Share News

Four Students Drown: పుట్టిన రోజు మిగిల్చిన విషాదం

ABN , Publish Date - Oct 26 , 2025 | 05:24 AM

తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదిలో శుక్రవారం సాయంత్రం గల్లంతైన నలుగురు విద్యార్థుల మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి...

Four Students Drown: పుట్టిన రోజు మిగిల్చిన విషాదం

  • ఒకే కుటుంబంలో పిల్లలిద్దరూ మృతి

  • సరదాగా స్వర్ణముఖికి వెళ్లిన స్నేహితుల బృందం

  • హఠాత్తుగా పెరిగిన ప్రవాహం... నలుగురు గల్లంతు

  • శుక్రవారం ఘటన... నిన్న నాలుగు మృతదేహాలు లభ్యం

తిరుపతి(నేరవిభాగం), అక్టోబరు 25(ఆంధ్రజ్యోతి): తిరుపతి సమీపంలోని స్వర్ణముఖి నదిలో శుక్రవారం సాయంత్రం గల్లంతైన నలుగురు విద్యార్థుల మృతదేహాలు శనివారం లభ్యమయ్యాయి. తిరుపతి రూరల్‌ మండలం వేదాంతపురం పంచాయతీ రామదాసుకాలనీకి చెందిన మునస్వామిరెడ్డికి ఇద్దరు కుమారులు. బాలు పెద్దకొడుకు కాగా, చిన్నవాడు తేజ. శుక్రవారం బాలు పుట్టిన రోజు. దీంతో పాఠశాలకు వెళ్లకుండా తమ్ముడు తేజ, గ్రామానికి చెందిన ముత్తల శీను కుమారుడు ప్రకాశ్‌(17), మునిశేఖర రెడ్డి కుమారుడు మునిచంద్ర, మరో ముగ్గురు స్నేహితులు... కలసి స్వర్ణముఖి నదీ తీరానికి వెళ్లారు. సాయంత్రం 4.15 గంటల ప్రాంతంలో నదిలోని ఇసుక దిబ్బలపై ఆడుతూ, స్నానం చేస్తున్న సమయంలో నదిలో నీటి ప్రవాహం ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. అన్నదమ్ములతోపాటు, స్నేహితులు ప్రకాశ్‌, మునిచంద్ర నీటి ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇదే ఘటనలో కృష్ణ, విష్ణు, మునికృష్ణ బయటపడ్డారు. సమాచారం తెలిసిన వెంటనే... శుక్రవారం సాయంత్రం నుంచి ఎన్‌డీఆర్‌ఎ్‌ఫ బృందాలు, పోలీసులు, పైర్‌ సిబ్బంది మూడు బోట్లుతో మృతదేహాల కోసం ముమ్మరంగా గాలించారు. దాదాపు మూడు గంటల తర్వాత బాలు మృతదేహం లభ్యమైంది. భారీ వర్షం కురుస్తుండటం, చీకట్లు కమ్ముకోవడంతో గాలింపు చర్యలను ఆపేశారు. శనివారం తెల్లవారుజామున మళ్లీ గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 8 గంటల ప్రాంతంలో ప్రకాశ్‌ మృతదేహం లభించింది. ఉదయం 10.23 గంటలకు తేజ మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. 12 గంటల పాటు శ్రమించిన ప్రత్యేక బృందాలు... సాయంత్రం 5.20 గంటలకు మునిచంద్ర మృతదేహాన్ని వెలికితీశాయి. మృతదేహాలకు తిరుపతి రుయాలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

Updated Date - Oct 26 , 2025 | 05:25 AM