోలో 106 శాతం నమోదైందని తెలిపారు. ఈ పథకం అమలు తీరుపై మహిళలు సంతృప్తిగా ఉన్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఆర్టీసీకి 1,150 కొత్త బస్సులు రాబోతున్నాయని, అందుకు ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చాయని చెప్పారు.