Sri Sathya Sai District: మూడు వాహనాలు ఢీ నలుగురు మృతి...10మందికి గాయాలు
ABN , Publish Date - Aug 19 , 2025 | 06:37 AM
మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో పదిమంది గాయపడ్డారు.
అంతా బళ్లారి వాసులు.. శ్రీసత్యసాయి జిల్లాలో ఘటన
తనకల్లు, ఆగస్టు 18(ఆంధ్రజ్యోతి): మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో నలుగురు మృతిచెందారు. మరో పదిమంది గాయపడ్డారు. శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద సోమవారం ఈ ప్రమాదం జరిగింది. బళ్లారికి చెందిన 13 మంది టెంపో ట్రావెల్ వాహనంలో అరుణాచలం, తిరుమల-తిరుపతి క్షేత్ర సందర్శనకు వెళ్లారు. దైవ దర్శనం అనంతరం సోమవారం తిరుగు ప్రయాణమయ్యారు. వీరు ప్రయాణిస్తున్న వాహనం తనకల్లు మండలం మండ్లిపల్లి వద్ద ముందు వెళ్తున్న మరో టెంపో ట్రావెల్‌ను ఓవర్‌టేక్ చేయబోయింది. అదే సమయంలో కదిరి నుంచి మదనపల్లికి వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వచ్చింది. ఈ క్రమంలో మూడు వాహనాలు ఢీకొన్నాయి. బళ్లారివాసులు ప్రయాణిస్తున్న వాహనంలోని అనసూయమ్మ (50), జాహ్నవి(4), డ్రైవర్ మణికంఠ(42), నాగేంద్రప్ప (58) మృతిచెందారు. ఆర్టీసీ బస్సు, మరో టెంపో ట్రావెలర్‌లో ఉన్నవారు సురక్షితంగా బయట పడ్డారు.