Vijayawada: 23 రోజులు.. 2 పెళ్లిళ్లు
ABN , Publish Date - Jul 16 , 2025 | 06:08 AM
ఏడడుగులు, మూడు ముళ్లు.. ఇది పెళ్లి సంప్రదాయం! 23 రోజులు, ఆరు ముడులు, 14 అడుగులు.. ఇది ‘ఆమె’ సంప్రదాయం!!
విజయవాడ, జూలై 15(ఆంధ్రజ్యోతి): ఏడడుగులు, మూడు ముళ్లు.. ఇది పెళ్లి సంప్రదాయం! 23 రోజులు, ఆరు ముడులు, 14 అడుగులు.. ఇది ‘ఆమె’ సంప్రదాయం!! ఈవెంట్ నిర్వాహకురాలిగా పనిచేస్తూ ప్రముఖులకు గాలం వేస్తున్న ఓ మాయలేడి చేసిన ఘనకార్యాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. గత నెల 5న ఓ వ్యక్తిని సింహాచలంలో హిందూ సంప్రదాయం ప్రకారం ఆమె వివాహం చేసుకుంది. తర్వాత 23 రోజులకు అంటే.. గత 27న బెజవాడ దుర్గ గుడిలో మరో వివాహం చేసుకుంది. మొదటిసారి పెళ్లాడిన వ్యక్తికి అప్పటికే వివాహమైంది. అతడి మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ‘ఈవెంట్’ వెనుక ఉన్న చీకటి కోణాలు బయటకొస్తున్నాయి. సదరు కిలేడీ ఇచ్చిన ఝలక్‌లతో షాక్‌లో ఉన్న బాధితులు ఇప్పుడు బయటకు వస్తున్నారు. ఎక్కడైనా ఈవెంట్ నిర్వహిస్తే చాలు.. అందులో ప్రముఖులు కనిపించగానే వారితో ఆమె పరిచయాలు పెంచుకుంటుంది. వైసీపీ హయాంలో ఎక్సైజ్ శాఖలో పనిచేసిన ఓ ఉన్నతాధికారిని అడ్డుపెట్టుకుని.. తనకు శత్రువులుగా భావించిన యువతులపై ప్రతీకారాలు తీర్చుకున్నట్టు సమాచారం. కొంతమంది యువతులతో ఒక గ్రూపును నిర్వహిస్తూ తరకూ బెజవాడలో వివిధ పబ్‌లకు వెళ్తూ..వ్యవహారాలు నడుపుతోంది. పబ్‌లో జరిగిన ఒక కేసు విషయంలో కృష్ణలంక పోలీసులు ఆమెను స్టేషన్‌కు పిలిపించారు. ఆ సమయంలోనే ఆమె రెండు పెళ్లిళ్ల వ్యవహారాన్ని గుర్తించారు.