రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా నలుగురు ఎంపిక
ABN , Publish Date - Sep 04 , 2025 | 12:49 AM
ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన నలుగురు టీచర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్టు డీఈవో పి.వి.జె.రామారావు బుధవారం తెలిపారు.
-ఉమ్మడి కృష్ణాజిల్లాకు అరుదైన గౌరవం
-5న విజయవాడలో అవార్డుల ప్రదానం
-సంతోషం వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయలు
మచిలీపట్నం టౌన్/గన్నవరం/గుడివాడ/పెదపారుపూడి/మోపిదేవి, సెప్టెంబరు 3 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి కృష్ణాజిల్లాకు చెందిన నలుగురు టీచర్లు రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైనట్టు డీఈవో పి.వి.జె.రామారావు బుధవారం తెలిపారు. నాగాయలంక మండలం నాగాయలంక జిల్లాపరిషత హైస్కూల్ బయోలాజికల్ స్కూల్ అసిస్టెంట్ కె.ఉదయకుమార్, మోపిదేవి మండలం కోసూరివారిపాలెం మండల పరిషత ప్రాథమిక పాఠశాల సెకండరీ గ్రేడ్ టీచర్ టి.చంద్రశేఖరరావు, పెదపారుపూడి మండలం దొండపాడు జిల్లాపరిషత ప్రధానోపాధ్యాయురాలు బి.వి.ఎన్.ఎల్.పద్మావతి, గన్నవరం మండలం వీరపనేనిగూడెం ఏపి సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ వై యశోదలక్ష్మి ఈ నెల 5వ తేదీన విజయవాడ ఏ కన్వెన్షన్ హాల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అవార్డులు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. వీరు నలుగురు గురువారం విద్యాశాఖ డైరెక్టర్‌కు రిపోర్టు చేయాలని తెలిపారు. అవార్డుకు ఎంపికైన యశోదలక్ష్మి మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎనిమిది సార్లు జిల్లా స్థాయి అవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు. రాష్ట్రస్థాయి అవార్డు అందుకోనుండటం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులను ఉన్నతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని బి.వి.ఎన్.ఎల్ పద్మావతి తెలిపారు. రాష్ట్రస్థాయి అవార్డుకు ఎంపిక కావడంపై ఆనందం వ్యక్తం చేశారు. 29 సంవత్సరాల నుంచి ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న తుంగల చంద్ర శేఖర్ 2001లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, జిల్లా కలెక్టర్ నుంచి అక్షర కృష్ణ అవార్డులు తీసుకున్నారు. 2016 నుంచి 2018 రెండు సంవత్సరాలపాటు మండల, జిల్లా స్థాయిలో బెస్ట్ పురస్కారాలకు ఎంపికయ్యారు. పాఠశాలలో ఉత్తమ విద్యాబోధన, బోధనా సామాగ్రి ద్వారా విద్యార్థులకు బోధిస్తూ పలు రకాల సాంస్కృతిక అంశాల్లో విద్యార్థులను తీర్చిదిద్దటం ఈయన ప్రత్యేకత. సంపూర్ణ అక్షరాస్యత సాధించే దిశగా ఆయన చేసిన సేవలకు అనేక ప్రశంసాపత్రాలు పొందారు. విద్యార్థులకు వైజ్ఞానిక అంశాలను బోధించటం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ సైన్స్ ఫెయిర్ పోటీలకు వెళ్లే స్థాయిలో విద్యార్థులకు తర్పీదు ఇచ్చినందుకు కొమ్మినేని ఉదయకుమార్‌కు రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. దానితోపాటు నేషనల్ క్యాడెట్ కోర్సు (ఎన్‌సీసీ)లో విద్యార్థులకు శిక్షణ ఇచ్చినందుకు తగిన గుర్తింపు లభించింది.